Breaking News

సినిమా... చూడాలనుందా?

Oct 18, 2015 20:19
సినిమా... చూడాలనుందా?

ఇప్పుడంటే టీవీ చానల్స్‌, ఇంటర్నెట్‌, వీడియోగేమ్స్‌ అని బోలెడు వినోదాలు. కానీ ఒకప్పుడు సినిమా తప్ప మరో వినోదం లేదు! అప్పట్లో సినిమా కోసం అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. మరి ఇప్పుడో.. విడుదలైన మరునాడే ఆ సినిమా ఇంటెర్నెట్‌లో ప్రత్యక్షం!

మొన్నటిదాకా సినిమా అంటే కంప్యూటర్‌లోనో, డీవీడీ ప్లేయర్‌లోనో చూసేవారు. కానీ ఇప్పుడు కొత్తగా సెల్‌ఫోన్‌లోనే చూసేస్తున్నారు. ఇలా మెల్లిగా సినిమా థియేటర్ల వైభవం తగ్గుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సగటు ప్రేక్షకుడిని తిరిగి సినిమా హాలుకి రప్పించాలంటే ఏం చేయాలి? ప్రేక్షకులు ఓహ్‌! అనుకునేలా, మళ్ళీ మళ్ళీ వారిని రప్పించేలా, ప్రత్యేకంగా చెప్పుకునేలా సినిమా థియేటర్‌ని సరికొత్త ఆకర్షణలతో డిఫరెంట్‌గా తీర్చిదిద్దాలి. థియేటర్‌లో సకల వసతులు, మంచి వాతావరణం కల్పించాలి. టికెట్ల ధర అందుబాటులో ఉంచాలి. సినిమా అంటూ చూస్తే ఈ థియేటర్‌లోనే చూడాలి అనేంతగా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలి. థియేటర్‌ యజమానులు ఇప్పటికే ఈ సూత్రాలు అమలు చేస్తున్నారు. కానీ వీళ్ళందరినీ కూడా తలదన్నేలా వినోదంతో పాటు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసేలా థాయ్‌లాండ్‌లో ఏకంగా సముద్రం మధ్యలోనే ఓ సినిమా థియేటర్‌ నిర్మించారు. 

అలలపై థియేటర్‌

సముద్రం మధ్యలో పండు వెన్నెలలో అలల మీద తేలియాడుతూ కూర్చుని మీరెప్పుడైనా సినిమా చూశారా? దాంతోపాటు చీకటి తెరలు... పక్కన ఇష్టమైన వ్యక్తితో.. పాప్‌కార్న్‌... అదో గొప్ప అనుభవం కదూ! అందుకే థాయిలాండ్‌లో బంగాళాఖాతంలో ఉన్న కుడూ ద్వీపంలోని రెండు పెద్ద కొండ రాళ్ల మధ్య నీటిలో తేలియాడే సినిమా హాలు నిర్మిం చారు. 

 

ఏడాదిలో కొద్ది రోజులే!

చైనా, బీజింగ్‌లలో ఉన్న సినిమాహాళ్ల నిర్మాణ శైలిని ఆధారం చేసుకుని జర్మనీకి చెందిన ఓల్‌ శ్రీరన్‌ అనే వ్యక్తి ఈ సినిమా థియేటర్‌ నిర్మించారు. అయితే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ సినిమాలు ప్రదర్శిస్తారు. ఆ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ పేరు ‘ఫిల్మ్‌ ఆన్‌ ద రాక్స్‌ యావో నోయ్‌’. అంటే కొండల మధ్య సినిమా చూడడం అని అర్థం. 

ఎలా నిర్మించారు?

సముద్రంలో సినిమాహాలును ఎలా నిర్మిం చారని అనుమానం వస్తోందా? దోమ తెరలు, రబ్బర్‌ స్టంప్స్‌, చేపలు పట్టే వలలు, రబ్బర్‌ ట్యూబ్‌లతో ఈ సినిమా థియేటర్‌ నిర్మించారు. ప్రేక్షకుల కుర్చీలు రబ్బర్‌ ట్యూబ్‌లతో తయారు చేశారు. చుట్టూ పరదాలు కడతారు. దానికి కొద్ది దూరంలోనే ఎల్‌ఈడీ స్ర్కీన్‌ ఉంటుంది. తెరపైన ప్రదర్శించే సినిమా నీటిపై కలర్‌ఫుల్‌గా ప్రతిబింబిస్తూ కనువిందు చేస్తుంది. నీటి అలల తాకిడికి రబ్బర్‌ ట్యూబ్‌ కుర్చీలు నెమ్మదిగా ఉయ్యాలలూపుతుంటే, సరికొత్త లోకంలో విహరిస్తున్న అనుభూతితో ప్రేక్షకులు పరవశిస్తూ సినిమా చూస్తుంటారు. 
ఈ అనుభూతి ఎంతో థ్రిల్‌ కలిగిస్తుందంటున్నారు ఆ థియేటర్‌లో సినిమా చూసిన ప్రేక్షకులు. 

 

రాజసం ఉట్టిపడే సినిమా హాలు!

ఎవరైనా సినిమాకి ఎందుకు వెళతారు? సినిమా చూడటానికా? సినిమా థియేటర్‌ ఎలా ఉందో చూడటానికా? కానీ అమెరికాలోని డెట్రాయిట్‌ లో ఫాక్స్‌ థియేటర్‌కి మాత్రం ప్రత్యేకంగా వీక్షకులు ఆ భవంతిని చూడడానికే వెళ్తుంటారు. రాజభవనాలను తలదన్నే నిర్మాణ శైలితో బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటుందీ భవనం. ఈ భవనాన్ని 1920లో నిర్మించారు. ప్రస్తుతం దీన్ని సాంస్కృతిక కార్యక్రమాల వేదికగా ఉపయోగిస్తున్నారు. మూడంచెల సీట్లతో ఉండే ఈ హాలు లోపలి భాగం భారత్‌, చైనా, బర్మా, పర్షియా దేశాల ప్రాచీన నిర్మాణాలను పోలి ఉంటుంది. చూడగానే రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది.! 

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe