Breaking News

ఇంట్లో నుంచి పారిపోయి...ఇబ్బంద

May 23, 2016 04:57
ఇంట్లో నుంచి పారిపోయి...ఇబ్బంద

తెర‌మీద క‌నిపించిన‌ప్పుడు ప్రేక్ష‌కులు కొట్టే చ‌ప్ప‌ట్లు, ఈల‌లే త‌న‌కు లోక‌మ‌ని భావించాడు... దీనికోసం ఇంట్లో నుంచి పారిపోయి వ‌చ్చాడు.. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి అనుకున్న‌ది సాధించాడు...త‌ప‌న‌ అనే సినిమాలో చిన్న‌పాత్ర‌తో త‌న న‌ట‌న‌ను ప్రారంభించి సై, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఆ న‌లుగురు, బాహుబ‌లి, శ్రీ‌మంతుడు లాంటి సినిమాల్లో న‌టించి తానేంటే నిరూపించాడు. ఇప్ప‌టివ‌ర‌కు 60 సినిమాల‌కు పైగా చిత్రాల్లో న‌టించి మెప్పించారు ఆర్టిస్ట్‌ సూర్య.

 

ఎందుకు ఇండ‌స్ట్రీకి రావాల‌నిపించింది...

7 వ‌త‌ర‌గ‌తి త‌రువాత చ‌ద‌వు అంటే నాకు  అబ్బ‌లేదు. దీంతోపాటు ప్ర‌భుదేవా, చిరంజీవి గార్ల ప్ర‌భావం నాపై ప‌డింది. దీంతో ఇంట్లో చెప్ప‌కుండా హైద‌రాబాద్‌ వ‌చ్చేశాను. మొద‌ట రైల్వేస్టేష‌న్‌లో దిగి అక్క‌డి నుంచి అన్న‌పూర్ణ స్టూడియోకు న‌డుచుకుంటూ వెళ్లాను. అక్క‌డకు వెళ్లేస‌రికి నిన్నే పెళ్లాడ‌తా షూటింగ్ జ‌రుగుతుంది. అక్క‌డ న‌న్ను చూసిన ద‌ర్శ‌కులు కృష్ణ‌వంశీ అసిస్టెంట్ సురేష్ గారు న‌న్ను చేర‌దీసి వారం రోజులు త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నారు. అలా నా ప్ర‌స్థానం ప్రారంభమ‌య్యింది. 

పూరిజ‌గ‌న్నాథ్ వ‌ద్ద...

మామ‌య్య గారు పూరిజ‌గ‌న్నాథ్ వ‌ద్ద స్టిల్‌ కెమెరామెన్‌గా ప‌నిచేసేవారు. ఇట్లు శ్రావ‌ణీ సుబ్ర‌మ‌ణ్యం, ఇడియ‌ట్‌, అమ్మ నాన్న త‌మిళ అమ్మాయి, 143 సినిమాలకు మామ‌య్యకు అసిస్టెంట్‌గా నేను కూడా ప‌నిచేశాను. త‌ద‌నంత‌రం మామ‌య్య అసోసియేట్ డైరెక్ట‌ర్ గా జ‌గ‌న్ వ‌ద్ద చేరారు. దీంతో నేను సినిమాలో పాత్ర కోసం వేట మొద‌లుపెట్టాను.

 మొద‌ట ఎవ‌రు అవ‌కాశం ఇచ్చారు

చ‌దువు మ‌ధ్య‌లో  ఆప‌వ‌ద్ద‌ని మామ‌య్య‌ చెప్పారు. దీంతో ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దువుకున్నాను. దీంతో పాటు ఫొటోలు దిగి ఆల్బ‌మ్‌ల త‌యారు చేసుకొని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే వాడిని. ఈ క్ర‌మంలో త‌ప‌న‌ అనే సినిమాలో చిన్న పాత్ర చేయ‌డానికి నాకు అవ‌కాశం వ‌చ్చింది.

డ్యాన్స్ లో డిప్ల‌మా...

న‌ట‌న‌లో నేను శిక్ష‌ణ తీసుకోలేదు, కానీ క్లాసిక్ డ్యాన్స్ లో డిప్ల‌మా చేశాను. న‌ట‌న‌లో నా గురువు మాత్రం రాజ‌మౌళి గారు అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే సై సినిమా చేసేట‌ప్పుడు నాకు న‌టించ‌డం ఎలాగో నేర్పించారు. మొద‌ట ఈ సినిమాకు  సంబంధించి ఆడిష‌న్స్ వెళ్లిన‌ప్పుడు అంద‌రూ న‌వ్వుకున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో ర‌గ్భీ ఆట‌కు సంబంధించి సినిమా క‌థ ఇదీ. ఈ ఆట ఆడాలంటే అంద‌రూ ఎత్తుగా ఉండాలి. నేను అంద‌రి క‌న్నా పొట్టిగా ఉండేవాడిని. దీంతో న‌న్ను అంద‌రూ పింగ్ పాంగ్ అనేవారు.

ద‌ర్శ‌కుల‌కు రుణ‌ప‌డి ఉంటా

న‌న్ను న‌మ్మి పాత్ర‌ను ఇచ్చిన ద‌ర్శ‌కుల‌కు రుణ‌ప‌డి ఉంటా. ఎందుకంటే వారు ఇచ్చిన పాత్ర‌కు నేను న్యాయం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తా. ఇప్ప‌టివ‌ర‌కు నేను చేసిన సినిమాలో ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా గుర్తు పెట్టుకునే పాత్ర‌ను ఆ న‌లుగురు సినిమాలో చేశాను. సై సినిమా చేస్తున్న సంద‌ర్భంలోనే నాకు ఈ సినిమా అవ‌కాశం వ‌చ్చింది. ద‌ర్శ‌కులు చంద్ర‌సిద్ధార్థ గారికి నేను ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. అప్ప‌ట్లో ఆ సినిమా 32 రోజుల్లో షూటింగ్‌ పూర్తి అయ్యింది.

ప్ర‌స్తుతం క‌లియుగకు నిర్మాత‌ను..

ప్ర‌స్తుతం నేను క‌లియుగ అనే సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హారిస్తున్నాను. ఒక య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఈ సినిమాను నిర్మించాం. 2 నెల‌ల్లో  ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. పెద్ద పెద్ద సినిమాలు విడుద‌ల అయిన త‌రువాత మా సినిమా విడుద‌ల ఉంటుంది.

హీరోగా చేయ‌ను

 నాకు హీరోగా అవ‌కాశం వ‌చ్చింది...కానీ నేను చేయ‌ను..ఎందుకంటే హీరోగా 2 సినిమాలు హిట్ అయి ఆ త‌రువాత 2 సినిమాలు ఫెయిల్ అయితే నేను ఆర్టిస్ట్‌గా చేయ‌లేను. అందుకే నేను చంద్ర‌మోహ‌న్ గారిలా మంచి మంచి పాత్ర‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను.

ద‌ర్శ‌కుల్లో ఎవ‌రూ ఇష్టం

 నేను ప‌నిచేసిన అంద‌రూ ద‌ర్శ‌కులు నాకు ఇష్టం. ఎందుకంటే ఒక్కోక్క‌రిదీ ఒక్కో స్టైల్‌. వారి వ‌ల్లే నాకు మంచి పాత్ర‌లు ల‌భించాయి. ప్రేక్ష‌కులు న‌న్ను గుర్తు పెట్టుకునేలా చేశాయి.ముందుండి న‌డిపించే నాయ‌కుడ‌ని అంటారు క‌దా ఆ ల‌క్ష‌ణాల‌న్నీ రాజ‌మౌళి గారి ద‌గ్గ‌ర ఉన్నాయి.  నా దృష్టిలోద‌ర్శ‌కుడు త‌ల్లి లాంటి వాడు...నిర్మాత తండ్రి లాంటి వాడు. 

నాకు న‌చ్చిన సినిమాలు...

నేను చేసిన సినిమాలో నాకు న‌చ్చిన సినిమాలు ఆ న‌లుగురు, జైచిరంజీవ‌, సై  చిత్రాలున్నాయి. నాకు ప్ర‌భుదేవా అంటే  ఇష్టం. ఎందుకంటే నాకు ఆయ‌న చేసే డ్యాన్సులంటే ఇష్టం. మిగ‌తా హీరోలను చూసి నేను న‌ట‌న నేర్చుకున్నాను. ఇప్పుడున్న హిరోయిన్ల‌లో స‌మంత, రకుల్‌ప్రీత్ సింగ్, రాశిఖ‌న్నాలు ఇష్టం. సై సినిమా చేసేట‌ప్పుడు జెనీలియా అంటే నాకు ఇష్టం ఉండేది. ఆ ఫీలింగ్‌తో అప్పుడు జెనీలియా గారికి ఐల‌వ్‌యూ చెప్పాను. 

 ఆ న‌లుగురు లాంటి సినిమా మ‌ళ్లీ చేయాల‌ని ఉంది...

 ఆ న‌లుగురు లాంటి సినిమా మ‌ళ్లీ చేయాల‌ని ఉంది. కానీ ఎప్పుడు అలాంటి సినిమా వ‌స్తుందో చెప్ప‌లేం. ఈ మ‌ధ్య‌లో నేను గ‌ల్ఫ్ అనే సినిమాలో న‌టించాను. ఆ సినిమాలో నా పాత్ర పేరు ఎక్భాల్. ఈ పాత్ర  గురించి మ‌సీదుకు వెళ్లి ప్రార్థ‌న ఎలా చేస్తారు త‌దితర‌ విష‌యాల‌ నేర్చుకున్నాను. ఏ పాత్ర చేసినా ఆ పాత్ర‌లో నేను లీన‌మై న‌టిస్తాను. కొత్త‌గా సినిమా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చే వారు ఆలోచించి రావాలి. ఇక్క‌డకు రాగానే ఎవ‌రూ అవ‌కాశం ఇవ్వ‌రు. దానికోసం చాలా క‌ష్ట‌ప‌డాలి. నేను అలా క‌ష్ట‌ప‌డి వ‌చ్చిన వాడినే.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe