Breaking News

అడుగంటుతున్న జలాశయాలు

Feb 12, 2018 20:49 by Admin Admin

తెలుగు రాష్ట్రాల్లో జల సంక్షోభం తప్పేలా లేదు! వచ్చే వర్షాకాలంలో సరైన సమయానికి వానలు కురవకపోతే తాగునీటికి సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రానుంది! గత వానాకాలం సీజన్‌ మొదట్లో సరైన వర్షాలు కురవలేదు. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ వంటి ప్రధాన జలాశయాల పరిధిలోని ఆయకట్టులో ఖరీఫ్‌ పంటలకు సాగునీటిని అందించలేదు. కొంత ఆలస్యంగా కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్లన్నీ నిండటంతో రబీ పంటలకు సాగునీటిని అందిస్తున్నారు. కానీ, రెండు పంటలకు సరిపోయే నీటిని ఒకే సీజన్‌లో వాడేస్తున్నారు. ఫలితంగా

జలాశయాలు మళ్లీ ఖాళీ అవుతున్నాయి! ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే వేసవిలో తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు! అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకానికి కూడా నీటి కటకట ఏర్పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వాయర్లన్నీ పూర్తిగా నిండినప్పటికీ ఈ పరిస్థితికి కారణాలేంటి..? అంటే నీటి వినియోగంలో ఇరు రాష్ట్రాలు క్రమశిక్షణను పాటించడం లేదని బోర్డు పేర్కొంటుండగా, నీటి కేటాయింపుల్లో బోర్డు శాస్త్రీయతను పాటించడం లేదని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా నీటి కేటాయింపుల్లో నియంత్రణ లోపించినట్టు ఆరోపిస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటిని ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి భారీగా తరలించిందని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు బోర్డు దృష్టికి తీసుకొచ్చింది. అయినా బోర్డు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దాంతో సుమారు 45 టీఎంసీల నీరు లెక్కల్లోకి రాకుండా పోయిందని అధికారులు తేల్చారు. శ్రీశైలం నుంచి విడుదల చేసినట్టుగా నమోదు చేసిన ఈ నీరు నాగార్జుసాగర్‌లోకి చేరలేదు. అంటే ఈ నీటిని శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేసినట్టు ఏపీ ప్రభుత్వం రికార్డుల్లో నమోదు చేసి, దిగువకు కాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా మళ్లించిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఈ విషయంపై బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ కారణంగానే పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలిమెట్రీ యంత్రాలను పనిచేయకుండా చేశారన్న ఆరోపణలూ వచ్చాయి. బోర్డు కచ్చితమైన నిర్ణయాలను తీసుకోలేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
 
తాజా కేటాయింపులు
తాజాగా కృష్ణాబోర్డు ఇరు రాష్ట్రాలకు సుమారు 35 టీఎంసీల నీటిని కేటాయించింది. ఇందులో ఏపీకి 17.09 టీఎంసీలను కేటాయించగా, తెలంగాణకు 17.90 టీఎంసీలను కేటాయించారు. ఏపీలోని పోతిరెడ్డిపాడు నుంచి 0.50 టీఎంసీలను ఉపయోగించుకోవడానికి, హంద్రీ-నీవా, ముచ్చుమర్రికి 4 టీఎంసీలు, సాగర్‌ కుడి కాల్వ అవసరాలకు 10.50 టీఎంసీలు, ఎడమ కాల్వకు 2.09 టీఎంసీల నీటిని కేటాయించారు. అలాగే తెలంగాణలోని కల్వకుర్తి ప్రాజెక్టుకు 2.50 టీఎంసీలు, ఏఎమ్మార్పీకి 4.40 టీఎంసీలు, సాగర్‌ ఎడమ కాల్వకు 11 టీఎంసీలను కేటాయించారు.
 
 
మిగిలేది 20 టీఎంసీలే..
శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లలో ఉపయోగించుకోవడానికి వీలుగా ప్రస్తుతం 67 టీఎంసీల నీరుంది. సాగర్‌లో 162 టీఎంసీల నీటి నిల్వ ఉన్నప్పటికీ కనీస నిల్వపైన ఉపయోగించుకోవడానికి వీలుగా 31 టీఎంసీలు ఉన్నాయి. శ్రీశైలంలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలో(89 టీఎంసీలు) 36 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు 35 టీఎంసీలను కేటాయించింది. ఈ నీటిని మార్చి నాటికి ఉపయోగించుకోవాల్సి ఉంది. అంటే పైన పేర్కొన్న 67 టీఎంసీల్లో ప్రస్తుత కేటాయింపులైన 37 టీఎంసీలను తీసేస్తే మిగిలేది 30 టీఎంసీలు మాత్రమే. ఇందులో సుమారు 10 టీఎంసీల వరకు ఆవిరి రూపంలో నష్టపోయే అవకాశం ఉంది. అంటే నికరంగా మిగిలేది 20 టీఎంసీలే. మార్చి తర్వాత నీటి అవసరాలపై మరోసారి సమావేశమై బోర్డు ఇరు రాష్ట్రాలకు మరింత నీటిని కేటాయించే అవకాశం ఉంటుంది. దాంతో వేసవి ముగిసే నాటికే రిజర్వాయర్లలోని నీటి మట్టాలు పూర్తిగా ఖాళీ అవుతాయని, మళ్లీ వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడం ఖాయమని ఇంజనీర్లు పేర్కొంటున్నారు.
మిషన్‌ భగీరథకు ఈ వేసవిలో కృష్ణా బేసిన్‌ నుంచి సుమారు 10 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే అంత నీటిని అందుబాటులో ఉంచే అవకాశం కనిపించడం లేదు. దాంతో గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా కనీస నిల్వకు దిగువలోని నీటిని కూడా తోడాల్సిన పరిస్థితి నెలకొంటుందనే ఆందోళన ఉంది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా మొదట్లో సరైన వర్షాలు కురవకపోతే మళ్లీ ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. గత జూన్‌, జూలైలో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం, సాగర్‌లో కనీస నిల్వకు దిగువలోని నీటిని కూడా ఉపయోగించారు. తాగునీరు పేరిట ఈ నీటిని తోడేశారు. ఆ తర్వాత ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండినప్పటికీ మళ్లీ అదే పరిస్థితి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
ఏపీనే ఎక్కువ వాడేసింది!
రాష్ట్ర విభజన తర్వాత కృష్ణాలోని 64 శాతం నీటిని ఏపీ, మిగిలిన 36 శాతం నీటిని తెలంగాణ ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లో ఇప్పటి వరకు ఏపీ 301 టీఎంసీలను వాడుకుంది. తెలంగాణ 133 టీఎంసీలను ఉపయోగించుకుంది. అంటే, ఏపీ 69.35 శాతం, తెలంగాణ 30.64 శాతం నీటిని ఉపయోగించుకున్నాయి. అలాగే శ్రీశైలం నుంచి సాగర్‌లోకి విడుదలైనా, అక్కడికి చేరని 45 టీఎంసీలను కూడా ఏపీ కోటాలో కలపాలని తెలంగాణ డిమాండ్‌చేస్తోంది. అలాగే, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు సుమారు 90 టీఎంసీల్లో 43 టీఎంసీలను కేటాయించాలని వాదిస్తోంది. ఇలా 100 టీఎంసీలకు పైగా నీటిని ఏపీ ఎక్కువగా వాడుకుందని తెలంగాణ వాదిస్తున్నది.
 
15న కీలక సమావేశం
నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నియంత్రణపై ఈ నెల 15న కీలక సమావే శం నిర్వహిస్తున్నారు. కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీకి కృష్ణా, గోదావరి బోర్డు అధికారులతో పాటు తెలంగాణ, ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా హాజరుకానున్నారు. ముఖ్యంగా బోర్డుల అధికారాలు, బాధ్యతలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కొన్నిసార్లు బోర్డులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదంగా మారడం, వాటిని ఆయా రాష్ట్రాలు పాటించకపోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డుల అధికారాలను నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో రూపొందించిన వర్కింగ్‌ మాన్యువల్స్‌ను ఖరారు చేయడానికి వీలుగా చర్యల్ని తీసుకుంటున్నారు. దీంతో 15న జరిగే సమావేశం కీలకంగా మారింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe