Breaking News

విజయశాంతి పోస్ట్ యథాతథంగా...

Nov 30, 2019 06:54
విజయశాంతి పోస్ట్ యథాతథంగా...

"ఇది భాగ్యనగరానికి గర్భశోకం... మదమెక్కిన మగ పిశాచుల దాష్టీకానికి మాతృహృదయం చిద్రం. ఇది ప్రియాంకం కాదు.. సభ్య సమాజానికి కళంకం. విధి నిర్వహణకు వెళ్లిన వైద్యురాలు విధి వంచితు రాలైపోయింది... కామాంధుల కర్కశం తో కన్నుమూసింది. హైటెక్ పరిసరాల్లో, హై సెక్యూరిటీ జోన్లో జరిగిన ఘోరం.. హాహాకారాలు పెట్టినా పట్టించుకోని వైనం. తెలంగాణ సభ్య సమాజానికి తీరని అవమానం. వరంగల్ లో మానస పట్ల మృగాళ్ల కిరాతకం. ఆరు నెలల చిన్నారిపై కూడా ఆగని అరాచకం. ఇక్కడ సమిధలు అయినది కేవలం ప్రియాంక, మానసలే కాదు... గొప్పగా చెప్పుకొనే మానవత్వం. గాంధేయ మార్గం అని చెప్పుకునే దేశం ఔనత్యం. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మేలుకో పోతే మహిళా ఉద్యమం తథ్యం. తెలంగాణలో మహిళలపై జరిగే దారుణాలను చూశాక ప్రశ్నలకు దొరకని సమాధానాలు ఎన్నో... షీ టీం లు కంటితుడు పేనా? మహిళా భద్రత ఎండమావేనా? అంతా ముగిశాక పర్యవేక్షణా? విశ్వ నగరంలో అతివకేదీ రక్షణ? ప్రతిఘటన సినిమాలో దుర్యోధన దుశ్యాసన దుర్వినీతి లోకంలో పాటను నేటికి గుర్తుచేసుకునే పరిస్థితి.. మృగాళ్ల వికృత పోకడలతో మహిళలకు తప్పని దుస్థితి. కిరాతకులపై ఉక్కుపాదం మోపాలి.. అర్ధరాత్రిలో సైతం అతివలు స్వేచ్ఛగా తిరిగే రోజులు రావాలి.

 

1985లో ఈ ధుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో... అనే పదాల ద్వారా మహిళా వ్యధార్థుల ఆక్రోశాన్ని ప్రతిఘటన ద్వారా ఎంత బాధతో నా ప్రజలకు తెలియజేసుకున్నానో అంతకు వేయింతల ఆవేదనతో వరంగల్ మానస, హైదరాబాద్ ప్రియాంకల విషయమై రాస్తున్న మాటలివి.

 

అమ్మల కడుపున పుడుతున్న అన్నదమ్ములారా... ఇంతటి ఘాతుకాలకు తెగబడేముందు ఒక్క క్షణం మిమ్మల్ని కని, పెంచిన అమ్మ, తోడబుట్టిన అక్కచెల్లెళ్ళు, కడుపున పుట్టిన ఆడబిడ్డలు ఎందుకు ఆలోచనకు రావటం లేదు?

 

అంతేకాదు.. అప్పటి వరకూ గౌరవంగా, సంతోషంగా గడిచిన మీ జీవితాలు, చీత్కరించబడుతూ, అసహ్యంతో నేరస్తులుగా జన్మంతా బతికే స్థితికి దిగజారిపోతాయని ఎందుకు తెలుసుకోవడం లేదు?

 

మగపిల్లలను కనాలంటే... కాబోయే అమ్మలు వద్దని అబార్షన్స్ చేయించుకునేంత దౌర్భాగ్యాన్ని దయచేసి సృష్టించకండి.

 

1979 నుంచి నేటి వరకు నలభై సంవత్సరాలుగా.. ప్రజలు అభిమానించిన మనిషిగా... ఒక మహిళగా.. మీ విజయశాంతి".

Facebook like
Google Plus Circle
Youtube Subscribe