Breaking News

ఆరో వినాశానికి కారకులు మానవులే

Jun 27, 2015 21:16
ఆరో వినాశానికి కారకులు మానవులే

450-440 మిలియన్‌ సంవత్సరాల కిందట.. భూమిపై మహా విలయం సంభవించింది. సర్వనాశనం జరిగింది. భూమ్మీది జీవరాశుల్లో 60-70ు జీవజాతులు నశించిపోయాయి! ఉన్న జీవులు కాలూ చెయ్యీ కూడదీసుకుని మళ్లీ మనుగడ సాగించడం ప్రారంభించాయి. 

 

375-360 మిలియన్‌ సంవత్సరాల కిందట.. మరోసారి మహాప్రళయం సంభవించింది. మొదటి విలయం ధాటికి తట్టుకొని మనుగడ సాగించిన 30 శాతం జీవుల్లో మళ్లీ 70ు మేర తుడిచిపెట్టుకుపోయాయి. ఈ దశ దాదాపు 20 మిలియన్‌ సంవత్సరాలపాటు కొనసాగింది.

 

251 మిలియన్‌ సంవత్సరాల కిందట.. మూడో ఉత్పాతం సంభవించింది. ఇది ఇప్పటిదాకా భూమ్మీద సంభవించిన మహా విలయం. ఈ దశలో భూమ్మీది జీవజాతుల్లో 96 శాతం దాకా ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ వినాశానికి శాస్త్రజ్ఞులు పెట్టిన పేరు.. గ్రేట్‌ డయింగ్‌! అప్పుడు సర్వనాశనమైపోగా మిగిలిన 4 శాతం జీవజాతుల నుంచి పుట్టినవే ఇప్పుడు భూమ్మీద మిగిలినవి.

 

200 మిలియన్‌ సంవత్సరాల కిందట.. నాలుగో విలయం. భూమ్మీద మిగిలిన జీవుల్లో మరో 70 శాతం నుంచి 75 శాతం మేర నశించిపోయాయి.

 

66 మిలియన్‌ సంవత్సరాల కిందట.. మరో 75 శాతం జీవజాతులు నశించాయి. భూగోళంలోని రాక్షస బల్లులన్నీ అంతరించిన కాలమదే. ఆ తర్వాత భూమ్మీద క్షీరదాలు, పక్షుల సంతతి పెరిగింది.

 

మంచుయుగాలు, అగ్నిపర్వతాలు, అంతరిక్షం నుంచి గ్రహశకలాలు వచ్చి పడటం.. ఇలా కారణాలేవైనాగానీ, గడచిన 50కోట్ల సంవత్సరాల కాలంలో ఐదుసార్లు మహావిలయాలు సంభవించి జీవజాతులు భారీ ఎత్తున తుడిచిపెట్టుకుపోయాయి. మరి తర్వాతి మహావిలయం ఎప్పుడు జరగబోతోంది? దేనివల్ల మానవాళికి ప్రమాదం కలగబోతోంది? ఇప్పటికిప్పుడే మన జీవితకాలంలోనే జరగకపోవచ్చుగానీ.. అతి త్వరలోనే ఆ దుర్దినం దాపురించే అవకాశం ఉందని ఎలిజబెత్‌ కోల్‌బెర్ట్‌ అనే జర్నలిస్ట్‌ విశ్లేషిస్తున్నారు. ఆమె రాసిన ‘ద సిక్స్త్‌ ఎక్స్‌టింక్షన్‌’ అనే పుస్తకానికి ఈ ఏడాది కాల్పనికేతర సాహిత్య విభాగంలో పులిట్జర్‌ బహుమతి దక్కింది. ఆరో వినాశానికి ప్రకృతి ఉత్పాతాలు కాక, మనిషే కారకుడవుతాడని ఆమె స్పష్టం చేస్తున్నారు. మనుషుల వల్లనే భూమ్మీద ఎన్నో జీవజాతులు ఆందోళనకరస్థాయిలో అంతరించిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు.. పనామాలో ఒకప్పుడు ఒకరకం ప్రత్యేకమైన కప్పలు ఉండేవని.. ఇప్పుడవి అరుదుగా కనిపిస్తున్నాయని, అవి అంతరించిపోవడానికి కారణం చిట్రిడ్‌ అనే ఫంగస్‌ అని ఆమె వివరించారు. ఆ ఫంగస్‌ అసలు పనామాలో ఉండదని.. మానవులే వేరే దేశం నుంచి ఆ ఫంగస్‌ను ఆ దేశంలోకి తీసుకొచ్చి ఉంటారని విశ్లేషించారు. నిజానికి ఈ అంతరించిపోవడం అనే మాట మనకు తెలిసిన జీవులకు మాత్రమే సంబంధించినదని..

 

మనకు తెలియని కొన్ని వేల జీవజాతులు సముద్రాల్లో, ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయని, వాటి గురించి మనకు తెలిసే లోపలే మానవకారక కాలుష్యాల వల్ల అవి అంతరించిపోతున్నాయని ఎలిజబెత్‌ వెల్లడించారు. అసలు మనిషి ఆరో మహా వినాశం గురించి స్పష్టంగా గుర్తించే సమయానికే భూమ్మీది జీవరాశుల్లో మూడొంతుల మేర తుడిచిపెట్టుకుపోతాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, అందుకు కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని మాత్రం చెప్పారు. ప్రత్యేకించి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన జీవులు త్వరగా అంతరించిపోతాయని.. వాటి ఆవాసాల్లో జీవించే పరిస్థితులు దెబ్బతింటే అవి మనుగడ సాగించలేక మరణిస్తాయని వివరించారు. ఇలా వాటి సహజ ఆవాసాలు దెబ్బతినడానికి కారణం మానవులేనని.. అసలు, గడచిన 100 సంవత్సరాల్లో అంతరించిపోయిన జీవులకు ఆ దుస్థితి పట్టడానికి ఏకైక కారణం మనిషేనని ఆమె స్పష్టంగా చెబుతున్నారు.

 

ఇవీ మనిషి తప్పిదాలు..

వేట.. వందల సంవత్సరాల తరబడి ఒక ప్రాంతంలో వేటాడటం వల్ల అక్కడుండే జీవులన్నీ నశిస్తాయి. రెండోది.. దురాక్రమణ జీవులు. అంటే ఏ ప్రాంతంలో జీవించే జీవికి ఆ ప్రాంతంలోనే సహజ శత్రువు ఉంటుంది. దీనివల్ల రెండు జాతుల సంఖ్యా అదుపులో ఉండి సమతౌల్యం కొనసాగుతుంది. అదే ఒక జీవికి/మొక్కకు సహజ శత్రువులు లేని ప్రాంతానికి వాటిని తీసుకువెళితే అవి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడమే కాకుండా, అక్కడి అరుదైన జీవులకు ప్రాణాంతకంగా మారుతాయి. మూడోది.. అడవులు నరికేస్తున్నాం. విషవాయువులను గాల్లోకి వదిలి వాతావరణాన్ని పాడుచేస్తున్నాం. సముద్రాల్లోకి రసాయనాలు పంపి జలకాలుష్యానికి కారణమవుతున్నాం. ఇలా.. చెప్పుకొంటూ పోతే మనిషి సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని ఎలిజబెత్‌ అంటారు. ఇప్పటికైనా మానవులు కళ్లు తెరిచి కాలుష్యానికి చెక్‌ పెట్టాలని.. స్వార్థ ప్రవృత్తిని విడనాడాలని సూచిస్తున్నారు. 

 

కర్బన కాలుష్యం తగ్గితేనే..
పెట్రో ఉత్పత్తులను, బొగ్గును తగలబెట్టేస్తూ ఉంటే 2050కల్లా భూమి పొయ్యి మీద పెనంలా వేడెక్కి పోతుందని.. ఇప్పుడున్న దాని కంటే ఐదు డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువ వేడిగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సస్టైనబుల్‌ రిసోర్సెస్‌ (ఐఎస్‌ఆర్‌) పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనికి పరిష్కారమేంటంటే.. భూమి లోపల ఇప్పుడున్న శిలాజ ఇంధనాల చమురు నిల్వల్లో మూడో వంతు, సహజవాయువు నిల్వల్లో సగం, బొగ్గు నిల్వల్లో 20 శాతం మాత్రమే వాడుకోవాలట.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe