Breaking News

గుట్టువిప్పిన శాస్త్రవేత్త

Apr 08, 2018 22:21 by Admin Admin

శ్మశానాలలో అతడు రహస్యంగా తిరిగేవాడు. ఎవరైనా వదిలేసిన శవాల్ని తెచ్చుకొనేవాడు. వాటిని కోసి లోపల శరీరం లోపల ఏముందో తెలుసుకొనేవాడు. మెదడు, వెన్నుపాము, కళ్లు, నోరు, చెవి, ముక్కు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు- ఇలా అన్నింటినీ పరిశీలించేవాడు. అలా శరీరనిర్మాణ శాస్త్రానికి అంటే అనాటమీకి ఆధునిక యుగంలో పునాది వేసిన ఆ శాస్త్రవేత్త పేరు- అంద్రియాస్‌ విసేలియస్‌.

 
విసేలియస్‌ 1514లో బెల్జియమ్‌ రాజధాని బ్రస్సెల్స్‌లో జన్మించాడు. చిన్నతనంలో తల్లికి తెలియకుండా వంటింట్లో బల్లపై కుక్కల్నీ, పిల్లుల్నీ, బొద్దింకల్నీ కోసి వాటి లోపల ఏముందో చూసేవాడు. బాల్యంలో అది ఓ అల్లరి. కాని వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం లోపల ఏయే అవయవాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరిగింది. అందుకే వైద్యశాస్త్రాన్ని తన అధ్యయనాంశంగా ఎంచుకొన్నాడు. 16 ఏళ్ల వయసులో స్థానిక లువాయె యూనివర్సిటీలో మెడికల్‌ స్టూడెంట్‌గా చేరాడు. నాలుగేళ్లు చదివాడు. తర్వాత ప్యారిస్‌ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్‌ పొందాడు. అక్కడ ప్రఖ్యాత వైద్యుడైన జాకబ్‌ సెల్వైస్‌ వద్ద శిష్యరికం చేశాడు. ఆపై ఆయనకు సహాయకుడిగా మారాడు.
 
కఠోరశ్రమతో, తదేకదీక్షతో పనిచేయడం విసేలియస్‌కి ఇష్టం. దేనిపైనైనా స్పష్టమైన అభిప్రాయాల్ని చెప్పడం అతడి నైజం. దేహాల్ని కోసి మరీ అధ్యయనాలు చేయాలన్నది అతడి పట్టుదల. కానీ వీటన్నిటివల్లా గురువుతో, సహాధ్యాయులతో విభేదాలు వచ్చాయి. అంతలో 1536లో ఫ్రాన్స్‌-జర్మనీల మధ్య యుద్ధం తలెత్తింది. దాంతో డిగ్రీ పట్టా చేతికి రాకుండానే ప్యారిస్‌ని వదిలిపెట్టాల్సివచ్చింది. అలా తిరిగి ఇంటిముఖం పట్టాడు 22 ఏళ్ల విసేలియస్‌.
 
ఏ వైద్యవిధానంలోనైనా శరీరనిర్మాణం గురించి ఎంత తెలిస్తే అంత మంచిది. అవయవాల గుట్టు తెలియాలన్నా, రోగాల రట్టు విప్పాలన్నా మనిషి శరీరం లోపలి రహస్యాలు తెలియాల్సిందే! అందుకోసం దేహాల్ని కత్తితో కోయాలి. కాని బతికున్న వారిపై ఈ ప్రయోగాలు చేయలేం కదా! అందుకే మృతదేహాల అవసరం ఎంతో ఉంది. శరీర అంతర్గత నిర్మాణం కూలంకషంగా అర్థమవ్వాలంటే శవాలే కావాలి.
 
కానీ అనాది నుంచీ అన్ని దేశాల్లోనూ, మతాల్లోనూ, నాగరికతల్లోనూ పార్ధివదేహాల పట్ల అనేక విశ్వాసాలు ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి శరీరాన్ని కాల్చడమో, పూడ్చడమో చేయడం అన్ని చోట్లా ఉంది. మృతదేహంలోంచి ఓ అవయవం తీసేస్తే వచ్చే జన్మలో ఆ అవయవలోపంతో పుడతారన్న అంధవిశ్వాసాలూ ఉన్నాయి. శవాన్ని చాకుతో కోసి బాధపెడితే పాపం చుట్టుకొంటుందన్న మూఢనమ్మకాలూ ఉన్నాయి.
 
వీటిని వ్యతిరేకించి- పరిశోధనలు చేసే సాహసం ఎవరూ చేయలేకపోయారు. అనాటమీకి ఆదిపురుషుడు అన్నదగ్గ గాలెన్‌ పరిస్థితి కూడా ఇంతే. గాలెన్‌ రోమన్‌ సామ్రాజ్యంలోని గ్రీకు దేశానికి చెందిన సర్జన్‌, ఫిజిషియన్‌ గాలెన్‌. ఇతనిది క్రీ.శ. 130 కాలం. ఈయన మానవ భౌతికకాయాన్ని కాకుండా కోతి, కుక్క, పంది, గొర్రె, ఎద్దు లాంటి వాటి శరీరాల్ని కోసి, వాటి ఆధారంగా మానవదేహం లోపల ఎలాంటి అవయవ నిర్మాణం ఉంటుందో ఊహించి తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వీటిని తన ‘అనటామికల్‌ ప్రిపరేషన్స్‌’ అనే గ్రంథంలో పొందుపరిచారు.
 
కానీ ఇది శాస్త్రీయమెలా అవుతుంది. కోతితో మనిషికి పోలిక ఉన్నా- మనిషి ప్రత్యేకత మనిషిదే కదా! మనిషి శరీర నిర్మాణాన్ని తెలుసుకోకపోతే వ్యాధుల మూలాల్ని, కారణాల్ని, ప్రభావాల్ని కనుగొనలేని పరిస్థితి. దీని వల్ల రోగాలకు ఎలాంటి ఔషధాలు తయారుచేయాలో అర్థం కాదు. ఇది మానవాళికి ఎంతటి విఘాతం!
 
వాస్తవాల్ని అన్వేషించడానికి అడ్డుగా ఉన్న అంధవిశ్వాశాల్ని ఛేదించి, 1400 ఏళ్ల పాటు సుగ్రీవాజ్ఞల్లా ఉన్న గాలెన్‌ భావాల్ని ఎదిరించి, సశాస్త్రీయమైన శరీర ఛేదన విధానాల్ని తీసుకువచ్చిన వాడు- విసేలియస్‌. తానే స్వయంగా కత్తి తీసుకొని మృతదేహాలను కోస్తూ పరిశోధనలు చేశాడు. మానవ-వానర శరీరాల్ని బహిరంగంగా కోసి, శరీర భాగాల మధ్య వ్యత్యాసాలను బొమ్మ కట్టినట్లు చూపించాడు. మనిషికీ, జంతువులకీ అవయవాల విషయంలో 200కి పైగా తేడాల్ని ఎత్తి చూపించాడు. అంతవరకు ఎంతటి అజ్ఞానంతో అడుగులు వేశామో విమర్శించాడు. దాంతో ఎంతమంది మతాధికారులు, ప్రొఫెసర్లు, వైద్యులు విసేలియస్‌పై రాళ్లు రువ్వారో అంతేలేదు.
 
పైగా ఆ రోజుల్లో విశ్వవిద్యాలయాల్లో అనాటమీ బోధన విచిత్రంగా ఉండేది. దూరంగా మృతదేహాల్ని ఉంచేవారు. క్షురకుడో, సహాయకుడో వాటిని కోస్తుంటే- ఎక్కడో వేదికపై నిలబడి అధ్యాపకులు పాఠాలు చెప్పేవారు. కాని విసేలియస్‌ అలా కాదు. శవం ముందు నిలబడి చాకుతో ఒక్కో అవయవాన్ని ఛేదన చేస్తూ, వాటి లోతుల్ని అర్థం చేసుకొంటూ 3 రోజుల నుంచి మూడు వారాల వరకూ బోధించేవాడు. మృతదేహాలు చెడిపోకుండా ఉండేందుకు చలికాలంలో ఎక్కువగా పాఠాలు చెప్పేవాడు.
 
మూఢనమ్మకాల వల్ల ఆ రోజుల్లో శవాల్ని ఎవరూ ఈ వైద్యపరీక్షల నిమిత్తం ఇచ్చేవారు కాదు. మృతదేహాల కొరత విపరీతంగా ఉండేది. అందుకే ఎక్కడైనా, ఎవరైనా చనిపోతే ఆ పార్థివదేహాన్ని తనకివ్వమంటూ ప్రాఽథేయపడేవాడు. అలా చేస్తే మరణించిన ఆ వ్యక్తి రాబోయే తరాల మానవాళికి వేలవేల రూపాల్లో సహకరించిన మహానుభావుడు అవుతాడని వివరించేవాడు. అయినా ఛాందసుల చెవికి ఎక్కేవి కావు- ఆ మాటలు. అందుకని అప్పుడప్పుడు శవాల్ని దొంగిలించేవాడు విసేలియస్‌. ఒకసారి ఉరితాడుకు వేళ్ళాడుతూ కృశించిపోయిన నేరస్థుడి ఎముకల్ని దొంగిలించాడు. కష్టపడి సేకరించిన ఆ అస్థికలపై ప్రయోగాలు చేసేవాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు వాటిని తన పరుపు కింద దాచుకొనేవాడు.
 
తన పరిశోధనాంశాలన్నింటినీ విసేలియస్‌ 1543లో ‘డి హ్యూమనీ కార్పోరిస్‌ ఫాబ్రిక’ అనే గ్రంథంలో వివరించేవాడు. మానవదేహానికి సంబంధించిన కొన్ని వందల చిత్రపటాలు, బొమ్మల ద్వారా విశ్లేషిస్తున్న పుస్తకమిది.
అయినా మతాధికారులు విసేలియస్‌పై విరుచుకుపడుతూ వచ్చారు. తప్పుడు అభియోగాలు మోపుతూ ఉండేవారు. 1564లో బతికున్నవ్యక్తిని శరీరఛేదనకు ఉపయోగించారని విసేలియస్‌పై నేరారోపణ వచ్చింది. దాంతో దేశాన్ని విడిచిపెట్టాలని ఆదేశాలు రావడంతో జెరుసలేమ్‌ వెళ్లాడు విసేలియస్‌. పాపాల్ని పోగొట్టుకొనేందుకు పవిత్ర పుణ్యస్థలం సందర్శించాలన్నది ప్రభుత్వ తీర్పు. తిరిగివస్తుండగా విసేలియస్‌ ప్రయాణిస్తున్న ఓడ తుపానులో చిక్కుకొంది. దాని నుంచి ఎలాగోలా తప్పించుకొని జకింతోస్‌ దీవులకు వెళ్లాడు. అస్వస్థతతో 50వ ఏట 1564లో అక్కడే మరణించాడు విసేలియస్‌.
 
విసేలియస్‌ సాహసంలో మనం పదో వంతు చేస్తే చాలు!మరణించాక మన దేహాల్ని ఏదో ఒక కాలేజీకి దానం చేస్తే అదే పదివేలు! 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe