Breaking News

క‌ష్టాల‌క‌డ‌లిని ఈది

Mar 07, 2016 19:21
 క‌ష్టాల‌క‌డ‌లిని ఈది

జీవితం  అందరికీ ఒడ్డిచ్చిన విస్తరి కాదు..కష్టసుఖాలు సహజం..కష్టపడినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. కష్టాల కడలిని ఈది అందరికీ ఆదర్శప్రాయమైన జీవితం గడిపే వారు కొందరే ఉంటారు. ఇతరులకు నిత్యం చైతన్య స్పూర్ఫిని  నింపేవారేందరూ ఆణిముత్యాలాంటివారు. స్వశక్తితో ఎదిగే మహిళలు చాలా తక్కువగా ఉంటారు. సరైన ప్రోత్సాహం లేక చాలామంది వెనకబడిపోతున్నారు. అలాంటి వారిని ప్రోత్స‌హించి వారిని పారిశ్రామిక‌వేత్త‌లుగా త‌యారుచేసి వారితో పాటు వేల‌మంది ఉపాధి పొందేలా చేశారు ఎలీఫ్ అధ్య‌క్షురాలు ర‌మాదేవి గారు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆమెతో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ.

1993 సంవ‌త్స‌రంలో...

మ‌హిళ‌లు ఆర్థికంగా నిల‌దొక్కుకోవ‌డానికి 1993 సంవ‌త్స‌రంలో ఎలీఫ్ అనే సంస్థ‌ను ప్రారంభించాను. మ‌హిళ‌లు వంటింటి కుందేళ్లలా కాకుండా పారిశ్రామిక‌వేత్త‌లుగా రాణించాల‌న్న‌దే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. మొద‌ట్లో ఆఫీసు కూడా లేకుండా ఉండేది. ఆ త‌రువాత కొంత‌మంది మ‌హిళ‌ల‌తో క‌లిసి చిన్న ఆఫీసును ప్రారంభించాం. 1994వ సంవ‌త్స‌రంలో అంత‌ర్జాతీయ మ‌హిళా స‌ద‌స్సుకు అప్ప‌టి సీఎం కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా పిలిచాం. అప్పుడు ఆయ‌న‌తో మా స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించాం. దీంతో ఆయ‌న 20 ఎక‌రాలను గాజుల‌రామారం ద‌గ్గ‌ర కేటాయించారు. అనంత‌రం చంద్ర‌బాబు గారు సీఎంగా ఉన్న‌ప్పుడు మ‌రో 10 ఎక‌రాల‌ను కేటాయించారు. అప్ప‌ట్లో ఆ ప్ర‌దేశం కొండ‌లు, గుట్టల‌తో నిండి ఉండేది.

మేము చాలా ఇబ్బందులు ప‌డ్డాం...

మా భ‌ర్త గారు ఇంజ‌నీర్‌. మొద‌ట్లో మూత‌బ‌డిన ఒక కంపెనీని తిరిగి ప్రారంభించ‌డానికి తీసుకున్నారు. 100 మంది కార్మికులు అప్ప‌ట్లో మా ద‌గ్గ‌ర ప‌నిచేసేవారు. బ్యాంకు రుణం దొర‌క్క చాలా ఇబ్బందులు ప‌డ్డాం. దీంతో మా పొలాన్ని అమ్మి కార్మికుల‌కు జీతాలు చెల్లించాం. ఇలా మేము ప‌డిన బాధ‌ల‌ను, ఇబ్బందుల‌ను ద‌`ష్టిలో పెట్టుకొని వేరే మ‌హిళ‌లు నాలా ఇబ్బంది ప‌డొద్ద‌ని నేను భావించాను. మొద‌ట్లో నేను ఫ్యాప్సీ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అనే సంస్థలో మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలిగా ప‌నిచేశాను.

మొద‌ట్లో ముగ్గురితో ప్రారంభ‌మై..

మొద‌ట్లో ముగ్గురితో ప్రారంభ‌మైన‌ ఎలీఫ్ సంస్థ‌ ప్ర‌స్తుతం 10,000 మంది మ‌హిళ‌ల మెంబ‌ర్‌షిప్ క‌లిగిఉంది. ఇక్క‌డ‌కు ఎక్కువ‌గా సాధార‌ణ మ‌హిళ‌లు వ‌స్తారు. వారికి ఏదో బిజినెస్ చేయాల‌ని ఉంటుంది.. కానీ వాటికి సంబంధించి పూర్తి అవ‌గాహ‌న‌, పెట్టుబ‌డి ఉండ‌దు.  అలాంటి వారి కోసం ఇక్క‌డ ఈ.డి.పి  నిపుణుల‌తో కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తాం. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో సైతం ఈ సంస్థ కార్య‌క‌లాపాలు నిర్వ‌హి స్తుంది.

 200 మంది మ‌హిళ‌ల‌తో పారిశ్రామిక‌వాడ…‌

పారిశ్రామిక వాడ‌లు  మెద‌క్‌, విజ‌య‌వాడ‌, గాజుల‌రామారంలో ఉన్నాయి. మ‌హిళ‌ల‌ పేరుతో ఆస్తుల‌ను చేసి వారికి లోన్‌ల‌ను ఇప్పిస్తాం. బ్యాంక్ వారు మ‌హిళ‌ల పేరు మీద ఏమిలేన‌ట్ల‌యితే వారికి లోన్ ఇవ్వ‌రు కావున మ‌హిళల పేరు మీద 500 గ‌జాల స్థ‌లాన్ని రిజిస్ట్రేష‌న్‌ చేస్తాం. మెద‌క్ జిల్లా నందిగామ గ్రామంలోని పారిశ్రామిక‌వాడ‌లో 200 మంది మ‌హిళ‌ల‌తో పారిశ్రామిక‌వాడ‌ను ప్రారంభిస్తున్నాం. వీరికోసం బ్యాంక‌ర్లు సైతం రుణం తీర్చ‌డానికి గ‌డువును 8 సంవ‌త్స‌రాల వ‌ర‌కు పొడిగించారు.  ప్ర‌భుత్వంతో ఎంఓయూ కుదుర్చుకొని కేంద్ర నుంచి కొంత గ్రాంటును తీసుకువ‌చ్చి వీరికి సౌక‌ర్యాలు క‌ల్పించాల‌న్న‌దే మా ఉద్దేశ్యం.  గాజుల‌రామారంలోని పారిశ్రామిక‌వాడ‌లో 124 ప‌రిశ్ర‌మ‌లు న‌డుస్తున్నాయి. ఇంత‌వ‌ర‌కు వారికి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. మూడు నుంచి 30 పారిశ్రామిక‌వాడ‌లుగా  పెర‌గాల‌న్న‌దే మా కోరిక‌.

 

కేంద్ర‌, రాష్ట ప్ర‌భుత్వాల ప‌థ‌కాల‌కు వార‌థిగా...

కేంద్ర‌, రాష్ట ప్ర‌భుత్వాల ప‌థ‌కాల‌ను పేద మ‌హిళల‌కు అందించ‌డ‌మే మా సంస్థ ఉద్దేశ్యం. దీనివ‌ల్ల స‌క్స‌స్ రేటు ఎక్కువ‌గా ఉంది. 16 మంత్రిత్వ శాఖ‌ల‌తో క‌లిసి ఈ ప‌థ‌కాలను మ‌హిళ‌ల‌కు అందేలా చూస్తున్నాం. గార్మేంట్స్‌, జూట్‌, హ్యాండీక్రాఫ్ట్‌ల‌పై శిక్ష‌ణ ఇస్తున్నాం. ప్లాస్టిక్ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి  సిపెట్‌, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించి సిఎఫ్‌టిఆర్ఐ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ క‌న్స‌ల్టెంట్‌ ద్వారా యూనిట్‌ల‌కు సంబంధించి మ‌హిళ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాం. ఈ మ‌ధ్య పెద్దమొత్తంలో విదేశాల నుంచి వాల్‌మార్ట్‌, ఫ్యాబ్ ఇండియా నుంచి ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయి.

వందేమాత‌రం

ఇప్పుడు మినిస్ట్రీయ‌ల్ ఆఫ్ టెక్స్‌టైల్స్ వారి ప్రోత్సాహంతో  వందేమాతరం అనే పేరు మీద 40,000 మంది మ‌హిళ‌లకు స్కిల్ డెవ‌ల‌ఫ్‌మెంట్ శిక్ష‌ణ ఇచ్చాం. దేశం నాకు ఏమిచ్చింది అనే కంటే నేను దేశానికి ఏమి ఇచ్చాను అనే భావ‌న‌తోనే వందేమాత‌రం అనే పేరును నామ‌క‌ర‌ణం చేశాం. ఇక్క‌డ‌ శిక్ష‌ణ తీసుకున్న మహిళ‌లు ఆర్థికంగా బాగా నిల‌దొక్కుకుంటున్నారు. వందేమాతరం కింద శిక్ష‌ణ తీసుకున్న మ‌హిళ‌ల‌కు బ్యాంకుల నుంచి ముద్రలోన్‌, క్రెడిట్ గ్యారంటీ ట్ర‌స్టు స్కీం కింద ష్యూరిటీ లేకుండా కోటీ రూపాయ‌ల రుణాల‌ను మంజూరు చేస్తారు. వందేమాతరం కింద రెండు నెల‌ల శిక్ష‌ణ తీసుకున్న మ‌హిళ‌ల‌కు  స‌ర్టిఫికెట్ అంద‌చేస్తారు. ఈ స‌ర్టిఫికెట్  వీరికి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. 4 వ‌త‌ర‌గ‌తి చ‌దివి 40 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు క‌లిగిన మ‌హిళ‌లు ఈ శిక్ష‌ణకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

జూట్ ప‌రిశ్ర‌మ‌తో ఉపాధి

ఫ్యాష‌న్ డిజైనింగ్ నేర్చుకున్నాను. ప‌దిమందికి ఉపాధి ఎలాగైనా క‌ల్పించాల‌న్న‌దే నాకు మొద‌టి నుంచి ఆలోచ‌న. దీంతో నాకు తెలిసిన వారి ద్వ‌రా ఎలీఫ్ అనే సంస్థ‌ను సంప్ర‌దించాను. నా ద‌గ్గ‌ర ఉన్న ఆలోచ‌న‌ను వారితో పంచుకున్నాను. దీంతో వారు ఎలీఫ్ సంస్థ నిర్వ‌హిస్తున్న వందేమాత‌రంలో చేర్పించారు. 2 నెల‌ల శిక్ష‌ణ‌ను నిపుణుల స‌మ‌క్షంలో ఇప్పించారు. నా ఆలోచ‌న‌కు మ‌రింత ప‌దునుపెట్టారు. లోన్‌కు ఎలా వెళ్లాలి, మార్కెటింగ్‌కు సంబంధించిన‌ మెళ‌కువ‌లను నేర్పించారు. శిక్ష‌ణ అనంత‌రం గాజుల‌రామారంలోని పారిశ్రామిక‌వాడ‌లో త‌క్కువ ఫీజుతో ప‌రిశ్ర‌మ‌ను పెట్టుకోవ‌డానికి స్థ‌లాన్ని కేటాయించారు. సంవ‌త్స‌ర కాలంగా నేను ముందుకు వెళ్ల‌డ‌మే కాకుండా 50 మందికి ఉపాధి క‌ల్పిస్తున్నాను. ఈ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి జ‌న‌ప‌నార మ‌రియు అర‌టినార ఏలూరు మ‌రియు ప‌శ్చిమ‌బెంగాల్ నుంచి తీసుకువ‌స్తాం. మేము త‌యారుచేసే వ‌స్తువుల‌ మార్కెటింగ్ సంబంధించి వందేమాతరం సంస్థ నుంచి మాకు ప్రోత్సాహం ల‌భిస్తుంది. జ‌న‌ప‌నారతో బ్యాగులు మ‌రియు సూట్‌కేసులు త‌దిత‌ర వాటిని త‌యారు చేసి విక్ర‌యిస్తున్నాం. ఎలీఫ్ సంస్థ చేసిన స‌హాయం నేను ఎప్ప‌టికీ మ‌రువ‌లేను. నేను కూడా మ‌రికొంద‌రికీ సాయం చేయ‌డానికి దారి దొరికింది.

ల‌క్ష్మీసౌమ్య, సాయి కార్తీకేయ జూట్ నిర్వాహ‌కురాలు

 

ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా

మ‌హిళ‌లు ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా త‌మ కాళ్ల మీద నిల‌బ‌డ‌డానికి ఎలీఫ్ సంస్థ చాలా సాయం చేస్తుంది. నేను మొద‌ట‌గా ఎంఎన్‌సీ కంపెనీలో ఫ్లోర్ మేనేజ‌ర్‌గా ప‌నిచేశాను. ఇదే జీవితం కాద‌న్నా ఉద్దేశ్యంతో ఈ సంస్థ‌ను సంప్ర‌దించాను. వందేమాత‌రం కింద శిక్ష‌ణ తీసుకున్నాను. నాకు గార్మెంట్స్ కు సంబంధించి బిజినెస్ చేయాల‌న్న ఆలోచ‌న ఉంది. నా శిక్ష‌ణ అనంత‌రం లోన్ గురించి ఎలీఫ్ సంస్థ అధ్య‌క్షురాలు ర‌మాదేవి గారిని క‌లిసి తెలిపాను. దీంతో ఆవిడ 30 ల‌క్ష‌ల లోన్‌ను బ్యాంకు నుంచి మంజూరు చేయించారు. దీంతో పాటు మా ద‌గ్గ‌ర ఉన్న 20 ల‌క్ష‌ల వాటికి క‌లిపి 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో బ్రిందా గార్మంట్స్ ను గాజుల‌రామారంలోని పారిశ్రామిక‌వాడ‌లో నెల‌కొల్పాం. బ‌య‌టి కంపెనీల నుంచి వ‌ర్క్ ఆర్డ‌ర్‌ను తీసుకొని మేము ముందుకెళుతున్నాం. మా ద‌గ్గ‌ర ప్ర‌స్తుతం 70 మంది ప‌నిచేస్తున్నారు. 50 కుట్టుమిష‌న్‌లు ఇక్క‌డ ఉన్నాయి. బ‌య‌టి వ్య‌క్తుల‌కు సైతం ప‌నిక‌ల్పిస్తుంటాం. రోజుకు 500 shirtsను కుడతాం. ఇంకా సొంత ప్రొడ‌క్ష‌న్ చేయాల‌ని ఉన్నా పెట్టుబ‌డి లేక వ‌ర్క్ ఆర్డ‌ర్‌పై ప‌నిచేస్తున్నాం.

శైల‌జ, బ్రిందా గార్మెంట్స్ నిర్వాహ‌కురాలు

Facebook like
Google Plus Circle
Youtube Subscribe