Breaking News

మారణకాండకు 'సిద్ధాంత' భూమిక..

Dec 04, 2014 00:00 by Admin Admin
మారణకాండకు 'సిద్ధాంత' భూమిక..

 మన ధేశంలోని ‘మావోయిస్టులు’ జరుపుతున్న హత్యాకాండ చైనా రాజకీయ నియంతృత్వ వ్యవస్థ నిర్వాహకులు అమలు జరుపుతున్న ప్రాబల్య విస్తరణ వ్యూహంలో భాగం! పాకిస్తాన్ తదితర ‘ఇస్లాం మత రాజ్యకూటమి’ దేశాల మద్దతు జిహాదీ బీభత్సకాండకు ప్రాణం! అలాగే చైనా ప్రభుత్వంవారి మద్దతు మావోయిస్టు మారణకాండకు ఊపిరి... జిహాదీ బీభత్సకారులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం నిలదీయడం ఆరంభమైంది! కానీ మావోయిస్టులను ఉసిగొల్పుతున్న చైనా ప్రభుత్వాన్ని మాత్రం మన ప్రభుత్వం నిలదీయడం లేదు. చైనా ప్రభుత్వంవారి అండదండలతోనే మావోయిస్టులు హత్యాకాండ జరుపుతున్నారన్న ఆరోపణలను సైతం మన ప్రభుత్వం చేయడం లేదు!! చైనా ఓడరేవులలో నౌకలనెక్కుతున్న ఆయుధాలు సముద్రాలు దాటి బర్మాలోను, బంగ్లాదేశ్‌లోను దిగుతున్నాయి. అక్కడినుండి మన ఈశాన్య రాష్ట్రాలలోకి దేశంలోని ఇతర ప్రాంతాలకు నేపాల్‌కు తరలిపోవడం దశాబ్దుల తరబడి జగమెరిగిన రహస్యం! మావోయిస్టులు నేపాల్‌ను క్రీస్తుశకం 1996నుండి తొమ్మిదేళ్లపాటు నేపాల్‌ను రక్తసిక్తం చేశారు! ఈ భయంకర బీభత్సకాండకు పదమూడు వేల మంది బలైపోవడం చరిత్ర!! 2006నుండి ఎనిమిది ఏళ్లకు పైగా నేపాల్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియ కూలబడి ఉండడానికి ప్రజాస్వామ్య రాజ్యాం గ రచన జరుగకపోవడానికి ఏకైక కారణం చైనా ప్రాబల్యం విస్తరణ వ్యూహం.....
నేపాల్ చిన్న దేశం కాబట్టి చైనా ప్రేరిత మావోయిస్టులు భయంకర బీభత్సకాండను సృష్టించగలిగారు! అతి పెద్దదైన మన దేశం లో అలా కేంద్రీకృత హింసాకాండను జరపడం సాధ్యంకావడం లేదు! అందువల్ల మావోయిస్టులు ప్రాబల్యవలయాలను సృష్టించుకోగలిగారు. ఈ వలయాలను నిర్మూలించలేకపోవడం మన ప్రభుత్వాల దశాబ్దుల వైఫల్యం! రాష్ట్రం చిన్నదయినకొద్దీ మావోయిస్టుల సమాంతర వ్యవస్థ మరింత పటిష్ఠమైపోతోంది! ఝార్‌ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలలోనే మావోయిస్టులు విపరీతంగా చెలరేగుతుండడానికి ఇదీ కారణం!! చిన్న రాష్ట్రాల ప్రభుత్వాలకు మావోయిస్టులను ఢీకొనగల మందిమార్బలం, సాధన సంపత్తి తగినంతగా ఉండడం లేదు! డిసెంబర్ ఒకటవ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరోసారి దానవ క్రీడ జరపడానికి ఇదంతా నేపథ్యం! పదునాలుగు మంది కేంద్ర రిజర్వ్ పోలీసులు హతులైపోవడానికి కారణం అసమానుల మధ్య జరుగుతున్న యుద్ధం. చత్తీస్‌గఢ్ మాత్రమేకాదు ఏ రాష్ట్రం కూడ మావోయిస్టులకు సమఉజ్జీకాదు! ఎందుకంటే కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ ఇండియా- మావోయిస్ట్- పేరుతో చెలామణి అవుతున్న సంస్థకు చెందిన ‘సాయుధ తీవ్రవాదులు’ చైనా ప్రభుత్వంవారి కిరాయి సైనికులు! అందువల్ల చైనా జరుపుతున్న ప్రచ్ఛన్నయుద్ధంలో ‘సుక్మా’ జిల్లాలో మావోయిస్టులు జరిపిన విద్రోహకాండ భాగం!! చైనాతో తలపడవలసింది కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రప్రభుత్వం కాదు! కానీ దశాబ్దుల తరబడి ఈ ‘అంతర్గత కల్లోలాన్ని’ అణచివేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది! రాజ్యాంగంలోని మూడువందల యాబయిఐదవ అధికరణం మేరకు రాష్ట్రాలను బాహ్య దురాక్రమణనుండి, ‘అంతర్గత కల్లోలం’నుండి రక్షించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది! మే నెల 26న కేంద్ర ప్రభుత్వం రాజకీయ నిర్వాహకులు మారారు! అందువల్ల విధానంలో మార్పురావచ్చునన్నది ప్రజల ఆకాంక్ష....
మావోయిస్టులు మాత్రం తమ విధానాన్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. తాము చేస్తున్నది దేశ వ్యతిరేక విద్రోహ సమరమని నిరూపిస్తున్నారు. భారత వైమానిక దళానికి- ఐఏఎఫ్- చెందిన ‘గగన శకటం’పై గత నెల 21న మావోయిస్టులు కాల్పులు జరపడం ఇందుకు నిదర్శనం! ఈ ‘ఐఏఎఫ్’ హెలికాప్టర్ మావోయిస్టులపై దాడి చేయడానికి వెళ్లలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన కాల్పులలో గాయపడిన పోలీసులను తరలించుకొని రావడానికై మాత్రమే ఆ హెలికాప్టర్ వెళ్లింది! ఆ ‘గగన శకటం’పై కాల్పులను జరపడం ద్వారా మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వంతో తలపడగల ‘సామర్థ్యం’, ‘పటిమ’ తమకున్నాయని మరోసారి నిరూపించుకున్నారు! 2008నుండి మొత్తం ఆరుసార్లు మావోయిస్టులు ‘వైమానిక దళం హెలికాప్టర్’లపై కాల్పులు జరిపారట!! కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ‘వైమానిక దళం’వారు మావోయిస్టులపై దాడులు జరుపరాదన్న విధానాన్ని అనుసరించింది!! దశాబ్దుల తరబడి చైనా ప్రచ్ఛన్నయుద్ధాన్ని ఎదుర్కోవలసిన బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టింది... ఇదంతా గతం! ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వ విధానం మారాలి...
మావోయిస్టుల మారణకాండకు ‘సైద్ధాంతిక భూమిక’ను సంతరించి పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నం చిత్రవిచిత్రాలను సృష్టిస్తోంది! ఈ ప్రయత్నం మానవీయమైన ‘గీటురాయి’పై నిగ్గుతేలడంలేదు, కనీసం ‘తార్కిక నికషం’ పరీక్షకు కూడ నిలబడడం లేదు!! మానవతా వాదానికీ, తర్కానికీ కూడ మావోయిస్టుల లక్ష్యం, కార్యక్రమం దూరమైపోయాయి! నిజానికి ‘మార్క్సిజం’అనే సిద్ధాంతం ‘మావోయిజం’గా పైశాచీకరణకు గురికావడం గతి తార్కిక భౌతికవాద చరిత్రలోని ప్రధాన విపరిణామం! మావోయిస్టుల స్ఫూర్తి కేంద్రమైన చైనా ‘మార్క్సి జం’ వౌలిక సిద్ధాంతానికి ఆధికారికంగా తిలోదకాలిచ్చింది! నిజానికి కార్ల్‌మార్క్స్ సిద్ధాంతానికి లెనిన్, స్టాలిన్ వంటివారు క్రీస్తుశకం 1920వ దశకం కంటె ముందే అనధికారికంగా సమాధికట్టారు! చైనా కమ్యూనిస్టు నాయకులు ‘రహస్యం’గా ఉంచవలసిన అవసరంలేదని బరితెగించి బయటపెట్టారు! తమ దేశంలో ‘స్వేచ్ఛావాణిజ్య వ్యవస్థ’ నెలకొని ఉన్నదని తమది ‘స్వేచ్ఛా వాణిజ్య’ దేశమని చైనా ప్రభుత్వ నిర్వాహకులు ప్రకటించి పదేళ్లు దాటిపోయింది!! ఈ స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ- మార్కెట్ ఎకానమీ- పెట్టుబడిదారీ విధానానికి- క్యాపిటలిజానికీ- మరో పేరు మాత్రమే! ‘‘పెట్టుబడిదారీ విధానాన్ని’’ నిర్మూలించాలన్న లక్ష్యంతోనే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు ‘వర్గ సమరం’ జరపడం రక్తపాతం సృష్టించడం దశాబ్దుల చరిత్ర! ‘‘అంతా అయిన తరువాత’’, కోట్లాది మందిని దశాబ్దులుగా హత్యచేసిన తరువాత చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంవారు మళ్లీ మరో రూపంలో పెట్టుబడిదారీ విధానాన్ని స్వీకరించి అమలుజరుపడంలో ప్రపంచంలోనే అగ్రగాములయ్యారు?? మరి చైనా ప్రేరణతో ప్రాణాలు తీస్తున్న మాయిస్టులది ఏ సిద్ధాం తం??
మావోయస్టులకు సైద్ధాంతికత ఉన్నట్టయితే 1989లో 1991వ సంవత్సరాల మధ్య ఐరోపాలోను, సోవియట్ యూనియన్‌లోను ‘కమ్యూనిస్టు’ నియంతృత్వాన్ని ప్రజలు నిరాకరించినప్పుడే తమ విధానాన్ని మార్చుకొని ఉండేవారు!! ‘క్యాపిటలిజమ్’ వ్యవస్థీకరించిన ‘దోపిడీ’ని నిర్మూలించడానికై ఏర్పడిన ‘కమ్యూనిజమ్’, ‘దోపిడీ’కి ప్రతిరూపంగా మారిపోవడం చారిత్రిక విపరిణామం!! అసమానతలకు ఆలవాలమైన, యజమానులు శ్రమజీవులను దోపిడీ చేయడానికి వీలుకల్పించే ‘క్యాపిటలిస్ట్’సమాజాన్ని నిర్మూలించి, వర్గరహితమైన సర్వజన సమానమైన ‘కమ్యూనిస్టు’వ్యవస్థను నెలకొల్పడం లక్ష్యం గా రష్యాలో లెనిన్ ప్రభృతులు ‘వర్గ సమరం’ జరిపారు! వర్గ విప్లవం సాధించారు. 1917నుంచి కొనసాగిన ఈ వ్యవస్థను 1991లో రష్యా ప్రజలు ఎందుకని తొలగించారు?? 1940వ దశకంలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోను, ఆ తరువాత తూర్పుఐరోపా దేశాల నెత్తిన ఈ ‘కమ్యూనిస్టు’ వ్యవస్థను రష్యా నియంతలు రుద్దారు! రష్యా తన ప్రాబల్య విస్తరణలో భాగంగా మరో పదునాలుగు దేశాలను బలవంతంగా ఏకీకృతంచేసి ‘యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్స్’- యుఎస్‌ఎస్‌ఆర్-ను స్థాపించింది!! ఈ ‘సోషలిస్టు’ వ్యవస్థకోసం జర్మనీ రెండుముక్కలు కావడం చరిత్ర! ఇలా ‘సర్వజన సమానత్వం’ సాధించడంకోసం లెనిన్ స్టాలిన్‌లు రష్యాలో అమలుజరిగిన రాజకీయ వ్యవస్థ ‘ఏకపక్ష నియంతృత్వం’!
సర్వజన సమానత్వ సాధనకోసం రాజకీయ నియంతృత్వం కూడ అనివార్యమన్నది కమ్యూనిస్టులు చేసిన ప్రచారం!! ఇలాంటి ‘ఏకపక్ష నియంతృత్వాన్ని’ వ్యవస్థీకరించడమే మావోయిస్టుల బీభత్సకాండకు లక్ష్యం!! కానీ ఈ ‘ఏకపక్ష నియంతృత్వం’ కారణంగా తూర్పు ఐరోపాలోను, సోవియట్ యూనియన్‌లోను ‘పాలకుల’ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపే ‘ప్రతిపక్షం’లేకుండా పోయింది! ఫలితంగా అన్ని కమ్యూనిస్టు దేశాలలోను ‘పాలకులు’ దోపిడీవర్గంగా అవతరించారు!! ‘క్యాపిటలిజమ్’లో కొందరు భూస్వాములు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ధనవంతులు పేద ప్రజలను దోపిడీచేశారు! ‘కమ్యూనిజమ్’లో ‘‘పాలకులు’’ పాలితులను దోపిడీచేశారు! ‘క్యాపిటలిజమ్’ వ్యవస్థలోను, ‘కమ్యూనిజమ్’లోను ‘కొందరు’ అత్యధికులను దోపిడీచేయడం సమాన సూత్రం!! అందువల్లనే ‘క్యాపిటలిజమ్’, ‘క మ్యూనిజమ్’అన్నవి ఒకే నాణెంయొక్క ముఖా లు- అని భారతీయ ఆర్థిక సామాజిక శాస్తజ్ఞ్రులు ‘అప్పటి’నుంచి ఇప్పటివరకు చెబుతూనే ఉన్నారు!! బల్గేరియా, జెకోస్లావేకియా, తూర్పు జర్మనీ, హంగరీ, పోలెండు, రుమేనియా, యుగోస్లోవియా, సోవియట్ యూనియన్ దేశాల ప్రజలు 1989వ 1991వ సంవత్సరాల మధ్య ఈ ‘కమ్యూనిస్టు’ దోపిడీ వ్యవస్థలను రద్దుచేయడం అంతర్జాతీయ విప్లవం....
‘క్యాపిటలిస్టు’ సమాజంలో అనేకమంది పెట్టుబడిదారులు...‘కమ్యూనిజం’లో ప్రభు త్వం ఒక్కటే పెట్టుబడిదారుడు! చైనా ఈ ప్రభుత్వపు పెట్టుబడిదారీ విధానానికి అంచెలంచెలుగా స్వస్తిచెప్పింది!! అందువల్ల చైనాలో మిగిలింది కేవలం రాజకీయ నియంతృత్వం! ‘క మ్యూనిస్టు’ నియంతృత్వ దేశమైన చైనా ‘క్యాపిటలిస్టు’ నియంతృత్వ దేశంగా పరివర్తన చెందడం ‘ప్రపంచీకరణ’ -గ్లోబలైజేషన్- వల్ల సంభవించిన విపరిణామం!!
‘కమ్యూనిజాని’కీ, ‘క్యాపిటలిజాని’కీ లేదా ‘మార్కెట్ ఎకానమీ’కి కూడ భిన్నమైన వికేంద్రీకృత ఆర్థిక సామాజిక వ్యవస్థ అనాదిగా భారతదేశంలో పరిఢవిల్లింది! విదేశీయులు చెడగొట్టిపోయిన ఈ ‘సనాతన భారతీయ’ వ్యవస్థను పునరుద్ధరించడం దోపిడీకి అవకాశంలేని సమాజ వికాసానికి దోహదం చేస్తుంది! విశ్వహితం కోరేవారు ఈ దిశగా ఆలోచించగలరా....??

Facebook like
Google Plus Circle
Youtube Subscribe