Breaking News

రక్షణ ఎలా?

Nov 01, 2015 20:54
రక్షణ ఎలా?

సాంకేతిక పరిజ్ఞానం రాకతో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. అలాంటి నేరాల్లో ప్రధానమైనది డెబిట్‌ కార్డులు లేదా క్రెడిట్‌ కార్డులు కలిగి ఉన్న కస్టమర్లకు ఉచ్చులోకి లాగి వారి ఖాతాల నుంచి సొమ్ము ఖాళీ చేయడం. ఇలాంటి ప్రయత్నంలో భాగంగా కార్డ్‌ నంబర్‌, పిన్‌ కూడా చేతికి చిక్కాయంటే వారి పంట పండినట్టే. అవలీలగా ఎదుటి వారి ఖాతాలోని సొమ్మును స్వాహా చేయగలుగుతారు. కొందరు స్వప్రయోజనపరులైన, మోసపూరిత స్వభావం గల బ్యాంకు ఉద్యోగులు కూడా ఇందుకు తమ వంతు సహాయం అందిస్తున్నారంటున్నారు. తమ ఖాతాలో అనధీకృత లావాదేవీలు జరిగాయని కార్డు హోల్డర్లు తెలుసుకునే సమయానికే చేయి దాటిపోతుంది. ఆ సొమ్ము రాబట్టుకోవడం సప్త సముద్రాలకు ఆవల ఒక చిలకలో ఉన్న మాంత్రికుడి ప్రాణం తీయడం అంతటి చిక్కు సమస్యే. మోసపూరితమైన లావాదేవీ అని నిరూపించగల ఆధారాలున్నా కూడా తాము నష్టపోయిన సొమ్ము తిరిగి పొందేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఇలా సైబర్‌ నేరస్థుల వలలో చిక్కుకుని బాధపడే కన్నా తమంత తాముగానే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి నేరగాళ్ల వలలో పడకుండా మనని మనం కాపాడుకోవచ్చు.

ఆన్‌లైన్‌ పర్యవేక్షణ : డెబిట్‌కార్డు మోసం జరిగిందని గుర్తించడం ఎలా అన్నది మొదటి ప్రశ్న. ఇందుకు ప్రత్యేక నైపుణ్యాలేవీ అవసరం లేదు. క్రమం తప్పకుండా ఆన్‌లైన్‌లో బ్యాంక్‌ ఖాతాను పర్యవేక్షించుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ రోజుల్లో నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సదుపాయం విశేషంగా అందుబాటులోకి వచ్చింది. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రెండు సదుపాయాలు పొందవచ్చు. ఈ సదుపాయాలు వినియోగించుకోవడం ద్వారా రోజువారీ తమ ఖాతాలోని లావాదేవీలను ఇంట్లో కంప్యూటర్‌ ముందు కూచుని లేదా చేతిలోని మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ ద్వారా పర్యవేక్షించుకునే అవకాశం ఉంటుంది.

 

రసీదులు భద్రపరచండి : డెబిట్‌ కార్డ్‌ లావాదేవీలు నిర్వహించినప్పుడు రసీదులు వెంటనే పారేయకుండా కొంతకాలం పాటు జాగ్రత్త పరచడం కూడా మంచిది. ఇలా భద్రపరిచిన రసీదులను తీరిక కుదిరినప్పుడు ఆన్‌లైన్‌లో ఖాతా ఓపెన్‌ చేసి అందులో నమోదైన లావాదేవీలతో సరిపోల్చుకోవచ్చు. అంతేకాదు బ్యాంకులు ఖాతాదారునికి ఆన్‌లైన్‌లోనే నెలవారీ స్టేట్‌మెంట్లు కూడా పంపుతూ ఉంటాయి. ఆ స్టేట్‌మెంట్లకు సబ్‌స్క్రయిబ్‌ చేసుకుని తమ ఖాతాలో మోసపూరితమైన లావాదేవీలేవైనా చోటు చేసుకున్నాయా అన్నది పరిశీలించవచ్చు.

 

బ్యాంకింగ్‌ అలర్ట్‌లు పొందండి : బ్యాంకులన్నీ తమ ఖాతాదారుల మొబైల్‌ నంబర్‌కు లావాదేవీలకు సంబంధించిన అలర్ట్‌లు పంపుతున్నాయి. ఈ అలర్ట్‌లకు మనం సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఈ అలర్ట్‌లు ఉచితంగానే పంపుతున్నా మరికొన్ని బ్యాంకులు కొన్ని అలర్ట్‌ల వరకు ఉచితంగా అందించి ఆ పరిమితి దాటితే నామమాత్రమైన ఫీజు వసూలు చేస్తున్నాయి. ఖాతాలో సొమ్ము జమ అయినా తీసుకున్నా క్షణాల్లో మొబైల్‌కు అలర్ట్‌ అందుతుంది. తాము చేయని లావాదేవీ ఏదైనా నమోదైతే క్షణాల్లో దాన్ని గుర్తించి తగు నివారణ చర్యలు తీసుకోగలుగుతారు.

 

నంబర్లు, పిన్‌లు ఎక్కడా భద్రపరచవద్దు : డెబిట్‌ కార్డ్‌ నంబర్‌, దాని పిన్‌ నంబర్‌ వంటివి ఏదైనా కాగితం మీద రాసి పెట్టుకోవడం, మొబైల్‌లో భద్రపరుచుకోవడం వంటి పనులు చేయకూడదు. హ్యాకర్లకు పని సులువు చేసే మార్గం ఇది అన్న విషయం మరిచిపోవద్దు.

చెల్లింపులపై కన్నేయండి : ఏదైనా డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ లేదా ఇతరత్రా ప్రదేశాల్లో వస్తువులు కొన్నప్పుడు డెబిట్‌ కార్డు చెల్లింపులు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. పాస్‌వర్డ్‌లు లేదా పిన్‌ నంబర్ల చౌర్యానికి చాలా తేలికైన సందర్భాలివి. చెల్లింపు చేసే సమయంలో పిన్‌ నంబర్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. అలా పిన్‌ నంబర్‌ నమోదు చేసే సమయంలో ఎవరూ దాన్ని చూడకుండా జాగ్రత్త పడాలి.

బ్యాంక్‌ ఎటిఎంలకే వెళ్లాలి : ఎప్పుడైనా నగదు తీసుకోవాల్సివస్తే బ్యాంకు స్వంతంగా నిర్వహిస్తున్న ఎటిఎంకు మాత్రమే వెళ్లాలి. ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌ స్టోర్లు, మల్టీప్లెక్స్‌లు, రెస్టారెంట్లలో కూడా ఎటిఎంలు వచ్చేశాయి. అలాంటి ఎటిఎంలతో పోల్చితే బ్యాంకు ప్రత్యక్ష నిర్వహణలోని ఎటిఎంలు చాలా సురక్షితం. అంతే కాదు రాత్రి పొద్దు పోయిన తర్వాత రద్గీ ఏ మాత్రం లేని సమయంలో ఎటిఎం లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.

కాలం చెల్లిన కార్డులు ధ్వంసం చేయండి : డెబిట్‌ కార్డు వినియోగదారులందరూ తేదీ ముగిసిపోయిన కార్డులను ధ్వంసం చేయాలి. ఇలాంటి కార్డులు కూడా చౌర్యానికి కారణం అవుతూ ఉంటాయి. గడువు ముగిసిపోయిన కార్డులను ఐమూలగా ముక్కలుముక్కలుగా కట్‌ చేసి పారేయాలి. ఇప్పుడు బ్యాంకులు కస్టమర్లకు చిప్‌ అండ్‌ పిన్‌ కార్డులు అందిస్తున్నాయి. మీ బ్యాంకులో అలాంటి సదుపాయం ఉంటే పాత స్ర్టిప్‌ కార్డులకు బదులుగా చిప్‌ కార్డులుపొందడం మంచిది.

మొత్తం సొమ్ము ఒకే ఖాతాలో ఉంచొద్దు : మీరు ఖర్చు చేసుకునేందుకు అందుబాటులో ఉండే సొమ్ము అంతటినీ ఎప్పుడూ ఒకే ఖాతాలో భద్రపరచవద్దు. చౌర్యం జరిగి వివాదం పరిష్కారం అయ్యే వరకు సంబంధిత ఖాతాలో ఎలాంటి లావాదేవీలు చేయకుండా ఉంటే మంచిది. ఇతర ఖాతాల్లో కూడా సొమ్ము ఉంచుకోవడం వల్ల ఆ ఖాతాను లావాదేవీలు లేకుండా స్తబ్ధంగా ఉంచే వీలుకలుగుతుంది.

పిన్‌ తరచు మార్చండి : దీర్ఘకాలం పాటు ఒకే పిన్‌ వాడడం మంచిది కాదు. అవకాశం ఉంటే ప్రతీ నెలా ఒక సారి పిన్‌ మార్చడం వల్ల సైబర్‌ నేరగాళ్లదాడులకు గురి కాకుండా దూరంగా ఉండగలుగుతారు.

 

ఫిషింగ్‌ స్కామ్‌లతో అప్రమత్తం : ఇ-మెయిల్‌ ద్వారా ఫిషింగ్‌ చేస్తూ ఉంటారు. అధీకృత ఇ-మెయిల్‌కు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సందేశం పంపితే అది ఎంతవరకు నమ్మదగినదో చూసిన తర్వాత మాత్రమే స్పందించడం మంచిది. అలాగే కంప్యూటర్‌ లేదా లాప్‌టా్‌పలో వైరస్‌, మాల్‌వేర్‌, ఫిషింగ్‌ దాడులను గుర్తించి నిరోధించే యాంటి సాఫ్ట్‌వేర్‌ పెట్టుకోవడం శ్రేయస్కరం.

ఇలాంటి దాడులు జరిగితే ఏం చేయాలి? 

ఎంతో జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఆన్‌లైన్‌ మోసాలకు గురికావచ్చు. అలాంటి సమయంలో వెనువెంటనే బ్యాంకును సంప్రదించి సంబంధిత ఖాతాను లేదా ఆ కార్డును స్తంభింపచేయవచ్చు. బ్యాంకు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే వారు వెంటనే కార్డును చెల్లనిదిగా చేయడంతో పాటు మీరు కోరితే ఖాతాను కూడా పని చేయకుండా చేస్తారు. మీరు కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా మీ ఖాతా నుంచి సొమ్ము తీసుకుని ఉంటే దాన్ని బ్యాంకు గుర్తించకుండా ఉన్నట్టయితే ఆ సొమ్ము వాపసు పొందే హక్కు మీకుంటుంది.

ఆ లావాదేవీకి సంబంధించిన ఫీజులు కూడా రద్దు చేయించుకోవచ్చు. అయితే అందుకు పటిష్ఠమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఏమైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. 

-గోవింద రామమూర్తి, ఎండి-సిఇఒ, ఇ స్కాన్‌

Facebook like
Google Plus Circle
Youtube Subscribe