Breaking News

నల్ల ధనమా! నువ్వెక్కడ లేవు?

Nov 09, 2014 21:49
నల్ల ధనమా! నువ్వెక్కడ లేవు?

 ఎవరో బ్యాంకు ఉద్యోగి వ్యక్తిగత కక్ష కొద్దీ తస్కరించిన సమాచారం ఫ్రాన్స్‌ చేతిలో పెడితే, ప్రిన్సిపాలిటీ ఆఫ్‌ లీచ్‌టెన్‌స్టీన్‌ అనే చిన్న ( బెజవాడ అంతటి) దేశం వద్ద సమాచారం జర్మనీకి దొరికితే ఆ ఎంగిలి సమాచారం మన దేశానికి మహాప్రసాదంలా కనిపించింది. అదే గొప్ప విజయంగా సీల్డ్‌ కవర్‌లో దేశ సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది మన ప్రభుత్వం. ఇది ఈ సంవత్సరపు అతిపెద్ద జోకు సుమా!
‘నల్లకుబేరులు’, ‘స్విస్‌ బ్యాంకు’, ‘హవాలా’, ‘విదేశీ బ్యాంకు ఖాతాలు’ వగైరా మాటలు రోజూ పేపర్లలో టీవీ ఛానెళ్ళలో చూసీచూసీ, వినీవినీ, నవ్వాలో, ఏడవాలో తెలీని పరిస్థితిలో ఉన్నాము. నేను ఒక పల్లెటూరి సగటు రైతుని నల్లధనం అంటే ఏమిటి అని ఒకసారి అడిగితే దొంగనోట్ల ముద్రణ అని ఠక్కున సమాధానమిచ్చాడు. అతనిని చూసి నవ్వుకునే పరిస్థితిలో మనమేమీ లేము. ఎందుకంటే మనం కూడా అంతే అమాయకత్వంతో, అంతే తెలివితక్కువ తనంతో ఆలోచిస్తున్నాము. 1996లో మధ్యతరగతి అభిమాన నాయకులు వాజపేయి తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో స్విస్‌ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారి పేర్లు బయటపెడతామంటే నమ్మి, తెరుచుకుని చూస్తున్న నోరు ఇప్పటికీ మూతపడలేదు. అలా నోరుతెరుచుకుని నాటినుంచి నేటిదాకా మనం చూస్తూనే ఉన్నా మధ్యలో భారతీయ జనతా ప్రభుత్వాలు, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మారి మారి మనని పాలిస్తూనే ఉన్నా ఏమార్చి ఏమార్చి మనల్ని మోసం చేస్తూనే ఉన్నాయి. అయినా ఇంకా బుద్ధిరాక ఏదో జరుగుతుందన్న నమ్మకంతో మళ్ళీ మళ్ళీ అదే ఎదురుచూపులతో అదే ఆశావహ దృక్కులతో ఇంకా మిగిలి ఉన్నాం. ఈ నల్ల ధనం మన ప్రజల మీద పాలక వర్గాలు చేసిన, చేస్తున్న క్రూర పరిహాసం అని ఎప్పటికి అర్థం చేసుకుంటాం?
ముందుగా నల్లధనం అంటే ఏమిటో చూద్దాం! నల్ల ధనం రెండు రకాలు. చట్టవ్యతిరేకంగా సంపాదించినటువంటిది, చట్ట పరంగా సంపాదిస్తూనే లెక్కలు చూపించనట్టిది. చట్ట వ్యతిరేకంగా అంటే లంచగొండితనం ద్వారా, మాఫియా ద్వారా, దొంగనోట్ల చెలామణీ, రౌడీయిజం, డ్రగ్స్‌, అక్రమ మద్యం, దొంగ మైనింగ్‌, దొంగ ఇసుక క్వారీలు, భూ కబ్జాలు, అటవీసంపద చోరీ, స్మగ్లింగ్‌, అక్రమ ఫిషింగ్‌, సెటిల్‌మెంట్స్‌ వగెరా వగైరా అన్నమాట... ఇవన్నీ మా కళ్ళ ముందు రోజూ ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, పోలీసులు, ఖద్దరు చొక్కా పెద్ద మనుషులు, బ్యాంకు అధికారులు, పక్క ఇంటి గుమాస్తా, ఊరి పెద్ద- వీరందరూ చేస్తున్నవే! అని ఆశ్చర్యపోవద్దు. మన సోకాల్డ్‌ నల్లధనాధిపతులలో చిన్న చేపల నుంచి బడా తిమింగలాల దాకా వుంటారు. ఎందుకంటే వారి ఆదాయానికి లెక్కలు లేవు. చూపలేరు.. కారణం అది చట్ట వ్యతిరేకంగా సంపాదించిన ఆదాయం కాబట్టి.
మరొకరకం నల్ల ధనం వైట్‌కాలర్‌ వారు పోగు వేసుకొనేది. అనగా చట్టపరమైన లావాదేవీలు సాగిస్తూనే పన్ను ఎగవేత కోసం లెక్కలు తారుమారు చేసి పోగు చేసుకొనేది. ఇదేదో మన పరిధికి మించినది అనుకునేరు! అదేం కాదు. మన ఇంటి ప్రక్కని జనరల్‌ స్టోర్‌ నుంచీ, పెద్ద పెద్ద రిటైల్‌ చైన్స్‌ దాకా, జువెలరీ స్టార్స్‌దాకా, సాప్ట్‌వేర్‌ కంపెనీల దాకా, మహా మహా కార్పొరేట్ల దాకా, విద్యా వ్యాపార దిగ్గజాల దాకా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ దాకా, అతి పెద్ద వ్యాపార సామ్రాజ్య ఆధినేతల దాకా అందరూ చేసేదే! నంబర్‌ వన్‌ ఎకౌంట్‌.. నంబర్‌ టూ ఎకౌంట్‌.. ఏదో విన్నట్లుంది కదూ! ఆ నంబర్‌ టూ ఎక్కౌంటే నల్లధనం రాసుకునే సాధనం. విత్‌ బిల్‌ కావాలా. వితౌవుట్‌ బిల్‌ కావాలా. ఇదీ విన్నదే కదూ! ఆ వితౌవుట్‌ బిల్లు నల్లధనానికి ఒకానొక చిన్న మార్గం.
స్విస్‌ బ్యాంకుల్లో మన నల్ల కుబేరులు దాచుకున్న డబ్బులు భారతదేశానికి తీసుకురావలిసిందే అని ఢంకా బజాయించి చెబుతూ ఉండే మన ఉన్నత మధ్యతరగతి హిపోక్రసీకి నవ్వు రాక ఏమవుతుంది? ఇవన్నీ చెప్పడానికి అర్థం మనమందరం ఏదో నేరస్థులమని రుజువు చెయ్యడానికి కాదు. ఎవరి గురించో ఆలోచించే ముందు మన చుట్టూ వాతావరణాన్ని పరిశీలన చేసుకోవాలని చెప్పడానికే.. ఇదంతా ఇలా ఉంచితే మన దేశంలో పోగుపడిన నల్లధనం ఏమవుతుంది? మళ్ళీ రెండు ఆప్షన్లు.. అయితే మన దేశంలోనే బంగారం రూపంలోనో, స్థలాలు, పొలాలు (రియల్‌ ఎస్టేట్‌) రూపంలోనో దాచుకోబడుతుంది. లేదా దీపావళి టపాకాయల్లోనో, పిల్లల పెళ్ళిల్లలోనో ఏ సినిమాల్లోనో తగలేయబడుతుంది. సారీ, ఖర్చు చేయబడుతుంది. కాదంటే వెంకన్న, దుర్గమ్మ లాంటి హుండీలలో దూకి తెల్లబడుతుంది. మరి ఇంకా పెద్ద మొత్తాలైతే ఎలా? ఈ దేశంలో అసలే అభద్రత కదా! అని అనుమానం వస్తే అప్పుడు.. విదేశాలకు ఆ ధనం తరలించబడుతుంది. మరి మన దేశంలో సంపాదించిన నల్లధనం రూపాయలలో ఉంది కదా! విదేశాలకు ఈ రూపాయలు కంటెయినర్లలో పంపిస్తే సరిపోతుందా? కుదరదు. ఎందుకంటే ఈ దేశం దాటాక మన రూపాయి నోట్లు చిత్తు కాగితాలతో సమానం. అయితే ఎలా? హవాలా ఉందిగా!
హవాలా అనేది అరబిక్‌ పదం. దానర్థం నేను నీకు అప్పు ఉంటే, నువ్వు ఇంకొరికి అప్పు ఉంటే నీకు బదులు ఆ ఇంకొకరికి డబ్బు ఇవ్వడం. ఇందులో చట్ట వ్యతిరేకమైనది ఏముంది? ‘హవాలా’ అర్థంలో చట్ట వ్యతిరేకమైనది ఏమీ లేదు. కానీ ఉపయోగంలోనే అంతా ఉంది. స్విట్జర్లాండ్‌లోని బ్యాంకులకు నల్ల డబ్బు హవాలా రూపంలో (ముఖ్యంగా దుబాయి ద్వారా) తరలుతున్నాయి. ఇంకా ఎఫ్‌డీఐ దారుల్లో మారిషస్‌, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలెండ్స్‌, ఐజిల్‌ ఆఫ్‌ మ్యాన్‌, లక్జెంబర్గ్‌, మొనాకో, ఐర్లెండ్‌, బహమాస్‌, సింగపూర్‌, హాంకాంగ్‌, సైప్రస్‌ మొదలెన దేశాలకు తరలుతోంది. ఇవేవీ కాకపోతే లండన్‌ ఉంది.
స్విస్‌ బ్యాంకుల్లో మన నల్ల కుబేరుల డబ్బు రూ. 75 లక్షల కోట్ల మేరకు ఉందని 2009లో ఆడ్వాణీ అన్నారు. అధికారిక అంచనాల ప్రకారం పదివేలకోట్ల రూపాయలు సుమారుగా స్విస్‌ బ్యాంకుల్లో ఉంటుందని స్విస్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ 2012లో చెప్పింది. మొత్తంగా స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న సొమ్ములో ఇది కేవలం 0.13 శాతం మాత్రమే. భారతీయుల నల్ల ధనపు రంగుల కల తెలుపు-నలుపులోకి మారే నిజం అదే!
ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ మొత్తం డబ్బులో 37 శాతం విదేశాల్లోనే దాచుకుంటున్నారు. ఇదేదీ మన బారతదేశానికి సంబంధించిన రోగమేమీ కాదు. ఇది విశ్వరుగ్మత. ట్యాక్స్‌ హేవన్స్‌లో వివిధ రూపాలలో పోగుపడి ఉన్న ధనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి (నిజానికి సామాన్య ప్రజానీకానికి) సవాలు విసురుతోంది. ఎవరో బ్యాంకు ఉద్యోగి వ్యక్తిగత కక్ష కొద్దీ తస్కరించిన సమాచారం ఫ్రాన్స్‌ చేతిలో పెడితే, ప్రిన్సిపాలిటీ ఆఫ్‌ లీచ్‌టెన్‌స్టీన్‌ అనే చిన్న (బెజవాడ అంతటి) దేశం వద్ద సమాచారం జర్మనీకి దొరికితే ఆ ఎంగిలి సమాచారం మన దేశానికి మహాప్రసాదంలా కనిపించింది. అదే గొప్ప విజయంగా సీల్డ్‌ కవర్‌లో దేశ సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది మన ప్రభుత్వం. ఇది ఈ సంవత్సరపు అతిపెద్ద జోకు సుమా! నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారంలో ఎంతో ఆవేశంగా పలికిన మాటలు దంబాచారాలు అని తేలిపోతుంటే, ఇంతకాలం అదే క్రీడ ఆడి విశ్రాంతి తీసుకొంటున్న కాంగ్రెస్‌ నేతలు గొంతు పెంచి నల్ల ధనాధిపతుల వివరాలు బయటపెట్టండి అని దబాయించడం దేనికి చిహ్నం? అసలు ఎప్పటికీ నల్ల ధనాన్ని వెలికితీయడం అసాధ్యమని తెలుసు కాబట్టే ఇలా అరుస్తున్నారనుకోవాలా? మనం ఈ వికృత క్రీడకి నియమాలు తెలియని ప్రేక్షకులమైనందుకు బాధపడాలా?
ఈ నల్ల ధనాన్ని ఎలా దాచి వుంటారు? మామూలు బ్యాంక్‌ ఎకౌంట్‌లో దాచి వుండాలి లేదా లాకర్‌లో పెట్టుకోవాలి. లాకర్‌లో దాచుకుంటే ఆ సమాచారం మనకి వచ్చే అవకాశమే లేదు. మామూలు బ్యాంక్‌ ఎకౌంట్‌లో దాచుకుంటే బ్యాంకు ఆ డబ్బుని ఎక్కడో అక్కడ మదుపు చేస్తుంది. అందులో సింహభాగం అంతర్జాతీయ మ్యూచువల్‌ ఫండ్స్‌, ప్రైవేట్‌ ఈక్విటీ, ట్రస్టుల ద్వారా, ఇంకా రియల్‌ ఎస్టేట్స్‌ ద్వారా మదుపు చెయ్యబడుతుంది. ఎవరి పేరుతో మదుపు చేస్తారు? అందుకే మనకి మారిషస్‌, సింగపూర్‌ లాంటి ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక కంపెనీ ప్రపంచంలో ఎక్కడైనా మదుపు చేయదగ్గ చట్టాలూ ఉన్నాయి. అలా అలా నల్ల డబ్బు ప్రవహించి ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ పేరుతో మన దేశానికే చివరకు చేరుతుంది. అది తెలియని మనం మన కష్టార్జితమంతా ఎక్కడో ఒంటి స్తంభం మేడలో దాయబడిందనీ, దాన్ని ఎప్పటికైనా మనం సొంతం చేసుకుంటామనీ రంగుల కలలు కంటున్నాం. లేదా కనేటట్లు చెయ్యబడుతున్నాం. చెప్పవచ్చిందేమిటంటే నల్ల ధనం ఎక్కడోలేదు. ఇక్కడే మన చుట్టుపక్కలే విచ్చల విడిగా, వికృతంగా కర్కశ కరాళ నృత్యం చేస్తోంది. ఒక్క విషయం ఆలోచించండి. నల్లధనమే లేకపోతే మన ఎన్నికల ప్రజాస్వామ్యం ఏమైపోవాలి?
నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చే విషయమై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తానే నియమించిన ఒక కమిటీ సూచనలను అమలు చేయాలి. ఇవీ ఆ సూచనలు: బంగారం, వజ్రాల కొనుగోలు, అమ్మకాల పూర్తి వివరాలను బహిర్గత పరచాలి; దేశంలోని భూమి మొత్తాన్ని సర్వేచేసి దాని చట్టపరమైన హక్కుదారులెవరో గుర్తుపట్టాలి. (వ్యక్తులైనా, సంస్థలైనా, ప్రభుత్వాలైనా) ప్రతి కొనుగోలు, అమ్మకాన్ని చివరికంటా ట్రాక్‌ చేయాలి; కొంత సమయమిచ్చి, కొంత వెసులుబాటు కల్పించి రూ.500, రూ.1000 కరెన్సీనోట్స్‌ను పూర్తిగా రద్దు చేయాలి; ట్రస్టులు, ఎన్‌జీఓలు, సొసైటీల పేరుతో నడుస్తున్న వ్యాపార లావాదేవీలని పారదర్శకతవైపు తీసుకురండి; ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ పేరుతో మన దేశంలోకి ప్రవహిస్తున్న ధనం అసలు మూలాలు కనుక్కోవాలి; పటిష్ఠ లోక్‌పాల్‌, లోకాయుక్త వ్యవస్థలను రూపొందించాలి; బినామీ వ్యవహారాలపై సహజ సంపదలను కొల్లగొడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe