Breaking News

కుదురుగా కూర్చోనీయడం లేదు

Feb 12, 2018 20:54 by Admin Admin

మూడు నిమిషాల పాటలో ముద్దు ముద్దుగా ముప్ఫై సెకన్లు కనిపించింది. ఏదో మాయ చేసింది. అందర్నీ తన మాయలో పడేసింది. అసలు, ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియకుండా వాట్సాప్‌ స్టేటస్‌లు పెడుతున్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో ఈ అమ్మాయి వీడియో షేర్‌చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అమ్మాయి గురించే చర్చ.

ఎవరీ అమ్మాయి? పేరు... ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఊరు... కేరళలోని త్రిసూర్‌. వయసు... 18 ఏళ్లు! సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఆ వీడియో... మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్‌ లవ్‌’లోని పాట ‘మాణిక్య మలయ పూవి’లోనిది. ఫిబ్రవరి 9న పాట విడులైంది. తర్వాత కొన్ని గంటల్లో పాట, అందులో ప్రియ పలికించిన హావభావాలు పాపులర్‌ అయ్యాయి. ప్రియ అందం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. విశేషం ఏంటంటే... ‘ఒరు ఆదార్‌ లవ్‌’తో ప్రియ వెండితెరకు పరిచయమవుతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొంచెం ముందుగా పాటను విడుదల చేశారు. ఏప్రిల్‌ నెలాఖరున సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికంటే ముందు మూడు షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించింది. కొన్ని ఫ్యాషన్‌ షోలలో పాల్గొంది. మోడల్‌గా ర్యాంప్‌ వాక్స్‌ చేసింది. ప్రియ మోహినీఆట్టం కళాకారిణి కూడా! చిన్నప్పటి నుంచి నటన, సినిమాలు అంటే ఇష్టమనీ, స్కూల్‌ డేస్‌లో చాలా నాటకాల్లో నటించానని ఆమె తెలిపింది. ఇక, సీబీఎస్‌సీ ప్లస్‌ 2 బోర్డ్‌ ఎగ్జామ్స్‌ రాయడానికి ముందు ఈ సినిమా ఆడిషన్స్‌కి వెళ్ళింది.
 
ముందు అవకాశం రాదేమోనని ప్రియ అనుకుందట! కట్‌ చేస్తే... ఛాన్స్‌ ఆమెను వరించింది. ‘మాణిక్య మలయ పూవి’ పాట ప్రియాను ఎంత పాపులర్‌ చేసిందంటే.. ఒక్క రోజులో (ఫిబ్రవరి 12న) ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను అనుసరించే వారి సంఖ్య ఆరు లక్షల మంది పెరిగారు. అంతకు ముందు హాలీవుడ్‌ మోడల్‌, నటి కైలీ జెన్నర్‌ను ఈ నెల 5న 8.6 లక్షల మంది ఫాలో అయ్యారు. ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డోను గతేడాది 13న 6.5 లక్షల మంది ఫాలో అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క రోజులో అత్యధిక ఫాలోయర్లును సాధించుకున్న సెలబ్రిటీగా ప్రియ చరిత్ర సృష్టించారు.

ప్రియ ఫాలోయింగ్‌ (సోమవారం సాయంత్రానికి)
ఇన్‌స్టాగ్రామ్‌లో: 1.1 మిలియన్‌
ట్విట్టర్‌లో: 23,10,000
ఫేస్‌బుక్‌లో: సుమారు 79 వేల మంది ఫాలో అవుతున్నారు, 76 వేల మంది ప్రియ పేజీని లైక్‌ చేశారు.
 
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe