Breaking News

అమెరికాకు వ్యూహాత్మకంగా కీలకం

Aug 11, 2017 22:01 by Admin Admin

 ఇలా కీలకం...

పసిఫిక్‌ మహా సముద్రంలో... జపాన్‌, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్‌, ఆస్ట్రేలియా మధ్యలో ఉన్న గ్వామ్‌ ద్వీపం వ్యూహాత్మకంగా కీలకమైనది. అందుకే... అమెరికా ఇక్కడ భారీ సైనిక స్థావరాలు నిర్వహిస్తోంది. ఇక్కడ 6 వేల మందికిపైగా సైనికులతో... వైమానిక, నౌకాదళ స్థావరాలు ఏర్పాటు చేసింది. అంతేకాదు... అణ్వస్త్రాలనూ, వాటిని ప్రయోగించగల వ్యవస్థలను సిద్ధంగా ఉంచింది. గ్వామ్‌ భూభాగంలో 30 శాతం అమెరికా ఆధీనంలోనే ఉందం టే... దీనికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అమెరికా విమానాలు ఇక్కడి ఆండర్సన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచే ఈ ప్రాంతంలో తిరుగాడుతుంటాయి. వెరసి... తన ప్రధాన భూభాగం నుంచి 11,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వామ్‌ నుంచి అమెరికా అనేక దేశాలను తన ‘ఆయుధ’ పరిధిలోకి తెచ్చుకోగలుగుతోంది. అందుకే రక్షణపరంగా గ్వామ్‌ అత్యంత కీలకమైనది.
 
దాడి సాధ్యమేనా?
గ్వామ్‌పై గురిపెట్టగల క్షిపణులు ఉత్తర కొరియా వద్ద ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే... గతనెలలో తొలిసారిగా ఖండాతర క్షిపణిని హోస్వాంగ్‌-14ను విజయవంతంగా ప్రయోగించినట్లు కిమ్‌ ప్రకటించారు. దీంతో అమెరికాలోని అలస్కా, శాండియాగోనూ దెబ్బ తీయగలమని తెలిపారు. ‘ముందస్తుగా’గా గ్వామ్‌పై దాడికి దిగుతామని హెచ్చరించారు.
 
ఇదీ గ్వామ్‌..
పసిఫిక్‌ సముద్రంలోని సుందర ద్వీపం గ్వామ్‌. ఉత్తర కొరియా నుంచి సుమారు 3వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని విస్తీర్ణం 210 చదరపు కిలోమీటర్లు. అంటే... గ్రేటర్‌ హైదరాబాద్‌లో దాదాపు మూడో వంతు! అమెరికాలో భాగమైనప్పటికీ ఆ దేశ ప్రధాన భూభాగానికి అత్యంత దూరంలో ఉన్న ద్వీపం ఇదే. గ్వామ్‌ జనాభా సుమారు 1.60 లక్షలు. వీరు పేరుకే అమెరికా పౌరులు. కానీ... అధ్యక్ష ఎన్నికల్లో వీరికి ఓటు వేసే హక్కు ఉండదు. ఈ ద్వీపం సుమారు 400 ఏళ్లపాటు స్పెయిన్‌, జపాన్‌ ఆధీనంలో ఉండేది. 1944లో జపాన్‌ను యుద్ధంలో ఓడించి... గ్వామ్‌ను అమెరికా సొంతం చేసుకుంది.
 
నేను కనుసైగ చేస్తే చాలు.. ఉత్తరకొరియాపై దాడికి సైన్యం సిద్ధం: ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన తాజా ట్వీట్‌‌తో ఉత్తరకొరియాతో ఉద్రిక్తత స్థాయిని మరింత పెంచారు. కనుసైగ చేస్తే చాలు.. కొరియాపై అమెరికా సైన్యం దాడి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ‘కొరియాపై సైనికదాడికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఒకవేళ కొరియా తెలివితక్కువగా వ్యవహరిస్తే.. సైనిక చర్యలు తప్పవు’ అన్నారు. అయితే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ సరైన దారిలో నడుస్తారని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ట్రంప్‌, కిమ్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరువురు నేతలు సంయమనం పాటించాలని చైనా విజ్ఞప్తి చేసింది. గ్వామ్‌ దీవిపై క్షిపణి దాడికి సిద్ధంగా ఉన్నామని ఉత్తరకొరియా ప్రకటించిన నేపథ్యంలో... ఒకవేళ అదే జరిగితే తీవ్రపరిణామాలు తప్పవని ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా, దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి అమెరికా యుద్ధ నౌక ‘యూఎ్‌సఎస్‌ జాన్‌ ఎస్‌ మెకైన్‌’ ప్రవేశించడంపై చైనా తీవ్ర అభ్యతంరం వ్యక్తం చేసింది.
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe