Breaking News

ప్ర‌పంచంలో ప‌నికిరానిది ఉండ‌దు

Apr 14, 2016 13:05
ప్ర‌పంచంలో ప‌నికిరానిది ఉండ‌దు

ప్ర‌పంచంలో ప‌నికిరానిది ఉండ‌ద‌ని, ప‌నికిరాదు అనేక‌న్నా దానిని ప‌దిమందికి ప‌నికివ‌చ్చేలా చేయ‌డ‌మే నిజ‌మైన క‌ళని అంటాడు కోరా వ్య‌వ‌స్థాప‌కులు పోలుదాస్ నాగేంద్ర సతీష్.  దానినే నిజం చేసి చూపిస్తున్నాడు ఆయ‌న‌. ఆ క‌ళ‌ను నిజం చేయ‌డానికి కోరా (kora) అనే సంస్థను నెలకొల్పారు. 

పుట్టింది విజయవాడలో... పెరిగింది హైద‌రాబాద్‌లో ...

తను పుట్టింది విజయవాడలో అయినా పెరిగింది మాత్రం హైద‌రాబాద్‌లో. త‌ను  వివిధ ప్రాంతాల్లో చ‌దువును పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అహ్మదాబాద్లో తనకి సీటు దొర‌క‌డం త‌న అదృష్ట‌మ‌ని త‌న జీవితంలో మార్పు రావ‌డానికి కార‌ణం అదేన‌న్నారు.  2004 సంవ‌త్స‌రంలో కోర్సు అయిపోయిన‌ అనంత‌రం బెంగ‌ళూరులో కొన్ని రోజులు ఉద్యోగం  చేశారు. త‌న‌కు కావాల్సింది వేరే అని అర్థమయి ఉద్యోగం మానేసి పల్లెటూర్లపై తన ఆలోచనను కేంద్రీకరించాడు. ఈ విష‌య‌మై  కొన్ని ఎన్జీవోల‌తో క‌లిసి ఆయ‌న‌ ప‌నిచేశారు. . 

 

2008 సంవత్సరంలో కోరా ....

 2008 సంవత్సరంలో కోరా అనే సంస్థను ప్రారంభించారు స‌తీష్‌. మన చుట్టూ ఎన్నో ర‌కాల స‌హ‌జ సిద్ధ‌మైన వాటిని చూస్తుంటాం. వాటిని మనిషికి ఉపయోగపడేలా ఎందుకు తయారు చేయకూడదని అతని మదిలో మొదలైంది. దీంతో వాటితో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టి సక్సెస్  సాధిస్తున్నాడు. ప‌ల్లెటూళ్ల నుంచి ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స వెళ్లే వారు ఏదో ఆశించి వెళుతుంటారు. కానీ అక్క‌డ వెళ్లాక‌ అక్క‌డ మ‌నం ఆశించింది ఉండ‌దు. ప‌ల్లెటూళ్ల క‌న్నా ప‌ట్ట‌ణంలో ఏమీ లేద‌ని తెలియ‌చెప్పి వారికి మంచి జీవితాన్ని రుచి చూపించాల‌న్న‌దే కోరా ముఖ్య ఉద్ధేశ్య‌మ‌ని ఆయ‌న తెలిపారు. దీనికోసం తనతో పాటు మరో 11 మందిని కలుపుకున్నారు. 

సృజని అనే ఎన్జీఓ సంస్థ 

 సృజని అనే ఎన్జీఓ సంస్థకు చెందిన వీణా ఉపాధ్యాయ కోరా సంస్థ భాగ‌స్వామ్యంతో శివాన్ జిల్లాలోని కొన్ని గ్రామాలను అభివృద్ధి చేయ‌డానికి  న‌డుంబిగించారు.  అక్కడి మహిళలు ఇంటికే పరిమితమయ్యారని వారిలో చైతన్యం తీసుకురావాలని, వారి కాళ్లపై వారు నిలబడేలా వారికి ఉపాధి కల్పించాలని ఆమె కోరా సంస్థ‌ను కోరారు. దీంతో సతీష్ అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకొని పత్తి నుంచి డైరెక్టుగా దారాన్ని (ఖాదీ) యంత్రం సాయం లేకుండా ఎలా తీయాలో వారికి నేర్పిస్తున్నారు. అలా గ్రామాల్లోని మహిళలను చైతన్యపరుస్తూ వారికి జీవనోపాధిని కల్పిస్తున్నారు. వారికి రోజువారి కూలీతో పాటు వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలన్న సంకల్పంతో ఒక  ప్రణాళికను తయారుచేశాడు. ఈ విషయం తెలుసుకున్న(ప‌రివ‌ర్త‌న) అనే ఎన్జీవో సంస్థ త‌న ఆధ్వ‌ర్యంలో ఉన్న గ్రామాల‌ను  (ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ సంజీవ్‌కుమార్)  అభివృద్ది చేయాలని  కోరా సంస్థను కోరారు. ప్రస్తుతం  సంవత్సరం కాలంగా  అక్క‌డి ప్ర‌జ‌ల్లో చైతన్యం తీసుకువచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా వీరు కృషి చేస్తున్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా ప‌త్తి పండించ‌డం నుంచి బ‌ట్ట కుట్ట‌డం వ‌ర‌కు అంతా అక్కడే త‌యారుచేస్తున్నారు. ఈ పంట‌ను కూడా ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో పండిస్తున్నారు.

పేపర్, మట్టి, సిరామిక్, లెదర్, బట్ట, మెట‌ల్‌, చెక్క‌...

కోరా సంస్థ ఎక్కువగా పేపర్, మట్టి, సిరామిక్, లెదర్, బట్ట, మెట‌ల్‌, చెక్క తదితర వాటిని ఉపయోగించి ఉత్తత్పులను తయారుచేస్తుంది. మార్కెటింగ్ కు సంబంధించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి వాటిని ఎలా అమ్మాలో వారికి అవ‌గాహ‌న క‌ల్పిస్తుంది. విదేశాల్లో వీరు తయారుచేసిన ఉత్తత్పులకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సంస్థ పనిచేస్తుంది. 

 

తక్కువ ధరలో ఇళ్లను...

తక్కువ ధరలో  ఇళ్లను క‌ట్టించ‌డ‌మే తమ సంస్థ ముఖ్య ఉద్ధేశ్యమని కోరా వ్యవస్థాపకులు సతీష్ తెలిపారు. ఇప్పుడు కట్టే ఇళ్లకు సిమెంట్ ఎక్కువగా వాడుతున్నారని అలా వాడడం వలన ధర ఎక్కువ అవుతుంద‌ని ఆయన తెలిపారు, దీనికన్నా సున్నం, న్యాచురల్ ఫైబర్ వాడడం వలన తక్కువ ధరకు ఇళ్లను నిర్మించవచ్చన్నారు. దీనిపైనే చాలావరకు ప్రయోగాలు చేశామన్నారు. దీంతో పాటు మంచి ఆహారం,  విద్య‌, ఆరోగ్యం అందించాల‌న్న‌దే త‌మ సంస్థ ధ్యేయ‌మ‌న్నారు. ఉద్యోగం చేసిన‌ప్ప‌టికీ కంటే ఇప్పుడే జీవితంలో తృప్తిగా ఉంద‌న్నారు.

డబ్బు వలన మనిషికి ప్రశాంతత రాదు....

మన చుట్టుపక్కల వాటి విలువ గురించి చాలామందికి తెలియదు. వాటి గురించి తెలుసుకున్నప్పుడే మనిషి ముందుకు వెళతాడని ఆయన తెలిపారు. అలాంటి వాటి గురించి తెలియచెప్పాలనే ఉద్దేశ్యంతో కోరాను నెలకొల్పాన‌న్నారు. కేవ‌లం డబ్బు వలన మనిషికి ప్రశాంతత రాదని, మనం చేసే పని ఎదుటి మనిషికి ఉప‌యోగ‌ప‌డినప్పుడు మనకు ఆనందమన్నారు. మనిషి చనిపోయేటప్పుడు సైతం ప్రశాంతమైన మరణాన్ని పొందాలంటాడు సతీష్. డబ్బులు ఉండాలి కానీ అదే జీవితం కాకూడదని, మా సంస్థ ఉద్దేశ్యం కూడా అదేనని పల్లెటూర్లను ప్రగతిపథంలో తీసుకుపోవాలన్నదే మా థ్యేయమని డబ్బు కోసం విలువలను దిగజార్చకోవద్దన్నారు. 

ఎవ‌రూ న‌ష్ట‌పోకుండా చేయాల‌న్న‌దే ...

కొనేవాడికి అమ్మేవాడికి మ‌ధ్య మంచి అవ‌గాహ‌న కుదుర్చి ఎవ‌రూ న‌ష్ట‌పోకుండా చేయాల‌న్న‌దే మా త‌ప‌న్నారు. అర‌టినార‌తో 4 ర‌కాల ఫైబ‌ర్‌ను బ‌య‌ట‌కు తీయ‌వ‌చ్చ‌ని వాటితో ప‌లు ప్ర‌యోగాలు చేసి విజ‌యం సాధించామ‌ని ఆయ‌న తెలిపారు. ఆఫ్రికాలో సైతం త్వ‌ర‌లో ఒక‌ ప్రాజెక్టు చేయ‌బోతున్నామ‌ని దీనికి సంబంధించి ఫ్రెంచ్ కంపెనీతో అవ‌గాహ‌న కుదుర్చుకున్నామ‌ని ఆయ‌న‌ తెలిపారు. మిష‌న్ కు మ‌నిషికీ తేడా తెలుసుకున్నప్పుడే మ‌నిషి బ్ర‌త‌క‌వ‌చ్చ‌ని అంద‌రూ తెలుసుకోవాల్సిన విష‌య‌మ‌న్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe