Breaking News

నిరాడంబరం సిద్ధ సంప్రదాయం

Nov 20, 2014 19:58
నిరాడంబరం సిద్ధ సంప్రదాయం

భారత సనాతన ధర్మంలో సిద్ధ సంప్రదాయానికి ఒక విశిష్టమైన స్థానముంది. మహిమలు మార్చటానికే తప్ప బతకటం కోసం కాదని బోధించే ఈ సంప్రదాయంలో సిద్ధులకు, అవధూతలకు ప్రాధాన్యం లభిస్తుంది. సిద్ధ సంప్రదాయం, దాని విశిష్టతల గురించి శ్రీరామఅవధూతస్వామి వివరణ నవ్య పాఠకులకు ప్రత్యేకం..

ప్రతి వ్యక్తికి గొప్పవాడు కావాలని ఉంటుంది. అపారమైన కీర్తి సంపాదించుకోవాలనుకుంటుంది. వీటితో పాటుగా ఇతరత్రా కొన్ని బలీయమైన కోరికలుంటాయి. అయితే ఇవే జీవిత పరమార్థాలు కావు. ఈ జీవిత పరమార్థాన్ని తెలియజేయటానికి, జీవిత మార్గాన్ని నిర్దేశించటానికి ఉన్నవారే సిద్ధులు, అవధూతలు. వీరు త్రిముఖ దత్తాత్రేయ స్వామి సేవకులు. సృష్టి, స్థితి, లయకారులకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకరూపమే దత్తాత్రేయుడని సిద్ధ సంప్రదాయం చెబుతుంది.. ప్రజలందరికీ జీవన మార్గాన్ని తెలియచేయటంలో వీరికి ఒక విశిష్టమైన పాత్ర ఉంది. అయితే- వీరు ఎలా ఉంటారు? వీరిని గుర్తించటం ఎలా? గుర్తిస్తే వారు మనకు ఎలా సాయపడతారు? ఎందుకు సాయపడతారు- ఇలా అనేక మందికి రకరకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. ఈ ప్రకృతి శక్తులపై అదుపు సాధించిన వారు సిద్ధులు. వారు మానవ ఆవాసాలకు దూరంగా ఉంటారు. వీరిని చేరుకోవటం కష్టసాధ్యం. ఇక మానవులకు దగ్గరగా మార్గదర్శకత్వం చేసేవారు అవధూతలు. వీరు అతి సామాన్యంగా ఉంటారు. అతి కఠినమైన పరిస్థితుల్లో నివసిస్తూ ఉంటారు. ఉదాహరణకు షిర్డి సాయినే ఉదాహరణగా తీసుకుందాం. ఆయన అతి నిడారంబరమైన జీవితాన్ని నివసించాడు. జీవితంలో అనేక కష్టాలు పడ్డాడు. నష్టాలు భరించాడు. అవధూతల దగ్గర అనేక రకాల శక్తులు ఉన్నప్పుడు వారు కూడా సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు కదా అని కొందరు అడుగుతూ ఉంటారు. సిద్ధ సంప్రదాయంలో- మహిమలు కేవలం మనుషులను మార్చటానికి మాత్రమే. బతకటానికి కాదు. దీనిని ఆచరించినవారే నిజమైన అవధూతలవుతారు. అలాంటి వారిని ఎలా గుర్తించాలి? అనేది చాలా మందికి ఎదురయ్యే ప్రధానమైన ప్రశ్న. సిద్ధ సంప్రదాయంలో మనం గురువులను వెతకాల్సిన అవసరం లేదు. మన అవసరాలను గుర్తించి గురువే మన దగ్గరకు వస్తాడు. మన సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాడు. ఇక్కడ ఇంకో విషయం స్పష్టం చేయాలి. మన మనసులో తలుచుకుంటే ప్రత్యక్షమవగలిగినవాడే నిజమైన గురువు. ఎదురుగా లేకపోయినా- కష్టం వచ్చినప్పుడు మనసులో తలుచుకుంటే పరిష్కారమార్గాన్ని చూపించగలిగినవాడే నిజమైన గురువు. అలాంటి గురువులు మనకు సిద్ధ సంప్రదాయంలో అనేక మంది కనిపిస్తారు.

ఇదంతా చదివిన తర్వాత- అవధూతలు మార్గనిర్దేశకత్వం చేస్తే అందరి కన్నా ఉతృష్టమైన శక్తి ఒకటుంది కదా.. దానికి మానవుల కష్టసుఖాలతో ప్రమేయం ఉండదా? ఆ శక్తిని ఎలా చేరుకోవాలి? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. సిద్ధ సంప్రదాయం ప్రకారం దైవత్వంలోనే ధర్మం ఉంది. ఈ ధర్మాన్ని నమ్మినవారికి, ఆచరించినవారికి మాత్రమే ఉత్తమ జన్మలు లభిస్తాయి. దాతృత్వం, ఇతరులకు సాయం చేయటం, అందరికి ప్రేమను పంచటం, ఇతరులకు సేవకుడిగా వ్యవహరించటం- మొదలైన లక్షణాలను ఎవరైతే కనబరుస్తారో వారే ధర్మాన్ని ఆచరిస్తున్నట్లు లెక్క. ఆ ధర్మాన్ని ఆచరించినవారికి ఉత్తమ జన్మలు లభిస్తాయి. ఆ ధర్మాలన్నీ ఆచరించగలిగిన మార్గాన్ని చేరుకోవాలంటే తపస్సు ఒకటే మార్గం. అందుకే సిద్ధులు ఎప్పుడూ తపస్సులోనే ఉంటారు. మనిషి రూపం మారుతూ ఉంటుంది కానీ అతని ఆత్మ శాశ్వతం.. అలాంటి ఆత్మ పవిత్రంగా ఉండటానికి అవసరమైన మార్గదర్శకత్వం సిద్ధ సంప్రదాయం అందిస్తుంది. ఈ సంప్రదాయంలోని మరో ముఖ్యమైన విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. సిద్ధ సంప్రదాయం బ్రహ్మచర్యాన్ని ప్రోత్సహించదు. మనిషికి భౌతికమైన అవసరాలు సహజమని వాటిని కృతకంగా నియంత్రించటం వల్ల కలిగే మేలు కన్నా హానే ఎక్కువ. సీ్త్ర, పురుషుల ఇద్దరూ ఉన్నప్పుడే ఈ ప్రకృతికి సంపూర్ణత్వం ఏర్పడుతుంది. దానిని నిరోధించే చర్యల వల్ల ధర్మం అదుపుతప్పుతుంది. బ్రహ్మచర్యం కేవలం స్వార్థం కోసం ఏర్పాటైనదని.. దానివల్ల చేకూరే లాభం కూడా లేదు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe