Breaking News

ఇద్దరు అథ్లెట్లపై వేటు

Apr 13, 2018 19:05 by Admin Admin

 కామన్వెల్త్‌ క్రీడల నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు భారత అథ్లెట్లపై నిషేధం విధిస్తూ కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య(సీజీఎఫ్‌) నిర్ణయం తీసుకుంది. వారిరువురినీ వెంటనే స్వదేశం పంపించాల్సిందిగా భారత అథ్లెటిక్‌ బృందం అధికారులకు తెలిపింది. ట్రిపుల్‌ జంపర్‌ వి.రాకే‌ష్‌బాబు, రేస్‌ వాకర్‌ ఇర్ఫాన్‌ కామన్వెల్త్‌ క్రీడల ‘నో నీడిల్‌’ పాలసీని ఉల్లంఘించినట్టు రుజువైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీజీఎఫ్‌ వెల్లడించింది. క్రీడల గ్రామంలో వారు ఉంటున్న బెడ్‌రూంలో ఉపయోగించిన సిరంజీని కనుగొన్న క్లీనింగ్‌ సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని సమాఖ్యకు తెలిపారు.

 
 
నిషేధానికి గురైన భారత అథ్లెట్ల సంచిలోకూడా ఒక సిరంజీని క్లీనింగ్‌ సిబ్బంది కనుగొన్నారని సీజీఎఫ్‌ వెల్లడించింది. రాకే‌ష్‌బాబు, ఇర్ఫాన్‌లపై తక్షణమే నిషేధాన్ని విధిస్తూ వారి అక్రిడిటేషన్‌లను రద్దుచేస్తూ, క్రీడాగ్రామంనుంచి బహిష్కరిస్తూ నిర్ణయించామని, వారిని స్వదేశం పంపించాలని భారత అథ్లెటిక్‌ సంఘానికి తెలిపామని సీజీఎఫ్‌ అధ్యక్షుడు లూయీస్‌ మార్టిన్‌ తెలిపారు. ఈ విషయమై భారత అథ్లెటిక్‌ సమాఖ్య స్పందిస్తూ క్రీడలు ముగిసిన వెంటనే వారిద్దరిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలుపగా, సీజీఎఫ్‌ నిర్ణయంపై అప్పీల్‌ చేస్తామని భారత అథ్లెటిక్‌ బృందం టీమ్‌ మేనేజర్‌ నామ్‌దేవ్‌ షిర్గోంకర్‌ వెల్లడించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe