Breaking News

అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లపై తుది కసరత్తు

Oct 11, 2017 23:11 by Admin Admin

 రాజధానిలో నిర్మించనున్న అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు డిజైన్లపై తుది కసరత్తు ఊపందుకుంది. నవంబరు మొదటి వారంలో డిజైన్లను ఖరారు చేసి, వెనువెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వెలగపూడిలో బుధవారం సీఆర్డీయే అథారిటీ కమిటీ 12వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులందరినీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న తన ఆకాంక్ష కార్యరూపం దాల్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వచ్చే సమావేశానికల్లా సిద్ధం చేయాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు.

 
సింగపూర్‌ యాత్రకు అర్హత సాధించిన 123 మంది రాజధాని రైతుల్లో 100 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసినట్లు సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ సీఎంకు తెలిపారు. మిగిలిన 23 మంది నిరుత్సాహపడకుండా వారినీ సింగపూర్‌ తీసుకువెళ్లేందుకు మరో రూ.12 లక్షలను కేటాయించాలన్న ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. ‘సాధికారత దిశగా రాజధాని రైతు యాత్ర’గా సింగపూర్‌ పర్యటనను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. రాజధాని గ్రామాల్లోని 32 వేల కుటుంబాలు వ్యవసాయం నుంచి వాణిజ్య, పారిశ్రామికరంగాల వైపు మళ్లే ప్రక్రియ వీలైనంత వేగంగా, సరళంగా జరిగిపోవాలన్నారు. రైతులకు నైపుణ్య శిక్షణ, వ్యాపారావకాశాలు, పరిశ్రమల స్థాపనపై ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థ మెకెన్సీ ద్వారా విస్తృతావగాహన కల్పించాలన్నారు.
 
ప్రజాభిప్రాయం మేరకే ‘క్వార్టర్ల’ డిజైన్లు
అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్‌ ఆఫీసర్లు, ఎన్జీవోల కోసం నిర్మించనున్న గృహ సముదాయాల నిర్మాణ బాధ్యతలను ఆయా టెండర్లను తక్కువకు కోట్‌ చేసిన ఎన్‌సీసీ, ఎల్‌ అండ్‌ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలకు అప్పగించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ గృహ సముదాయాలకు సంబంధించిన అంతర్గత డిజైన్ల ఎంపిక పూర్తవగా, టీం వన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూపొందించిన 10 బాహ్య డిజైన్ల (ఎలివేషన్‌)ను పరిశీలించిన చంద్రబాబు వాటన్నింటినీ పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచి, అత్యధికులకు నచ్చిన డిజైన్లను ఖరారు చేయాలని ఆదేశించారు.
 
6 నెలల్లో క్వార్టర్ల నిర్మాణాలు నిర్మాణ సంస్థలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్‌ ఆఫీసర్లు, ఎన్జీవోల కోసం మొత్తం 84,57,078 చదరపు అడుగుల్లో 3,820 ఫ్లాట్లను నిర్మించనున్నారు. వీటిల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్‌ అధికారుల కోసం ఒక్కొక్కటి 3,500 చ.అ. విస్తీర్ణం ఉండే 432 లగ్జరీ ఫ్లాట్లను 18 టవర్లలో నిర్మిస్తారు. క్లబ్‌ హౌస్‌ వంటి అధునాతన సదుపాయాలు వీటిల్లో ఉంటాయి. టైప్‌-1 గెజిటెడ్‌ అధికారుల కోసం ఒక్కొక్కటి 1800 చ.అ. ఉండే ఫ్లాట్లను 8 టవర్లలో, టైప్‌-2 గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కోసం ఒక్కొక్కటి 1500 చ.అ. ఉండే ఫ్లాట్లను 7 టవర్లలో, ఎన్జీవోల కోసం ఒక్కొక్కటి 1200 చ.అ. ఉండే ఫ్ట్లాట్లను 22 టవర్లలో, 4వ తరగతి ఉద్యోగుల కోసం 900 చ.అ. చొప్పున ఉండే ఫ్లాట్లను 6 టవర్లలో నిర్మించనున్నారు.
 
అమరావతిలో పాఠశాలల స్థాపనకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులున్న 8 సంస్థలకు మొత్తం 32 ఎకరాలను కేటాయించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. గ్లెండేల్‌ అకాడమీకి 8 ఎకరాలు (డే కం బోర్డింగ్‌ స్కూల్‌), స్కాటిష్‌ హై ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు 4 ఎకరాలు, చిన్మయ మిషన్‌కు 3 ఎకరాలు, ది హెరిటేజ్‌ స్కూల్‌కు 2, సద్భావన వరల్డ్‌ స్కూల్‌కు 4, ర్యాన్‌ గ్లోబల్‌ స్కూల్‌కు 4, పోదార్‌ స్కూల్‌కు 3, జీఐఐఎ్‌సకు 4 ఎకరాలను కేటాయించారు. జాతీయస్థాయి క్రీడల నిర్వహణకు అనువుగా క్యాపిటల్‌ రీజియన్‌లో గోల్ఫ్‌ కోర్సు కోసం 70 ఎకరాలు, అమరావతిలో రాష్ట్ర స్థాయి కమాండ్‌ సెంటర్‌ కోసం 2 ఎకరాలను కేటాయించేందుకూ సీఎం ఆమోదం తెలిపారు.
 
తాను లండన్‌ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత సీఆర్డీయే, ఏడీసీల్లోని వివిధ విభాగాలు నియమించుకున్న కన్సల్టెంట్ల పనితీరును సమీక్షిస్తానని చంద్రబాబు వెల్లడించారు. సీఆర్డీయే అథారిటీ కమిటీ సమావేశానంతరం పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడు నారాయణ విలేకరులతో మాట్లాడారు. బుధవారం సాయంత్రం తన సారధ్యంలో అధికారుల బృందం లండన్‌కు బయల్దేరుతోందని తెలిపారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు ఎస్‌.ఎ్‌స.రాజమౌళి కూడా ఈ బృందంతోపాటు ఉంటారన్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో తాము నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌తో రాజధానిలోని అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం డిజైన్లపై చర్చిస్తామని చెప్పారు. తమ బృందం సూచనల మేరకు రూపొందించే డిజైన్లను ఈ నెల 24, 25 తేదీల్లో సీఎం లండన్‌కు వెళ్లి పరిశీలిస్తారని, తుది డిజైన్లను వచ్చే నెల మొదటి వారంలో ఖరారు చేస్తామని వెల్లడించారు. ఆ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe