కలికాలం అంటూ ఫ్యామిలీతో కంటతడిపెట్టించి... చిత్రం భళారే విచిత్రం అంటూ కడుపుబ్బా నవ్వించి....ప్రెసిడెంట్ గారి పెళ్లాం అంటూ మాస్ ప్రేక్షకులను మెప్పించారు... మాటలతో మంత్రముగ్థులను చేసే రచయితగా, నటుడిగా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు... మనం చేసే పని మనకు నచ్చినప్పుడే అది ఎదుటి వారికి ఎక్కుతుందని నమ్మే తోటపల్లి మధు మనోగతం ...
నేను పుట్టింది తోటపల్లిలో..
నేను పుట్టింది ద్వారపూడి, విజయనగరం మధ్యలో ఉన్న తోటపల్లి అనే గ్రామంలో.. మా ఊరి పేరే మా ఇంటి పేరు అయ్యింది. మాది జమీందార్ల కుటుంబం. మా నాన్న గారు రైల్వే ఉద్యోగి కావడం వలన నా చదువు చాలా వరకు విజయవాడలో కొనసాగింది...నాకు నాటకాలంటే ఇష్టం. విజయవాడలో నేను ఒకసారి నాటకాన్ని వేసినప్పడు దర్శకుడు కె.బాలచందర్ గారు చూసి నన్ను ఇండస్ట్రీలోకి రమ్మని ఆహ్వానించారు. దీంతో నేను మద్రాస్‌కు వెళ్లాను. అక్కడ ప్రతిరోజు బాలచందర్ గారి ఆఫీసుకు వెళుతుండే వాడిని. దీంతో అతని ప్రభావం నాపై పడింది. కలికాలం సినిమా తీసినప్పడు ఆయన భావాలను దృష్టిలో పెట్టుకొని మాటలను రాశాను.
నా మొదటి సినిమా దేవాంతకుడు
మాటల రచయితగా నా మొదటి సినిమా దేవాంతకుడు. చిరంజీవి హీరోగా నటించిన సినిమా. ఇప్పటివరకు 189 సినిమాలకు రచయితగా పనిచేశాను. మొదట్లో నా రెమ్యూరేషన్ 25,000 రూపాయలు. షిర్డీ సాయిబాబా మహాత్యం సినిమాకు నేను పనిచేయడం ఆ బాబా నాకు ఇచ్చిన వరంగా భావిస్తాను. ఈ సినిమాకు కథ, మాటలతో పాటు స్క్రీన్‌ప్లేను సైతం అందించాను. మొదటి నుంచి మా కుటుంబానికి ఇష్ట దైవం షిర్డీ సాయిబాబా.
ఒక వైపు షిర్డీ.... మరోవైపు పుట్టపర్తి...
షిర్డీ సాయిబాబా మహాత్యం రిలీజుకు ముందు అంజలీదేవి, సావిత్రి గారి కోరిక మేరకు నేను పుట్టపర్తి సాయిబాబా దగ్గరకు వెళ్లడం జరిగింది. గతంలో పుట్టపర్తి సాయిబాబా విజయవాడలో నేను వేసిన నాటకాన్ని చూసి మెచ్చకున్నారు. అప్పుడు నాకు 8 సంవత్సరాల వయస్సు. ఈ విషయాన్ని బాబా గారిని కలిసినప్పడు గుర్తు చేశాను. దీంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ ( ఒక వైపు షిర్డీ సాయిబాబా మరోవైపు పుట్టపర్తి సాయిబాబా) ఉన్న ఒక బంగారపు లాకెట్‌ను గాలిలో నుంచి సృష్టించి ఇచ్చారు. ఇప్పటికీ అది నా దగ్గర చెక్కు చెదరకుండా ఉంది.
నాకు ఇష్టమైన హీరో ఎన్టీఆర్
నాకు ఇష్టమైన హీరో ఎన్టీఆర్. ఆయన సినిమాలకు పనిచేసే అవకాశం నాకు లభించలేదు, ఎందుకంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికీ అన్నగారు రాజకీయల్లో ఉన్నారు. దీంతో ఈ విషయం నాకు ఎప్పటికీ ఆ వెలితీగా అనిపిస్తూ ఉంది. ఆయన తరువాత చిరంజీవి గారు అన్నా నాకు అభిమానమే.
ఒకే సంవత్సరంలో 22 సినిమాలు.....
ఒకే సంవత్సరంలో 22 సినిమాలకు మాటల రచయితగా పనిచేశాను. అందులో 3 సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. వాటిలో 1.కలికాలం..జయసుధ మరియు చంద్రమోహన్ నటించారు. 2.చిత్రం భళారే విచిత్రం..నరేష్ హీరోగా నటించారు.3.ప్రెసిడెంట్ గారి పెళ్లాం..నాగార్జున హీరోగా నటించారు. ఈ సినిమాలు విజయం సాధించి నాకు తిరుగులేని రచయితగా పేరు తెచ్చిపెట్టాయి. గతంలో పరుచూరి బ్రదర్స్ ఒకే సంవత్సరంలో 27 సినిమాలకు రచయితగా పనిచేయగా, జంధ్యాల 19 సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు.
కామెడీ సీన్లను బాగా రాస్తాను
నేను మొదటి నుంచి కామెడీ సీన్లను బాగా రాస్తాను.. ప్రతి విషయాన్ని కామెడీ కింద చూస్తాను. మనం చెప్పాలనుకున్న విషయాన్ని ప్రేక్షకులకు చేరువ కావాలంటే దానికి కామెడీని జోడించాలి. ఇప్పడు వచ్చే రచయితలు సైతం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టకుకోవాలి. అప్పుడే వారు విజయాన్ని సాధిస్తారు.
నన్ను దర్శకుడిగా చేయమని కోరారు...
చాలామంది నిర్మాతలు నన్ను దర్శకుడిగా చేయమని కోరారు. నాకు మొదటి నుంచి నటించడం, రచయితగానే ఇష్టం. అందుకే అటువైపు దృష్టి సారించలేదు. దర్శకుడికీ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అవి భరించడం నాకు ఇష్టం లేదు. నేను మాటలు రాసేటప్పడు నేను రాయను. నేను చెబుతుంటే నా దగ్గర పనిచేసే అసిస్టెంట్స్ రాస్తుంటారు. ఇది గమనించిన పాటల రచయిత వేటూరి సుందరరామ్మూర్తి నన్ను డిక్టేటర్ అనేవారు.
నటన తృప్తిగా ఉందా..రచయిత తృప్తిగా ఉందా...
రచయితగా కష్టపడాలి..దానిలో ఉన్న శ్రమ వేరు...నటన విషయంలో అలా కాదు..మేకప్ వేసుకొని మనలోని నటనను ప్రేక్షకులకు చూపించాలి. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాను. నటన పరంగా చాలా అవకాశాలు వస్తున్నాయి. అందుకే నాలో ఉన్న రచయితకు కొన్ని రోజులు విశ్రాంతి ఇచ్చాను.
నాకు వేటూరి అంటే ప్రత్యేకమైన అభిమానం
నాకు బాపూ, బాలచందర్, పింగళి, ఆరుద్ర, సముద్రాల వంటి వారు అంటే ఇష్టం. నాకు వేటూరి అంటే ప్రత్యేకమైన అభిమానం. అందరినీ వేటూరిలో చేశాను. ఎక్కువ అతనితో పనిచేసే అవకాశం లభించడం వలన మిగతా వారి కన్నా అతనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నేను పనిచేసిన దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు మరియు దాసరి నారాయణరావులు అంటే నాకు చాలా ఇష్టం.
నేను రచయితగా చేసిన సినిమాల్లో కొన్ని...
నేను రచయితగా చేసిన సినిమాల్లో కొన్ని మహారథి, హనుమాన్ జంక్షన్, పెళ్లిపందిరి, పెళ్లి, బంగారుకుటుంబం, చిత్రం భళారే విచిత్రం, కలికాలం, అల్లరిపిడుగు, షిర్డీ సాయిబాబా మహాత్యం, అంకుల్, రాముడొచ్చాడు, అల్లరిఅల్లుడు, భలే దంపతులు. ఈ మధ్య నటించిన సినిమాలు సినిమా చూపిస్తా మామ ఇంకా చాలా సినిమాల్లో నటించాను..నటిస్తున్నాను.
కేసీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం
కేసీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం..గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్, వైఎస్.రాజశేఖర్ రెడ్డిలు సీఎంలుగా ఎంత పేరు తెచ్చుకున్నారో ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రజలకు మంచి పాలన అందిస్తూ అందరి మన్ననలు చూరగొంటున్నారు. ఇంకా కేసీఆర్ 15 సంవత్సరాలు సీఎంగా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను.