Breaking News

బీజేపీ ఎంపీలకు మోదీ హెచ్చరిక

Aug 11, 2017 22:10 by Admin Admin

 ‘మీరు పార్లమెంటుకు ఎందుకు ఎన్నికయ్యారు? సభకు హాజరు కావడానికా లేక సంతకం చేసి ఇళ్లకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడానికా? మీలాగే పార్టీలో సేవ చేసిన వారు చాలామంది ఉన్నారు. వారందర్నీ కాదని మీకు సీట్లు ఇచ్చి గెలిపిస్తే పార్లమెంటుకు సరిగ్గా హాజరు కాకపోవడం శోచనీయం. మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే 2019లో మా ఇష్టం వచ్చినట్లు మేం సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు హెచ్చరిక జారీ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగింపు సందర్భంగా గురువారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని కన్నెర్ర చేశారు. ఎంపీల తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

 
ఓబీసీ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు తగినంత మంది బీజేపీ ఎంపీలు హాజరు కాకపోవడంతో ఆ బిల్లులో కాంగ్రెస్‌ కొన్ని సవరణలను ప్రవేశపెట్టి నెగ్గింది. ఓబీసీల చాంపియన్‌గా చెప్పుకునే బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళం పాడడాన్ని ప్రధాని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రాజ్యసభలో అడుగుపెడుతున్నారని, ఇకపై ఎంపీల ఆటలు సాగవన్న అర్థం వచ్చేలా మాట్లాడిన ప్రధాని రాబోయే ఎన్నికల్లో ఎంపీల పని తీరు ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని తేల్చి చెప్పారు. గతంలో ఇవే విషయాలను అమిత్‌ షా ఎంపీలకు చెప్పినా పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రధాని ఎంపీలతో కటువుగా మాట్లాడాల్సి వచ్చిందని బీజేపీ నేతలు అంటున్నారు.
 
ఓబీసీ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు సీనియర్‌ మంత్రులతో పాటు 31 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. ప్రధాని తాజా హెచ్చరికతో బీజేపీ ఎంపీలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పనులు బాగానే చేస్తున్నామని, పార్లమెంటులో విప్‌లు తమకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వకపోవడంతో చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయని అంటున్నారు. మరి మోదీ హెచ్చరికలు ఎంపీలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో తెలియాలంటే వచ్చే పార్లమెంటు సమావేశాల వరకూ వేచిచూడాల్సిందే.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe