Breaking News

శ్రీప్రియ కొప్పుల మన హైదరాబాదే

Oct 18, 2015 20:32
శ్రీప్రియ కొప్పుల మన హైదరాబాదే

ఆన్‌లైన్‌లో మనం కొనే ప్రతి వస్తువును అన్ని కోణాల్లో పరిశీలించి కొనేందుకు వీలుగా టర్న్ ఏరౌండ్ ఇన్నోవిజన్ పేరుతో త్రీడి యానిమేషన్ సేవలందిస్తోంది శ్రీప్రియ కొప్పుల.
 

\"Sri-priya\"

ఇప్పుడు వ్యాపారమంతా ఆన్‌లైన్‌లోనే. చేతిలో మొబైల్ ఉంటే చాలు, నెట్ కనెక్షన్‌తో కావలసిన వస్తువుల్ని ఆన్‌లైన్‌లో చూసి ఆర్డర్ చేయడమే. అయితే కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన వస్తువు వచ్చాక మనకు నచ్చలేదని బాధపడుతుంటాం. దాన్ని రిటర్న్ చేసి తిరిగి ఆర్డర్ చేస్తాం. కానీ, మళ్లీ అదే సమస్య. అలాంటి సమస్యను దూరం చేయడానికి ఆన్‌లైన్ వస్తువులను వివిధ కోణాల్లో త్రీడీ యానిమేషన్ ద్వారా చూసే వీలు కల్పిస్తోంది టర్న్ ఏరౌండ్ ఇన్నోవిజన్. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థను స్థాపించిన అమ్మాయి శ్రీప్రియ కొప్పుల. ఈ అమ్మాయిది మన హైదరాబాదే.

జీవితం ఇంతే అనుకుంటే అక్కడితోనే ఆగిపోతాం. చేయాల్సింది ఇంకా వుంది అనుకుంటే మరింత ముందుకు సాగుతాం అంటోంది శ్రీప్రియ. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శ్రీప్రియ బెంగళూరు కేంద్రంగా టర్న్ ఏరౌండ్ ఇన్నోవిజన్ అనే సంస్థకు సిఇవోగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థను నెలకొల్పడానికి ప్రధాన కారణం ఏదైనా సాధించాలన్న తన సంకల్పమే అంటారామే.

శ్రీప్రియ ఆరేళ్లకే తండ్రిని కోల్పోయింది. ఆయన వరంగల్‌లోని నాటి ఆర్‌ఈసీలో గోల్డ్ మెడలిస్ట్. అందుకే తన ఇద్దరు పిల్లలూ ఇంజనీర్లు కావాలని ఆమె తల్లి కష్టపడి చదివించింది. తల్లి కోరికకు తగినట్లు శ్రీప్రియ కూడా ఖరగ్‌పూర్ నుంచి ఐఐటి పూర్తి చేసింది. చదువు కాగానే పలు మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసింది. 2006లో పెళ్లి అయ్యాక బెంగళూరు వెళ్లింది. అక్కడ కెటెరా టెక్నాలజీస్‌లో చేరింది. అక్కడి టెక్‌టీమ్‌లో ఆమె తొలి మహిళా టెకీ. కానీ, ఆమె లక్ష్యం అది కాదు. ఏదో సాధించాలని మదనపడేది. 
ఆ సమయంలోనే తన స్వానుభవమే ఆమెలో కొత్త ఆలోచలకు ఆస్కారమిచ్చింది. 

తీరికలేని ఉద్యోగం మూలంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేసేది. అయితే ప్రతిసారి తను కొన్న వస్తువుల విషయంలో ఆసంతృపి.్త కారణం ఏ వస్తువును కొనాలన్నా దాని ఆకృతి, పరిమాణం, రంగు ఎలా ఉన్నదీ అన్న స్పష్టత లేకపోవడమే. ఆ సమయంలోనే మెరుపులాంటి ఆలోచన వచ్చిందామేకు. మనం కొనాలనుకునే వస్తువుల్ని వివిధ కోణాల్లో స్పష్టంగా చూడగలిగేందుకు వీలుండే ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించవచ్చు కదా! అని. వెంటనే పనిలోకి దిగిందామె. ఆ సాఫ్ట్‌వేర్ రూపొందించేందుకు కావలసిన వస్తువుల్ని విదేశాల నుంచి తెప్పించుకుంది. ఆ పని సాధ్యమే అని చేసి చూపింది. 
నేను తయారు చేసిన సాప్ట్‌వేర్‌కు ఆటోమేషన్ పరికరాన్ని అమర్చా. దీనివల్ల ఆన్‌లైన్‌లో మనం కొనాలనుకునే వస్తువును మూడొందల డిగ్రీల కోణంలో చూడొచ్చు అంటోంది శ్రీప్రియ. సింగిల్ క్లిక్‌తోనే కెమెరా ప్రోడక్ట్ చుట్టూ తిరిగి అన్ని వైపుల నుంచి ఫొటోగ్రాఫ్స్ తీసే డివైస్ ఇది. కనుకనే దీనికి టర్న్ ఏరౌండ్ ఇన్నోవిజన్ అని పేరు పెట్టింది.

అలా తొలి అడుగు వేసిన శ్రీప్రియ రోజుల తరబడి అనేక సంస్థలను కలిసి వారికి తన సాఫ్ట్‌వేర్‌ను గురించి వివరించే ప్రయత్నం చేసింది. తక్కువ సమయంలోనే వారు ప్రారంభించిన త్రీడి చిత్రాల సైట్‌ను చూసే వారి సంఖ్య పెరిగింది. దీంతో ఆన్‌లైన్‌లో ఎక్కువ అమ్ముడయ్యే వస్తువుల్ని గుర్తించి వాటిని తన సైట్‌లో ఉంచింది. పర్సులూ, రెడీమేడ్ డ్రెస్‌లు, ట్యాబ్లెట్ పీసీలు, పెన్‌డ్రైవ్‌లూ, మేకప్ వస్తువులు, చీరలు ఇలా ఆన్‌లైన్‌లో ఆదరణ వున్న ప్రతి వస్తువునూ సేకరించి త్రీడీ యానిమేషన్ చేసింది. ఇలా పదిహేను వందల ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు ఫ్లిప్‌కార్ట్, ల్యాడర్‌లు కూడా ఈ సంస్థతో చేతులు కలిపాయి. తక్కువ సమయంలోనే టెక్నాలజీ ఆటోమేటింగ్ ఇమేజ్ ఎడిటింగ్ లో చాలా పేరున్న సంస్థగా గుర్తింపు పొందింది. ఆయా వెబ్‌సైట్లలో దుస్తులు, బ్యాగ్‌లు, షూలు, ఫర్నీచర్ లాంటి అనేక కేటలాగ్‌లలో వస్తువుల ఫొటోగ్రాఫ్స్‌ని టర్న్ అరౌండ్ ఎడిట్ చేస్తుంది.

మరిన్ని వివరాలకు టర్న్ ఎరైండ్ వెబ్‌సైట్ చూడండి: http://goturnaround.com/
బిజినెస్‌లో ఎదురయ్యే సమస్యలు తీర్చేదే టెక్నాలజీ అని శ్రీప్రియ అంటారు. మార్కెట్‌లో ఉపయోగం లేని ప్రోడక్ట్ తయారు చేయడం కంటే, అసలు చేయకపోవడమే మంచిదని శ్రీప్రియ అభిప్రాయం.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe