Breaking News

మహానుభావులేం చేశారు పాపం?

Nov 23, 2014 08:57
మహానుభావులేం చేశారు పాపం?

తెలుగు జాతి గౌరవించదగ్గవారిలో ఒకరైన ఎన్‌.టి.ఆర్‌.లాంటి మహానుభావుడిని కొందరివాడిగా, ఒక ప్రాంతంవాడిగా మార్చేసిన ఈ రాజకీయ నాయకులను ఏమనాలి? శంషాబాద్‌ డొమెస్టిక్‌ టెర్మినల్‌కు తన పేరు పెట్టాలని ఎన్‌.టి.ఆర్‌. ఎవరి కలలోకైనా వచ్చి కోరారా? లేదే? అలాంటప్పుడు ఆయనను వివాదాస్పదం చేయడం ఎందుకు? రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడినందున ఆ రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయంలోని డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్‌.టి.ఆర్‌. పేరును ఖాయం చేసే ముందు తెలుగుదేశం పార్టీ గానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గానీ తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి ఉండవలసింది. 

పేరులో ఏముంది పెన్నిధి అంటారు. ఇప్పుడు దాన్ని సవరించుకుని ‘పేరులోనే ఉంది వివాదమంతా’ అని మాట్లాడుకోవలసిన రోజులు వచ్చాయి. మన రాజకీయ నాయకులు ఉన్నారే- వారు ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో, ఎవరిని కిందపడేస్తారో తెలియదు. గతించిన వారిని గౌరవించడం మన సంప్రదాయం. అందులోనూ కీర్తి మిగుల్చుకుని వెళ్లిపోయినవారిని, ఆదర్శంగా జీవించినవారిని గౌరవించడం, పూజించడాన్ని మన సంస్కారంలో ఒక భాగంగా చేసుకున్నాం. కాలంతోపాటు అన్నీ మారుతున్నాయి. రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం కీర్తిశేషులను కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. వారి పేరిట ప్రారంభించిన పథకాలను కూడా తమకు ఉపయోగపడే దివంగత నేతల పేరిట మార్చుతున్నారు. అధికారంలో ఎవరుంటే వారికి కావలసిన కీర్తిశేషులే తెర మీదకు వస్తుంటారు. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ఇదే తంతు. మొన్నటికి మొన్న- జవహర్‌లాల్‌ నెహ్రూ గొప్పతనమేమిటి? సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మాత్రమే మహాత్మాగాంధీ తర్వాత అంతటివాడు అంటూ సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీనే అత్యధిక కాలం పాలించింది కనుక నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత దేశం కోసం ప్రాణాలు విడిచారు కనుక ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహించడమే కాకుండా పలు ప్రభుత్వ పథకాలకు, భవనాలకు వారి పేర్లు పెట్టారు.

ఇప్పుడు దేశంలో కాంగ్రెస్‌ అధ్యాయం ముగిసి భారతీయ జనతా పార్టీ అధ్యాయం, అందులోనూ కాంగ్రెస్‌ బద్ధ వ్యతిరేకి అయిన నరేంద్ర మోదీ శకం ప్రారంభమైంది కనుక ఇప్పటివరకు చలామణిలో ఉన్న కీర్తిశేషుల స్థానంలో కొత్తవారు వచ్చి చేరుతున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారు. ఎవరి పాత్ర వారిది. సుభాష్‌ చంద్రబోస్‌ వంటి వారికి దక్కాల్సినంత గౌరవం దక్కలేదన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వారిలో కూడా నెహ్రూ కుటుంబానికి దక్కిన గౌరవం మిగతా వారికి దక్కలేదు. అత్యంత నిరాడంబర జీవితం గడిపిన మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్ర్తికి తగిన గుర్తింపు, గౌరవాన్ని కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇవ్వలేదు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కూడా ఈ కోవలోకే వస్తారు. అలా చేయడం అన్యాయం కనుక ఇప్పుడు దాన్ని సరిదిద్దే అవకాశం వచ్చింది కనుక నెహ్రూ స్థానంలోకి వల్లభాయ్‌ పటేల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పైకి తీసుకువచ్చారు. పటేల్‌ జయంతి వేడుకలకు కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యులు దూరంగా ఉండగా, పండిట్‌ నెహ్రూ 125వ జయంతిని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని ఆ వేడుకలకు దూరం పెట్టింది. ఆహ్వానించను కూడా లేదు. దీంతో నెహ్రూ- పటేల్‌లు జీవించి ఉన్న కాలంలో బద్ధశత్రువులేమోనన్న అనుమానం నేటి తరంలో తలెత్తుతున్నది. నేటి తరం నాయకుల సంకుచిత ధోరణుల వల్ల యావత్తు జాతి పూజించి, గౌరవించవలసిన నాయకులు ఒక వర్గానికి లేదా ఒక ప్రాంతానికి పరిమితమయ్యే దుస్థితి దాపురించింది. ఇవే ధోరణులు కొనసాగితే గుజరాతీయులైన మహాత్మా గాంధీ, పటేల్‌లను మనమెందుకు పూజించాలని ఇతర రాష్ర్టాలవారు మున్ముందు ప్రశ్నించినా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. దివంగత నాయకులకు ప్రాధాన్యం కల్పించడంలో గతంలో కూడా రాజకీయాలు ఉండేవి. అయితే వారి ఔన్నత్యాన్ని మాత్రం అవి మింగలేకపోయాయి. ఇంతకాలంగా మనం గుర్తించి గౌరవించిన నాయకులు అందరూ యువతరానికి స్ఫూర్తిని ఇవ్వగలిగినవారే! మహనీయుల త్యాగాలు, సేవలను గుర్తుపెట్టుకున్నామని చెప్పడానికి, భావి తరాలకు గుర్తుచేయడానికే వారి విగ్రహాలు ఏర్పాటు చేసి, పథకాలు-భవనాలకు వారి పేర్లు పెట్టుకుంటాం.

దీనివల్ల వారి కుటుంబ సభ్యులకు ఒరిగేది ఏమీ ఉండదు. అయితే ఇప్పుడు సంకుచిత రాజకీయాలు చోటుచేసుకున్నాయి కనుక ఒక్క మహాత్మాగాంధీయేవివాదరహిత నాయకుడిగా మిగిలారు. ఇప్పటికే బాపూజీ ఆశయాలకు కాలం చెల్లినందున మున్ముందు ఆయన పరిస్థితి ఏమవుతుందో తెలియదు. తెలుగు రాష్ర్టాల విషయానికి వద్దాం. జ్యోతిరావు ఫూలే పేరు గుర్తుందా? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చివరి రోజులలో ఈయన పేరు వెలుగులోకి వచ్చింది. సామాజిక న్యాయం ప్రధాన ప్రాతిపదికగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి తమకు జ్యోతిరావు ఫూలే ఆదర్శమని ప్రకటించారు. ఇంకేముంది- బీసీల కోసం పోరాడిన నాయకుడిగా పేరొందిన ఫూలేను గౌరవించకపోతే ఆ వర్గం ఓట్లు తమకు ఎక్కడ దక్కవోనన్న దిగులుతో మిగతా రాజకీయ పార్టీల నాయకులు కూడా ఫూలే జయంతులను కొంతకాలంపాటు ఘనంగా నిర్వహించారు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవ్వడంతో జ్యోతిరావు ఫూలే ప్రభ కూడా మసకబారింది. రెండు మూడు సంవత్సరాల పాటు ఫూలే తమకు ఆదర్శమని ప్రకటించిన ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలు పూర్తికావడంతో ఆయన పేరును తలవడం కూడా మానేశారు. చిరంజీవి రాజకీయాలోకి రాకముందు కూడా జ్యోతిరావు ఫూలే ఉన్నారు. కానీ ఎవరికీ పట్టలేదు. ఇప్పుడు అక్కర తీరింది కనుక ఎవరికీ పట్టడంలేదు. అంటే రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే దివంగత నాయకులను నెత్తికెత్తుకుంటారు, కిందపడేస్తారు, ఏమైనా చేస్తారు. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా చరిత్ర సుడులు తిరుగుతూ ఉంటుంది. అందుకే కొంతమందికి చరిత్రలో తగినంత ప్రాధాన్యం లభించదు. మరికొందరికి అవసరానికి మించిన ప్రాధాన్యం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయి తెలంగాణ, ఏపీలుగా ఏర్పడింది కనుక తెలుగునాట కూడా పేర్ల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి రాష్ర్టానికి రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రతి పథకానికి, ప్రభుత్వ భవనాలకు రాజీవ్‌గాంధీ పేరునే పెట్టారు. ఎన్‌.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తుల పేర్లు కాకుండా తాను చేపట్టిన పథకాలకు తెలుగుతో ప్రారంభమయ్యే పేర్లనే పెట్టేవారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్‌. పదేళ్ల విరామం తర్వాత, విభజిత ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాజీవ్‌ పేరిట ఉన్న పథకాలను ఎన్‌.టి.ఆర్‌. పేరిట మార్చడం ప్రారంభించింది. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కాస్తా ఎన్‌.టి.ఆర్‌. ఆరోగ్య సేవగా మారబోతున్నది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కూడా పాత పథకాల పేర్లను మార్చడం ప్రారంభించింది.

-  రాజకీయ అవసరార్థం..!

ఈ నేపథ్యంలోనే శంషాబాద్‌ విమానాశ్రయం డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్‌.టి.ఆర్‌. పేరును పునరుద్ధరించడం వివాదాస్పదమైంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున మా రాష్ట్రంలో ఇంకా ఆంధ్రా నాయకుల పేర్లు పెట్టడం ఏమిటన్న ప్రశ్న శాసనసభలో వచ్చింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ శాసనసభ తీర్మానం కూడా చేసింది. తాము కొత్తగా నిర్ణయం తీసుకోలేదు. పాత నిర్ణయాన్నే అమలుచేశామని పౌర విమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజు వివరణ ఇచ్చారు. గతంలో విమానాశ్రయం బేగంపేటలో ఉండేది. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆ విమానాశ్రయంలో డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్‌.టి.రామారావు పేరు పెట్టించారు. తర్వాత అది శంషాబాద్‌కు మారింది. అప్పుడు అధికారంలో ఉన్న రాజశేఖర్‌రెడ్డి విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరు పెట్టించి, ఎన్‌.టి.ఆర్‌. పేరు ఎక్కడా లేకుండా చేశారు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంత గోల చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా ఆ పార్టీకి చెందిన అశోక్‌ గజపతిరాజు ఉన్నారు. ఇంకేముంది ఎన్‌.టి.ఆర్‌. పేరు మళ్లీ వచ్చి చేరింది.

ఇప్పుడు శంషాబాద్‌ విమానాశ్రయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కనుక ఈ చర్య వివాదాస్పదం అయ్యింది. అందరివాడిగా తెలుగు ప్రజల మన్ననలు అందుకున్న ఎన్‌.టి.రామారావు కాస్తా కొందరి వాడిగా మారిపోయాడు. ఆయనను అలా మన రాజకీయ నాయకులే మార్చారు. కళాకారుడికి కులం, మతం, ప్రాంతం ఉండదని ఎన్‌.టి.ఆర్‌. ఎప్పుడూ అంటూ ఉండేవారు. రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తనను కళాకారుడిగా గుర్తించి ఎవరైనా పొగిడితే ఆయన అమితానందం పొందేవారు. ‘‘రాజకీయాలు ఇంత దరిద్రంగా ఉంటాయని తెలియదు. కళాకారుడిగా ఉన్నప్పుడే సంతోషంగా ఉండేవాడిని’’ అని ఆయన ఎప్పుడూ అంటూ ఉండేవారు. తెలుగు జాతి గౌరవించదగ్గవారిలో ఒకరైన ఎన్‌.టి.ఆర్‌.లాంటి మహానుభావుడిని కొందరివాడిగా, ఒక ప్రాంతంవాడిగా మార్చేసిన ఈ రాజకీయ నాయకులను ఏమనాలి? శంషాబాద్‌ డొమెస్టిక్‌ టెర్మినల్‌కు తన పేరు పెట్టాలని ఎన్‌.టి.ఆర్‌. ఎవరి కలలోకైనా వచ్చి కోరారా? లేదే? అలాంటప్పుడు ఆయనను వివాదాస్పదం చేయడం ఎందుకు? రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడినందున ఆ రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయంలోని డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్‌.టి.ఆర్‌. పేరును ఖాయం చేసే ముందు తెలుగుదేశం పార్టీ గానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గానీ తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి ఉండవలసింది. అధికారం ఉందికదా అని ఎన్‌.టి.ఆర్‌. పేరు పెట్టారు. ఈ చర్య వల్ల ఎన్‌.టి.ఆర్‌. పేరు అనవసరంగా వివాదాస్పదం అయింది. పౌర విమానయాన శాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభలో మాట్లాడిన పలువురు ఎన్‌.టి.ఆర్‌. ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీలోనే రాజకీయంగా పురుడు పోసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా తెలుగుదేశం పార్టీ తరఫునే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో సమితి ప్రెసిడెంట్‌గా ఉన్న కుందూరు జానారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు.

1983లో ఎన్‌.టి.ఆర్‌. అధికారంలోకి రాగానే జానారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుని ఏకంగా పదిహేను శాఖలు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అన్ని శాఖలు నిర్వహించిన మంత్రి మరొకరు లేరు. టి.జీవన్‌రెడ్డి కూడా తొలిసారిగా జగిత్యాల నుంచి తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో ఆయన తన ఎన్నికల ప్రచారం కోసం 25 వేల రూపాయలు ఖర్చు చేశారు. అక్కడితో చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. మరో పది వేల రూపాయలు ఉంటే గెలుపు సాధ్యం అని భావించారు. ఇంతలో జగిత్యాలలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎన్‌.టి.ఆర్‌.కు తన పరిస్థితిని వివరించారు. దాంతో ఎన్‌.టి.ఆర్‌. ‘‘రేపు హైదరాబాద్‌ వచ్చి పది వేల రూపాయలు తీసుకువెళ్లండి బ్రదర్‌’’ అని చెప్పారు. ఎన్‌.టి.ఆర్‌. సమకూర్చిన పది వేల రూపాయలు కూడా ఖర్చు చేసిన జీవన్‌ రెడ్డి మంచి మెజారిటీతో గెలుపొందారు. ఇక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విషయం చెప్పనే అవసరం లేదు. చలనచిత్ర నటుడిగా ఎన్‌.టి.ఆర్‌. ఉన్నప్పుడు కేసీఆర్‌ ఆయనకు వీరాభిమాని. ఆ అభిమానంతోనే తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు. అదే అభిమానంతో ఎన్‌.టి.ఆర్‌. తెలుగుదేశం పార్టీ పెట్టగానే అందులో చేరారు. వీరికి మాత్రమే కాదు, తెలంగాణలో చాలా మందికి ఎన్‌.టి.ఆర్‌. అంటే అమితమైన గౌరవం, అభిమానం. బీసీ వర్గాలైతే ఆయనను ఆరాధ్య దైవంగా కొలిచేవి. తెలంగాణలో పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా బడుగువర్గాల ప్రజల ఆదరాభిమానాలను ఎన్‌.టి.ఆర్‌. చూరగొన్నారు. ఎన్‌.టి.ఆర్‌. రాజకీయ జీవితాన్ని ఆయన శత్రువులు కూడా వేలెత్తి చూపలేరు. అలాంటి ఎన్‌.టి.ఆర్‌.ను ఇవ్వాళ బజారుకు ఈడ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్‌ విమానాశ్రయం డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్‌.టి.ఆర్‌. పేరు పెట్టడం సమర్థనీయమా? కాదా? అన్నది పక్కనపెడితే, అందరివాడిగా ఉండవలసిన ఎన్‌.టి.ఆర్‌.ను కొందరివాడిగా చేయడం మాత్రం కచ్చితంగా ఆక్షేపణీయం. తెలుగునాట ఎంతో మంది ముఖ్యమంత్రులుగా చేశారు. కానీ ఎవరూ మిగుల్చుకోలేనంత ఖ్యాతిని ఎన్‌.టి.ఆర్‌. మిగుల్చుకుని వెళ్లిపోయారు. అలాంటి మహానుభావుడి పేరు వివాదాస్పదం కావడం కూడా కాలంతో వచ్చిన మార్పులకు సంకేతం. రాష్ట్రం విడిపోయింది కనుక ఇప్పుడు ఎన్‌.టి.ఆర్‌.ను ఏపీకి మాత్రమే పరిమితంచేశారు.

భవిష్యత్తులో ఏపీలో కూడా కృష్ణా జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తారేమో తెలియదు. విషాదం ఏమిటంటే రాష్ట్రం విడిపోతుందని తెలియక ఎన్‌.టి.ఆర్‌. సమాధిని హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. హుస్సేన్‌సాగర్‌ పక్కన ఉన్న ఎన్‌.టి.ఆర్‌. ఘాట్‌ను కూడా తరలించాలని భవిష్యత్తులో ఎవరైనా కోరతారేమో తెలియదు. అయినా ఆంధ్రావాడి సమాధి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉండాలి అని ఎవరైనా అంటే ఏమి సమాధానం చెప్పగలరు? ఎన్‌.టి.ఆర్‌. ఘాట్‌ ఏర్పాటుచేసిన వారికి రాష్ట్రం విడిపోతుందని తెలియదు కనుక వారి చర్యను తప్పుబట్టలేం. కాలంతోపాటు వచ్చే మార్పులను ముందుగానే ఊహించగలిగే శక్తి ఉంటే ఎన్‌.టి.ఆర్‌. ఘాట్‌ను ఏ నిమ్మకూరులోనో నిర్మించి ఉండేవారు. ఏమైతేనేమి ఇప్పుడు తన ప్రమేయం లేకుండానే ఎన్‌.టి.ఆర్‌. వివాదాస్పదమయ్యారు. అందుకు మొదటి కారకుడు చంద్రబాబు కాగా, రెండవ కారకులు రాజకీయం

Facebook like
Google Plus Circle
Youtube Subscribe