Breaking News

మగాళ్ళకు నో ఎంట్రీ

Oct 07, 2015 06:38
మగాళ్ళకు నో ఎంట్రీ

 ఆడవాళ్ళకు ఆ గ్రామం స్వర్గంలాంటిది. ఆ ఊరి ఆడవాళ్లకు మగవాళ్ల వేధింపులు అసలే ఉండవు. అత్యాచారాలు, అఘాయిత్యాలు, గృహహింసలు అసలే లేవు. పైగా చుట్టుపక్కల గ్రామాల్లోని వితంతువులు, భర్త వదిలేసిన వారు ఈ గ్రామం వైపే అడుగులు వేస్తారు. అసలు అలాంటి బాధితులతోనే ఆ ఊరు ఏర్పడిందంటే వింతగా ఉంటుంది ఎవరికయినా! ఆ ఊరిని నిర్మించుకున్నది కూడా ఆడవాళ్ళే. ఈ ఊళ్ళోకి మగవాళ్ళు రావడానికి వీల్లేదు. మొత్తం ఊరంతా ఆడవాళ్ళే. ఆ ఊరి పేరు ‘ఉమోజా’. కెన్యాలో ఉందీ కుగ్రామం. 

 

ధైర్యంతో ముందడుగు

కెన్యా ఉత్తర ప్రాంతంలో 25 ఏళ్ళ క్రితం, అంటే 1990లో ఈ గ్రామాన్ని కేవలం మహిళల కోసమే ఏర్పాటు చేసింది రెబెకా. ఈమె సంబూరు తెగకు చెందిన మహిళ. ఉమోజా గ్రామపెద్ద కూడా. గ్రామంలో మహిళలను విపరీతంగా కొట్టేవారని, మగవారి ఆగడాలకు హద్దుండేది కాదని అంటూ స్త్రీల పరిస్థితిని వివరించింది. ఒకరోజు కొందరు ఆమెను కొడుతుంటే భర్త అడ్డుకోలేదట! దాంతో ఆమె ఓపిక నశించి, మగవారి అండ, తోడు తనకు అవసరం లేదనుకుంది. పురుషులకు చోటులేని కొత్త నివాసం ఏర్పరుచు కోవాలని నిర్ణయించుకుని, ఉమోజా గ్రామ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 

మగవాళ్ళకు నో ఎంట్రీ!

గ్రామం ఏర్పాటైన తరువాత నెమ్మది నెమ్మదిగా అత్యాచార బాధితులు, గృహహింసను తాళలేని వారు, వితంతువులు, అనాథ లైన ఆడపిల్లలు, పెళ్లి వద్దనుకునే ఆడవాళ్ళు,, ఎంచక్కా ఒక్కొ క్కరుగా అడుగుపెట్టి గ్రామానికి రూపురేఖలు తీసుకువచ్చారు. మగవాళ్ళకు ‘నో ఎంట్రీ’ అంటూ ఇప్పుడీ గ్రామంలోని మహిళలు సంతోషంగా గడుపుతున్నారు. బతుకుదెరువు కోసం రకరకాల ఆభరణాల తయారీతోపాటు, ఇతర పనులు చేస్తుంటారు వీళ్లు.

 

అన్ని రకాల సదుపాయాలూ గ్రామంలో ఉన్నాయి. ఎండ, వాన, చలి నుంచి కాపాడుకోడానికి ఇళ్ళు నిర్మించుకున్నారు. పిల్లలు చదువుకోడానికి పాఠశాల కూడా ఏర్పాటు చేసుకున్నారు. వినోద కార్యక్రమాల కోసం, ఇతర గ్రామ కార్యకలాపాల కోసం కమ్యూనిటీ సెంటర్‌ ఉంది. అంతేకాదు తమ గ్రామంలోకి మగవాళ్ళు ప్రవేశించకుండా అడ్డుకునే సాయుధులు కూడా వాళ్ళే. 

పర్యాటక ప్రాంతంగా

‘ఆడవాళ్ళకే ప్రత్యేకం’, ‘నో ఎంట్రీ ఫర్‌ మెన్‌’ అవటంతో ఉమోజా పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. ఈ గ్రామం పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి చెందుతోంది. అయితే, మగవాళ్లకు అనుమతి లేని కారణంగా వచ్చే పర్యాటకులను మాత్రం కొన్ని షరతులకు అనుగుణంగా గ్రామ సందర్శనకు అనుమతినిస్తారు. తమకోసం తామే ఏర్పాటు చేసుకున్న ఉమోజా గ్రామ ఆడవాళ్ళకు జేజేలు పలుకుదామా మరి!

Facebook like
Google Plus Circle
Youtube Subscribe