Breaking News

అమ్మా,నాన్న‌లే ఆద‌ర్శం...

May 23, 2016 04:49
అమ్మా,నాన్న‌లే ఆద‌ర్శం...

 మొద‌టి నుంచి ప‌దిమందికి సాయం చేయ‌మ‌ని, నీతి, నిజాయితీగా బ‌త‌కాల‌ని మా అమ్మ‌నాన్న‌లు నేర్పించారు. అదే నాకు వంట‌బ‌ట్టింది. వాళ్ల‌ను ఆద‌ర్శంగా తీసుకుని నేను నా ఉద్యోగ బాధ్య‌త‌ల‌ను నిర్వర్తిస్తున్నాను. మా నాన్న‌గారు హెడ్‌మాస్ట‌ర్‌. మా స్వ‌గ్రామం చేవెళ్ల మండ‌లం. అంచెలంచెలుగా ఎదిగి ప్ర‌స్తుతం న్యాయ‌శాఖ ఉద్యోగుల సంఘం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్నాను. అన్ని రాష్ట్రాల్లోని న్యాయ‌శాఖ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని పేర్కొంటున్నారు ఏఓ (అడ్మినిస్టేటీవ్ అధికారి) ల‌క్ష్మారెడ్డి.

1983 అక్టోబ‌ర్ నెల‌లో...

1983 అక్టోబ‌ర్ నెల‌లో రంగారెడ్డి జిల్లా ప‌రిగి కోర్టులో స్టెనోగ్రాప‌ర్ చేరాను. 1988 సంవ‌త్స‌రంలో సీనియ‌ర్ అసిస్టెంట్‌గా ప‌దోన్న‌తి పొందాను. 1996 సూప‌రింటెండెంట్‌గా రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం కోర్టుకు ప‌దోన్న‌తిపై వెళ్లాను. 2008 సంవ‌త్స‌రంలో చీఫ్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీస‌ర్‌గా ప‌దోన్న‌తి పొంది ఖ‌మ్మం జిల్లా అడిష‌న‌ల్ డిస్ట్రిక్ కోర్టులో ప‌నిచేశాను.

 

రంగారెడ్డి జిల్లా న్యాయ‌శాఖ ఉద్యోగుల ఉపాధ్య‌క్షుడిగా...

మొద‌ట‌గా నేను రంగారెడ్డి జిల్లా న్యాయ‌శాఖ ఉద్యోగుల ఉపాధ్య‌క్షుడిగా 1989 సంవ‌త్స‌రంలో ఎన్నికయ్యాను. 1999 సంవ‌త్స‌రంలో న్యాయ శాఖ ఉద్యోగుల కో-ఆప‌రేటీవ్ సోసైటీ అధ్య‌క్షుడిగా సైతం ప‌నిచేశాను. 1996 సంవ‌త్స‌రంలో న్యాయ‌శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా న‌న్ను ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక త‌రువాత ప్ర‌తి జిల్లాలో ప‌ర్య‌టించి న్యాయ‌శాఖ ఉద్యోగుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాను. నేను ఉద్యోగంలో చేరిన‌ప్ప‌టి నుంచి స‌మ‌స్య‌ల‌పై నాకు అవ‌గాహ‌న ఉంది. మా యొక్క 1964 స‌ర్వీసు నిబంధ‌న‌ల స‌డ‌లింపుపై 1990 సంవ‌త్స‌రంలో హైకోర్టు ఒక నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అంద‌చేసింది. నేను కార్య‌ద‌ర్శిగా ఎన్నికైన‌ప్ప‌టికీ ఎక్క‌డివేసిన గొంగ‌ళి మాదిరిగానే మా స‌మ‌స్య‌లు అలాగే ఉండిపోయాయి. ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారినికై సీఎం, మంత్రుల‌ను, లా సెక్ర‌ట‌రీ త‌దిత‌రుల‌ను క‌లిసి ఈ విష‌య‌మై చ‌ర్చించాను. 2003 సంవ‌త్స‌రంలో కొంత‌మేర‌కు విజ‌యం సాధించాం. త‌ద‌నంత‌రం ఉద్యోగుల సంఘం రాష్ట్ర‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా విశాఖ‌ప‌ట్నంలో అత్య‌ధిక మెజార్టీతో గెలిపించారు. అప్ప‌టి నుంచి నేను ఉద్యోగుల కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మించాను.  కోర్టుల‌కు సెల‌వు స‌మ‌యంలో ఉద్యోగులు ప‌నిచేయాల్సి వ‌చ్చేది. జీతం మాత్రం అనుకున్నంత‌గా రాక‌పోయేది. దీనివ‌ల్ల అంద‌రూ ఇబ్బందులు ప‌డ్డాం.

 

ఆల్ ఇండియా కార్య‌వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం

జ‌స్టిస్ శ్రీ‌రాములు గారి నేతృత్వంలో జ‌డ్జీల‌కు బెట‌ర్ పే స్కేల్ కావాల‌ని వారు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ సంద‌ర్భంలోనే మేము కూడా ఆల్ ఇండియా కార్య‌వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకొని, న్యాయ‌శాఖ‌లో మేము కూడా ఒక భాగం (అడ్మినిస్ర్టేటీవ్) కాబ‌ట్టి మా స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్కరించాల‌ని దానికోసం ఒక క‌మిటీ వేయాల‌ని మా సంఘం త‌ర‌పున సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశాం. ఈ పిటీష‌న్ స్వీక‌రించిన న్యాయ‌స్థానం జ‌స్టిస్ జ‌గ‌న్నాథ శెట్టి అనే క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ ఆల్ ఇండియా న్యాయ‌శాఖ ఉద్యోగుల స్థితిగ‌తులను క్షుణ్ణంగా ప‌రిశీలించి సుప్రీంకోర్టుకు ఒక నివేదిక‌ను స‌మ‌ర్పించింది. మా స‌మ‌స్య‌ల‌న్నీ నిజ‌మేన‌ని నిర్ధారించి  అన్ని రాష్ర్టాల ప్ర‌భుత్వాల‌కు, రాష్ట్ర హైకోర్టులకు జ‌స్టిస్ జ‌గ‌న్నాథ శెట్టి క‌మిష‌న్ యొక్క‌ సూచ‌న‌లను అమ‌లు చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2006 సంవ‌త్స‌రంలో స‌న్నీబాబు  మా న్యాయ‌శాఖ ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు ప‌ద‌వీ విర‌మ‌ణ కావ‌డంతో న‌న్ను ఏక‌గ్రీవంగా మా అసోసియేష‌న్ త‌ర‌ఫున‌ అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు. నేను అధ్య‌క్షుడిగా ఎన్నికైన నాటికీ స‌మ‌స్య‌లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విష‌య‌మై హైకోర్టు, ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగింది. 2009 నుంచి 2014 జూన్ 

సౌత్ ఇండియా త‌ర‌పున సెక్ర‌ట‌రీగా ...

ఇదిలా ఉండ‌గా నేను చేసిన పోరాటం ఫ‌లితంగా ఆల్ ఇండియా అసోసియేష‌న్ వారు న‌న్ను గుర్తించి సౌత్ ఇండియా త‌ర‌పున న‌న్ను సెక్ర‌ట‌రీగా ఎన్న‌కున్నారు. ఆ త‌రువాత ఆల్ ఇండియా ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేశాను. 2015 ఆగ‌ష్టులో ఆల్ ఇండియా మీటింగ్ హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ఈ మీటింగ్‌కు  ఉమ్మ‌డి హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బొసాలే, సీనియ‌ర్ జ‌స్టిస్ సుభాష్ రెడ్డి ప్ర‌స్తుతం (గుజ‌రాత్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌)  జ‌స్టిస్ చంద్ర‌య్య‌, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ డాక్ట‌ర్ ష‌కీల్ మోహిన్ అహ్మ‌ద్ (బీహ‌ర్ రాష్ట్రం), సురేష్ శ‌ర్మ కార్య‌ద‌ర్శి (ఢిల్లీ) సీనియ‌ర్ వైస్ ్ర‌పెసిడెంట్‌ సురేష్ఠాకూర్ (హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌)ల‌తో పాటు అన్ని రాష్ట్రాల అధ్య‌క్షులు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌లు,  ఉద్యోగులు హాజ‌ర‌య్యారు. మా స‌మ‌స్య‌ల గురించి ఇక్క‌డ‌ చ‌ర్చించాం. ఈ స‌మ‌యంలోనే న‌న్ను న్యాయ‌శాఖ ఉద్యోగుల సంఘం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నుకున్నారు. సౌత్ఇండియాకు చెందిన వారు ఎవ‌రూ ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప‌ద‌వికి ఎన్నిక‌కాలేదు. మొద‌ట‌గా నాకు ఈ అదృష్టం ద‌క్క‌డం సంతోషంగా ఉంది. ఈ  ప‌ద‌వికి నేను పూర్తిగా న్యాయం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తా. అన్ని రాష్ట్రాల‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌పై అవిశాత్రంగా పోరాటం చేయాల‌ని మా సంఘం త‌ర‌ఫున మేము నిర్ణ‌యించాం. 

న్యాయ‌శాఖ ఉద్యోగుల పాత్ర కీల‌కం

ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటు విష‌యంలో తెలంగాణ కాకుండా మిగ‌తా 13 జిల్లాల న్యాయ‌శాఖ ఉద్యోగులు మాకు అన్ని విధాలా స‌హ‌క‌రించారు.  అప్ప‌డు నేను 23 జిల్లాల న్యాయ‌శాఖ ఉద్యోగుల అధ్య‌క్షుడిగా ఉన్నాను. నేను వారితో చెప్పాను నేను తెలంగాణ‌కు చెందిన వ్య‌క్తిని, నేను ఈ ప్రాంతం కోసం పోరాడుతున్నా మీకు ఏ విధ‌మైన అభ్యంత‌రాలున్నా నేను అధ్య‌క్షుడిగా ఉండ‌న‌ని వారితో పేర్కొన్నాను. వారు నాకు అన్ని విధాలా స‌హ‌క‌రించారు. దీంతోపాటు నేను తెలంగాణ న్యాయ‌శాఖ ఉద్యోగుల జేఏసీ చైర్మ‌న్‌గా ప‌నిచేశాను. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటులో మా న్యాయ‌శాఖ ఉద్యోగుల పాత్ర కీల‌క‌మ‌నే చెప్ప‌వ‌చ్చు.

పోస్టుల‌ను భ‌ర్తీ చేయాలి 

తెలంగాణ‌లో 533, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 626 పైచిలుకు  అన్ని విభాగాల‌లో జ‌స్టిస్ జ‌గ‌న్నాథ శెట్టి క‌మిష‌న్ సిఫార‌సుల మేర‌కు కొత్త పోస్టుల‌ను మంజూరు చేయాల‌ని రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు  హైకోర్టు నివేదించ‌డం జ‌రిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌కు అనుగుణంగా ఇది ఉండాల‌ని  ఆల్ఇండియా న్యాయ‌శాఖ ఉద్యోగుల త‌రుపున నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.

నివేదిక‌ల‌ను తిప్పి పంపించాయి

 తెలంగాణ ఏర్ప‌డి దాదాపు రెండు సంవ‌త్స‌రాలు అవుతున్నా ఇప్ప‌టివ‌ర‌కు  హైకోర్టు విభ‌జ‌న జ‌ర‌గ‌లేదు. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు, న్యాయ‌వాదుల‌కు , ఉద్యోగులకు ఇబ్బంది అవుతోంది. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం నిమిత్తం ప్ర‌భుత్వానికి పంపించిన నివేదిక‌ల‌ను హైకోర్టుకు తిప్పి పంపించాయి. ఎందుకంటే విభ‌జ‌నకు ముందు పంపించిన స‌మ‌స్య‌ల చిట్టా కాబ‌ట్టి మ‌ళ్లీ కొత్త‌గా రెండు రాష్ట్రాల స‌మ‌స్య‌ల‌ను వేరు వేరుగా నివేదించాల‌ని రెండు ప్ర‌భుత్వాలు పేర్కొన్నాయి.  హైకోర్టు విభ‌జ‌న విష‌య‌మై తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర‌మంత్రులు స్పందించాల‌ని నేను కోరుతున్నాను. క‌మ‌ల్‌నాథ‌న్ క‌మిటీ వ‌ల్ల‌ ఉద్యోగుల విభ‌జ‌న‌కు సంబంధించి ఆల‌స్యం కావ‌డం వ‌ల‌న చాలామంది ఉద్యోగులు న‌ష్ట‌పోతున్నారు. చాలామంది ఉద్యోగులు ఎవ‌రి రాష్ట్రానికి వారు వెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్న క‌మ‌ల్‌నాథ‌న్ క‌మిటీ ఒప్ప‌కోవ‌డం లేదు. కావున ఈ విష‌య‌మై రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు పున‌రాలోచించాల‌ని త్వ‌ర‌గా విభ‌జ‌న‌ను పూర్తి చేయాల‌ని కోరుతున్నాను. ప్ర‌తి ఉద్యోగి స‌ర్వీసు రిజిష్ట‌ర్‌లో త‌న స్థానిక‌త‌ను తెలుపుతూ మొద‌ట‌గా డిక్ల‌రేష‌న్ ఇచ్చారు. దాని ఆధారంగానైనా జిల్లా క్యాడ‌ర్‌కు చెందిన ఉద్యోగుల‌ను వారి ప్రాంతాల‌కు పంపించాల‌ని నేను కోరుతున్నాను.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe