Breaking News

చర స్థిరాస్తులు కలిపి రూ 177 కోట్లు

Feb 12, 2018 20:40 by Admin Admin

 దేశంలో ఉన్న 31 మంది సీఎంలలో అత్యంత సంపన్నుడెవరో తెలుసా?... ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబునాయుడు! చర, స్థిరాస్తులు రెండూ కలిపితే ఆయన వ్యక్తిగత సంపద రూ 177 కోట్లు. ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌) అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదికలోని వివరాల ప్రకారం... చంద్రబాబుకు రూ.134,80,11,728 విలువైన చరాస్తులు, రూ. 42,68,83,883 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఈ రెండూ కలిపితే చంద్రబాబు ఆస్తుల విలువ రూ.177,78,95,611 ఉన్నట్లు ఏడీఆర్‌ సంస్థ వెల్లడించింది. చంద్రబాబు తర్వాత రెండో ధనిక సీఎం... అరుణాచల్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ. ఈయన ఆస్తుల విలువ రూ.129కోట్లకుపైగా ఉంది. మూడో స్థానం పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ది.

ఈయన ఆస్తుల విలువ రూ.48 కోట్లకుపైగా ఉంది. ఇక 15 కోట్ల విలువైన ఆస్తులతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ నాలుగో ధనిక సీఎంగా ఉన్నారు. కేసీఆర్‌ దగ్గర రూ. 6,50,82,464 విలువైన చరాస్తులు, రూ. 8.65 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. సీపీఎంకు చెందిన త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ ఆస్తుల విలువ రూ. 26 లక్షల 83 వేల 195 మాత్రమే. పేద సీఎంల జాబితాలో రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (రూ.30 లక్షలు), మూడో స్థానంలో జమ్మూ కాశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ  (రూ 55 లక్షలు) ఉన్నారు.
 
మమతా బెనర్జీ దగ్గర ఒక్క రూపాయి కూడా విలువ చేసే స్థిరాస్తి లేకపోవడం విశేషం. ఏడీఆర్‌ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం 11 మంది సీఎంలపై రకరకాల కేసుల నమోదయ్యాయి. అందులో కొన్ని కోర్టు పరిధిలో ఉండగా... మరికొన్ని నేరాలపై చార్జీషీట్లు దాఖలయ్యాయి. వీరిలోనూ తెలుగురాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌ ఉన్నారు. చంద్రబాబుపై 3కేసులు, కేసీఆర్‌పై 2 కేసులు నమోద య్యాయి. కేసీఆర్‌పై నమోదైన కేసుల్లో ఒకటి క్రిమినల్‌ కేసు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe