Breaking News

దేవుళ్ళు ఎందుకు...

Nov 20, 2014 00:00 by Admin Admin
దేవుళ్ళు ఎందుకు...

 దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియా స్కూల్లో చదివే ఒక అమ్మాయి ఇంటికి వచ్చి, ‘‘నాకు హిందువుగా ఉండడం ఇష్టం లేదు. హిందువునని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను’’ అని తల్లిదండ్రులకు చెప్పి ఏడ్చింది.

విషయమేమిటో తెలియని తల్లిదండ్రులు వివరాల్లోకి వెళితే, స్కూలు పాఠాల్లో హిందూమతం గురించి హేళన చేసే ధోరణిలో చెప్పబడినట్లు తెలిసింది. మనదేశంలో స్కూళ్లలో ఏ మతం గూర్చీ చెప్పరు. కానీ, పాశ్చాత్య దేశాల్లో స్కూలు పిల్లలకి అన్ని మతాల గూర్చీ ప్రాధమిక అవగాహన ఇస్తారు. సహజంగానే తమ మతాన్ని చాలా గొప్పగా చెప్పుకుని, మిగతావాటి గురించి కొంత తక్కువగా చెబుతారు.

హిందూమతానికి వచ్చేసరికి వీళ్లందరూ రాతివిగ్రహాల్ని, కోతుల్ని, ఆవుల్ని పూజిస్తారనీ, అవహేళన చేస్తూ చెప్పడం వల్ల అనేక హిందూ బాలికలు పై విధమైన మానసిక ఒత్తిడికి గురౌతున్నట్లు తెలుసుకున్నారు. దానిపై తలిదండ్రులందరూ కలిసి కోర్టుకు వెళ్లడం, సుదీర్ఘమైన విచారణ తర్వాత కాలిపోర్నియా ప్రభుత్వంవారు ఆ పుస్తకాల్ని సరిదిద్దడానికి అంగీకరించడం జరిగింది. అయినా మనకు నిజంగానే ఇంతమంది దేవుళ్లున్నారనీ, మనం మూర్ఖంగా కోతుల్నీ, ఆవుల్నీ పూజిస్తామని వాళ్లు నమ్మడం వల్లనే ఆ విధంగా పుస్తకాలు రాశారు. అది నిజంకాదని మనకు అంతో ఇంతో తెలుసు. కానీ విషయం పూర్తిగా తెలియదు. విషయాలు పూర్తిగా తెలియాలంటే మన పుస్తకాలపై అవగాహన ఉండాలి.

మన దేశంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ప్రస్తుతం గమనించవచ్చు. లక్సు సోపు ప్రచారంలాగ మతప్రచారాలు జరుగుతున్న సమయంలో మన పిల్లలు కూడా స్కూళ్లలో, కాలేజీల్లో ఇలాంటి ప్రశ్నలే ఎదుర్కొంటున్నారు. ఇంతమంది దేవతలు ఎలా ఉండగలరని పెద్దల్ని అడుగుతూంటారు. తలిదండ్రులు సమాధానం దాటవేస్తుంటారు. దీనికి సమాధానం నేరుగా భగవద్గీతలో చూడగలం. ఏడవ అధ్యాయంలో శ్రీకృష్ణుడిలా అంటాడు - ‘‘ ఏ ఏ భక్తుడు నన్ను ఏ ఏ స్వరూపంలో పూజిస్తాడో నేను ఆయా స్వరూపంలోనే అతన్ని అనుగ్రహిస్తాను. ఆయా రూపాన్నే ఆరాధిస్తూ అతడు తన కోరికల్ని పొందుతూంటాడు. వాస్తవంలో అన్ని రూపాల్లో ఉన్న నేనే ఆ కోరికల్ని తీరుస్తుంటాను’’ (7:21-22). అలాగే ‘‘ఏ ఇతర దేవుళ్లను శ్రద్ధతో ఎవరు పూజిస్తున్నా వారందరూ నన్ను సేవిస్తున్నట్లే’’ (9:23) అంటాడు. (భగవద్గీతలో ప్రతిచోటా శ్రీకృష్ణుడు ‘నేను’ అన్నప్పుడు శ్రీకృ ష్ణుడనే వ్యక్తికాదు, శుద్ధచైతన్య స్వరూపమైన తత్త్వం, బ్రహ్మ అనే స్థాయిలో చెబుతాడు) ప్రపంచంలోని ఏ మతగ్రంథాల్లోనూ ఇలాంటి ఉదారమైన మాటల్ని మనం చూడలేం.

శ్రీకృష్ణుడు ఎందుకిలా అన్నట్లు? భగవద్గీత అన్ని ఉపనిషత్తుల సారం అంటారు కదా. కృష్ణుడు వాటిలో ఉన్న విషయాన్నే చెప్పాడు. అన్నిటికన్నా పరమసత్యమైనది చైతన్యమేనని ఇదివరకు వ్యాసాల్లో చూశాం. ఆ చైతన్యంలో ఒకానొక శక్తియే సృష్టిరూపంలో కనిపిస్తుందని ఉపనిషత్తులు చెప్తాయి. ఆ శక్తికి ఉపనిషత్తులు పెట్టిన పేరు ఈశ్వరుడు. (ఈశ్వరుడు పార్వతి భర్త అయిన శివుడు కాడు. ఈశనం అంటే పాలించడం అని అర్థం. ప్రపంచాన్ని పాలించేవాడు అని అర్థం.) శక్తినే వైష్ణవులు విష్ణువని, శైవులు శివుడని, మరికొందరు దుర్గాదేవి అని భావిస్తూ పూజిస్తూంటారు. అలాగే అనేక పురాణదేవతలు కూడా. ఎలాంటి దేవుణ్ని భావన చేసినా చైతన్య స్వరూపం నుండి భావన చేయాల్సిందే.

శ్రీకృష్ణుని మాటల్ని గమనిస్తే మనకు కింది విషయాలు తెలుస్తాయి.

భారతీయ సంస్కృతిలో దేవుడు ఇలా ఉంటాడు అంటూ మతగ్రంధాలు నిర్దేశించలేదు. ఉపనిషత్తుల్లో ఉన్న తత్త్వశాస్త్రం దీన్ని పరిశీలించింది. ఏదో ఒక రూపాన్ని ఆసరాగా తీసుకుని పూజించవచ్చు అని చెప్పింది.

ఎలాంటి దేవతను పూజించాలనే విషయంలో మనిషికి స్వేచ్ఛ ఉంది. తన స్వభావానికి తగినట్లుగా పరమాత్మశక్తిని ఆరాధించవచ్చు. సాత్త్విక గుణం ఉన్నవాళ్లు దేవుణ్ణి కూడా అలాంటి గుణాలున్నట్లుగా భావిస్తూ లోకానికి హితమయ్యే పనులు చేస్తారు. చెడు స్వభావం ఉన్నవాళ్లు దేవుడికి కూడా అలాంటి గుణాల్నే భావించి ప్రపంచాన్ని శాసించాలని ప్రయత్నిస్తూంటారు.

మతం స్థాయిలో స్వర్గం, నరకం, దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనేవి సామాన్య జనాన్ని ఉద్దేశించి చెప్పినవి. స్థాయి నుంచి ఎదిగి తత్త్వాన్ని తెలుసుకోవడమే ముఖ్యలక్ష్యం.

దేవతారూపాలన్నీ ధ్యానానికి, మనస్సును ఏకాగ్రం చేయడానికి ఉపయోగిస్తాయి. ఇవి మనస్సును శుద్ధి చేసుకోవడానికి సాధనాలు.

అలాగే విగ్రహం అనేది కూడా మనస్సును ఏకాగ్రం చేయడానికి సాధనం.

వ్యక్తిగత కోరికల కోసం యజ్ఞాలు, పూజలు అనేవి ప్రాఽథమిక స్థాయి. దీని తర్వాతస్థాయిలో ధ్యానం, ఉపాసన చెప్పారు. అంటే క్రమక్రమంగా వ్యక్తిగత కోరికల నుండి పైకి ఎదిగి భగవంతుని స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం. మూడవస్థాయి భగవంతుని స్వరూపాన్ని శాసీ్త్రయంగా ఆలోచించి తెలుసుకునే ప్రక్రియ.

మనం ఏదో ఒక రూపంలో దేవుణ్ని భావించినా, రూపంలేని దేవుణ్ని భావించినా అవన్నీ పైన చెప్పిన ఈశ్వ రుడు అనే స్థాయిలోకే వస్తాయి. అంటే ప్రపంచాన్ని పాలించడం అనే ఒక టఠఞ్ఛట ఛిౌఞ లక్షణాలున్న స్థాయి. ఉపనిషత్తులు దీన్ని దాటి ఉన్న త త్త్వాన్ని తెలుసుకోమంటాయి.

మన సంప్రదాయంలో ఇలాంటి ఉదారభావం ఉండడానికి, దేవుడు ఏ రూపంలో ఉన్నా అభ్యంతరం లేకపోవడానికి ఉపనిషత్తుల బోఽధయే కారణం. ప్రపంచ చరిత్ర చూస్తే మిగతా దేశాల్లో ఒక కొత్తమతం వచ్చినప్పుడు దానికి సామ్రాజ్యశక్తి కూడా తోడుకావడం, రెండింటి కలయికతో అప్పటివరకూ ఉన్న మతవిశ్వాసాల్నీ, దేవుళ్లనూ, గుడులనూ ధ్వంసం చేయడం గమనించగలం. ‘‘మనకెందుకు ఇందరు దేవుళ్లు’’ అని మన పిల్లలు అడిగితే ‘‘మనం వారిని ధ్వంసం చేయలేదు కనుక’’ అని చరిత్ర వినిపించి సమాధానం చెప్పవచ్చు.

శ్రీకృష్ణుడు ఇంకొక మాట చెబుతాడు - ‘‘వివిధ ఆచారాల్ని పాటిస్తున్న మనుషుల్ని అనవసరంగా తప్పుబట్టాల్సిన పనిలేదు. జ్ఞాని అయినవాడు అన్నింటినీ సమదృష్టితో చూస్తూ అన్నింటినీ అనుమతించాలి’’ (3:26) ఏ ఆచారాన్నీ, విశ్వాసాన్నీ తప్పుపట్టవద్దు. ఆ విశ్వాసం అతన్ని జ్ఞానమనే మార్గంలోకి తెస్తుందని ఉద్దేశం. దురదృష్టవశాత్తూ శ్రీకృష్ణుడు ఎంతమందితో డ్యాన్సు చేశాడు అనే ప్రచారమే ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఆ విషయం బాగా తెలుస్తోంది కానీ శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు అనే విషయం తెలియడం లేదు. భగవద్గీత చదవనిదే మన పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేం.

గమనిక: గతవారం వ్యాసంలో ‘సగుణ’ అనే పదం ఉన్న ప్రతిచోటా ‘సుగుణ’ అని అచ్చు తప్పు దొర్లింది. దానికి చింతిస్తున్నాం.

‘‘ ఏ ఇతర దేవుళ్లను శ్రద్ధతో ఎవరు పూజిస్తున్నా వారందరూ నన్ను సేవిస్తున్నట్లే’’

 

డాక్టర్‌ కె. అరవిందరావు

రిటైర్డు డీజీపీ


Facebook like
Google Plus Circle
Youtube Subscribe