Breaking News

ఎదురులేని ఆటతీరు

Feb 12, 2018 20:37 by Admin Admin

టీమిండియా మరోసారి చరిత్రపై కన్నేసింది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వన్డే సిరీస్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో నేడు (మంగళవారం) ఐదో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. నాలుగో వన్డేలో ఓటమి ఎదురైనా కోహ్లీ సేన 3-1తో ఇప్పటికీ మెరుగైన స్థితిలోనే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ గెలిస్తే చరిత్రను తిరగరాసినట్టే.. ఒక వేళ ఓడినా మరో మ్యాచ్‌ అందుబాటులో ఉండడం వారికి కలిసొచ్చే అంశం. పింక్‌ వన్డేలో వర్షం కారణంగా మ్యాచ్‌కు రెండు పర్యాయాలు అంతరాయం కలగడంతో పాటు బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో వైఫల్యాలు భారత్‌ కొంపముంచాయి. తాజా మ్యాచ్‌లో భారత్‌ తమ బ్యాటింగ్‌ లోపాలను సరిదిద్దుకుని భారీ స్కోరు సాధించాల్సిన అవసరం ఉంది. అటు సూపర్‌ విజయంతో ఒక్కసారిగా రేసులోకి వచ్చిన సఫారీ జట్టులో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. టీ20 మ్యాచ్‌ తరహాలో బ్యాట్స్‌మెన్‌ అంతా జూలు విదిల్చి సిరీ్‌సను రసవత్తరంగా మార్చారు. అయితే మరోసారి భారత స్పిన్నర్లు, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ మధ్యనే అసలు పోటీ ఉండనుంది. ఇక్కడ ఆడిన 32 మ్యాచ్‌ల్లో 11 మాత్రమే ఓడిన ప్రొటీస్‌ పైచేయిలో ఉంది.

 
మిడిలార్డర్‌ మెరుగయ్యేనా..!
భారత బ్యాటింగ్‌ భారమంతా శిఖర్‌ ధవన్‌, విరాట్‌ కోహ్లీలపైనే పడుతుండడం ప్రధాన సమస్యగా మారింది. ఇప్పటిదాకా మిగతా బ్యాట్స్‌మెన్‌ చేసిన పరుగుల (239) కన్నా కోహ్లీ (393), ధవన్‌ (271) వ్యక్తిగతంగా చేసిన పరుగులే ఎక్కువ. ఇక మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దారుణంగా విఫలమవడం జట్టు భారీ స్కోరుపై ప్రభావం పడుతోంది. నాలుగు వన్డేల్లో కలిపి అతడు 40 పరుగులే చేయడంతో విమర్శలు ఎక్కువయ్యాయి. ప్రధానంగా మిడిలార్డర్‌ తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగో వన్డేలో 35 ఓవర్లు ముగిసేసరికి 206/3తో ఉన్న స్కోరుకు చివరి 15 ఓవర్లలో 83 పరుగులు మాత్రమే జోడించగలిగారు. రహానె చివరి రెండు వన్డేల్లో 11, 8 పరుగులతో నిరాశపరిచాడు. ఇక తొలి టెస్టులో విజృంభించిన అనంతరం పాండ్యా (మొత్తం 26 పరుగులు) ఇప్పటిదాకా ఆకట్టుకున్నది లేదు. ధోనీ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు. వీరంతా నేటి మ్యాచ్‌లో తమ బ్యాట్లకు పనిచెప్పాల్సి ఉంది. కేదార్‌ జాదవ్‌ గాయం గురించి స్పష్టత లేకపోవడంతో అయ్యర్‌కు మరో అవకాశం దక్కవచ్చు. గత మ్యాచ్‌లో విఫలమైనా స్పిన్నర్లు చాహల్‌, కుల్దీప్‌ ఈసారీ కీలకం కానున్నారు. వీరికి తోడు పేసర్లు భువనేశ్వర్‌, బుమ్రా వికెట్ల వేట సాగిస్తే తిరుగుండదు. నోబాల్స్‌, ఫీల్డింగ్‌ లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది.
 
సిరీస్‌ సమంపైనే దృష్టి
దక్షిణాఫ్రికా పరిస్థితి మరోలా ఉంది. కీలక సమరంలో బెదురులేకుండా విరుచుకుపడి తమకు కావాల్సిన విజయాన్ని అందుకుంది. డివిల్లీర్స్‌ రాకతో మిడిలార్డర్‌ అత్యంత పటిష్ఠంగా మారింది. శనివారం మ్యాచ్‌లో మిల్లర్‌, క్లాసెన్‌ అద్భుత భాగస్వామ్యంతో భారత్‌ను వణికించగా చివర్లో ఫెహ్లుక్వాయో మెరుపులతో వాండరర్స్‌ దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఈసారీ ఈ త్రయం ఇలాగే ఆడితే భారత బౌలర్లకు కష్టకాలమే. ఈ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించనుండడంతో ఇమ్రాన్‌ తాహిర్‌ తిరిగి జట్టులోకి రావడం ఖాయం. గతేడాది జనవరిలో అతను శ్రీలంకపై ఈ పిచ్‌మీద 3 వికెట్లు తీశాడు.
 
సెయింట్‌ జార్జెస్‌ మైదానంలో భారత్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. ఆఖరికి కెన్యాతో జరిగిన మ్యాచ్‌లోనూ నెగ్గలేకపోయింది. ఇక్కడ భారత్‌ అత్యధిక స్కోరు 176 మాత్రమే.
 
62 దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు (పీటర్సన్‌, 454) సాధించేందుకు కోహ్లీకి కావాల్సిన పరుగులు.
 
పిచ్‌, వాతావరణం
స్పిన్నర్లకు ఈ పిచ్‌ స్వర్గధామంగా నిలుస్తుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 232 ఉండగా, రెండో ఇన్నింగ్స్‌ 198 మాత్రమే. చాహల్‌, కుల్దీప్‌ కీలకం కానున్నారు. వాతావరణం వేడిగా ఉన్నా చిరుజల్లులకు ఆస్కారం ఉంది.
 
జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌, ధవన్‌, కోహ్లీ (కెప్టెన్‌), రహానె, అయ్యర్‌/జాదవ్‌, ధోనీ, పాండ్యా, భువనేశ్వర్‌, కుల్దీప్‌, బుమ్రా, చాహల్‌.
దక్షిణాఫ్రికా: ఆమ్లా, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), డుమిని, డివిల్లీర్స్‌, మిల్లర్‌, క్లాసెన్‌, బెహర్డీన్‌/మోరిస్‌, ఫెహ్లుక్వాయో, రబాడ, మోర్కెల్‌, తాహిర్‌/షంసీ.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe