Breaking News

1న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు

Feb 12, 2018 20:53 by Admin Admin

 ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటానికి సిద్ధమవుతోంది. దీనికోసం వచ్చే నెల 1న జిల్లా కలెక్టరేట్‌ల వద్ద.. ఐదో తేదీన ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేయాలని వైసీపీ నిర్ణయించింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో జగన్‌ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేంద్ర బడ్జెట్‌, పార్లమెంటులో టీడీపీ ఎంపీల నిరసనపైనే ఎక్కువ సేపు చర్చ జరిగింది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. అందరూ ఏకీభవించారు.

 
 
భేటీ అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు.. ప్యాకేజీతో మోస పోవద్దు..’ అన్న సమరశీల నినాదంతో 1న అన్ని కలెక్టరేట్ల వద్ద వైసీపీ నేతలు, శ్రేణులు ధర్నాలు నిర్వహిస్తారని తెలిపారు. ‘మార్చి 3న ప్రకాశం జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్‌ను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కలుస్తారు. అక్కడ మరోసారి కీలక భేటీ జరుగుతుంది. అనంతరం వారంతా ఢిల్లీ బయల్దేరతారు. ప్రజా ప్రతినిధుల వాహన శ్రేణిని జగన్‌ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఐదో తేదీన ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌వద్ద ధర్నా ప్రత్యేక హోదా డిమాండ్‌తో ధర్నా చేస్తాం’ అని తెలిపారు.
 
హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్‌ గతంలో చెప్పారని విలేకరులు గుర్తుచేయగా.. అవసరమైతే రాజీనామాలకు తమ ఎంపీలు సిద్ధమేనని భూమన అంటుండగా.. తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ జోక్యం చేసుకుని ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంటులో మాట్లాడే వారు ఎవరని ప్రశ్నించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe