Breaking News

నెల పాటు సామాన్యుడిగా జీవించి

Aug 11, 2017 22:12 by Admin Admin

 సినిమాలో ‘శ్రీమంతుడు’ పల్లెకు వెళ్లి.. ఊరిని దత్తత తీసుకుని, తనెవరో చెప్పకుండా ఊరికి మేలు చేస్తాడు. ఊరికి ఉపకారం కాదుగానీ.. ఉద్యోగుల సాధకబాధకాలు తెలుసుకునేందుకు తండ్రి ఆజ్ఞతో హైదరాబాద్‌లో అజ్ఞాతవాసం చేశాడో అభినవ శ్రీమంతుడు. అతడి పేరు హితార్థ్‌. తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా.. 400 ఫ్లాట్లు, 1260 కార్లు ఇచ్చిన సూరత్‌ వజ్రాల వ్యాపారి.. హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థ అధిపతి సావ్‌జీ ధోలాకియా గుర్తున్నారా? ఆయన సోదరుడు.. సంస్థ అధినేతల్లో ఒకరైన ఘనశ్యామ్‌ కుమారుడే ఈ హితార్థ్‌.

 
వ్యాపరపరంగా గత 15 ఏళ్లుగా ఆ కుటుంబంలో పుట్టే అబ్బాయిలు ఓ విశిష్ట సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అదేంటంటే.. వ్యాపార బాధ్యతలు స్వీకరించడానికి ముందు కొంతకాలంపాటు ఒక సామాన్యుడిలా జీవితం గడపాలి. తాము ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచి.. కేవలం తాము చదివిన చదువు ఆధారంగా ఉద్యోగం సంపాదించి నెల రోజులపాటు పనిచేయాలి. అప్పుడే చిన్న ఉద్యోగుల ఇబ్బందులు, సమస్యలు ఎలా ఉంటాయో తెలుస్తుందని ఈ ఏర్పాటు. అందులో భాగంగానే హితార్థ్‌ హైదరాబాద్‌లో నెలరోజులపాటు ఉన్నారు. వారానికి ఒకటి చొప్పున నాలుగు ఉద్యోగాలు చేసిన హితార్థ్‌ శుక్రవారం ఇక్కడ ఒక హోటల్‌లో తన కుటుంబసభ్యులైన సావ్‌జీ ధోలాకియా, పెద్దమ్మ గౌరీ బెన్‌, సోదరుడు పింటూ తులసీ భట్‌ ధొలాకియా, సోదరి కృపాలి, ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ త్రివేదితో కలిసి మీడియాతో మాట్లాడారు.
 
ఇండియా మ్యాప్‌లో హైదరాబాద్‌ నగరం ఎక్కడుంటుందో కూడా తనకు తెలియదని.. అలాంటిది ఇక్కడ ఎన్నో మధురానుభూతులను సొంతం చేసుకున్నానని చెప్పారు. తన ఐడెంటిటీ తెలుపకుండా నాలుగు చోట్ల ఉద్యోగం చేశానని.. హైదరాబాదీల ఆదరణ ఎన్నటికీ మరువలేనని పేర్కొన్నారు. ఈ నగరం తనకు ఎంతో ఇచ్చిందని.. తానూ హైదరాబాద్‌కు ఎంతోకొంత ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక సావ్‌జీ భాయ్‌ మాట్లాడుతూ.. తన కుమారుడు గత ఏడాది కొచ్చిలో ఇలాగే గడిపాడని గుర్తుచేశారు. ‘‘మనం ఎన్ని కోట్లు సంపాదించామన్నది కాదు.. మన ఉన్నతికి కారణమైన వారికి ఎంత మేలు చేయగలిగామన్నది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసమే ఈ ఏర్పాట్లు. మనకెన్ని ప్రణాళికలైనా ఉండొచ్చు.
 
కానీ ఉద్యోగి తోడ్పాటు లేకపోతే కష్టం. ఉద్యోగి కష్టాలు ఉద్యోగిగా ఉంటేనే ఎక్కువ తెలుస్తాయనే ఇలా చేస్తున్నాం. హితార్థ్‌ అలా ఏడవ వాడిగా నెల రోజుల అజ్ఞాతం గడిపాడు. మా ఫ్యామిలీలో 8 మంది అబ్బాయిలు రెండవ తరంలో ఉంటే ఆరుగురు అమ్మాయిలున్నారు. భద్రత కారణంగా అమ్మాయిలను మాత్రం ఇలా పంపించట్లేదు. అయినప్పటికీ వారికీ ఈ విషయాలు తెలుపుతూనే ఉంటాం’’ అని ఆయన వివరించారు. ధోలాకియా కుటుంబంలో తొలిసారిగా నెల రోజుల అజ్ఞాతవాసం చేసిన పింటూ తులసీ భట్‌ మాట్లాడుతూ.. ‘‘యూఎ్‌సలో ఎంబీఏ ఫైనాన్స్‌ చేసిన నేను 2002లో ముంబైలో అలా గడిపాను. ప్రస్తుతం కంపెనీ మాన్యుఫాక్చరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ డివిజన్‌ హెడ్‌గా చేస్తున్నా. ఓ విషయాన్ని తెలుసుకోవడానికి ఈ ఫీల్డ్‌ వర్క్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రోజుల్లో నేను గడిపిన జీవితమే ఇప్పటికీ నేను నేలమీద నడిచేలా చేస్తోంది’’ అని వివరించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe