Breaking News

కోర్టు ఆదేశాలతో కుల్‌దీప్‌కు బేడీలు

Apr 13, 2018 19:06 by Admin Admin

 ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ‘ఉన్నావ్‌’ అత్యాచారం, బాధితురాలి తండ్రి హత్య కేసుల్లో బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగాల్‌కు ఎట్టకేలకు బేడీలు పడ్డాయి. ‘ఆధారాలు లేవన్న ఒకే ఒక్క కారణంతో అరెస్టు నుంచి ఎమ్మెల్యేను మినహాయిస్తారా?’ అని అలహాబాద్‌ హైకోర్టు ఘాటుగా ప్రశ్నించిన కొద్ది గంటల్లోనే ఎమ్మెల్యేను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై దాఖలైన 3 కేసుల్లో సీబీఐ దర్యాప్తు జరపనుంది. గత ఏడాది జూన్‌ నాలుగో తేదీన ఉన్నావ్‌లోని ఎమ్మెల్యే నివాసంలో బాధితురాలి (17)పై అత్యాచారం జరిగిన వ్యవహారంలో ఒక కేసు, నిందితులను వదిలేసి, వారిపై ఫిర్యాదు చేసిన బాధితురాలి తండ్రిపై పోలీసులు ఆయుధాల అక్రమ రవాణా కేసు నమోదు చేయడంపై మరో కేసు, పోలీస్‌ లాక్‌పలో ఆమె తండ్రి చనిపోయిన ఉదంతంపై మూడో కేసు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా దాఖలయ్యాయి. నిజానికి, 24 గంటలపాటు కుల్‌దీప్‌ సింగ్‌ సీబీఐ అదుపులోనే ఉన్నారు.

 
 
యూపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు గురువారం ఈ కేసును సీబీఐ చేపట్టింది. ఆ వెంటనే కుల్‌దీప్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. శుక్రవారం ఉదయం అలహాబాద్‌ హైకోర్టుకు ఆ వివరాలను సీబీఐ న్యాయవాది వివరించారు. ఆ సమయంలో కోర్టు జోక్యం చేసుకొని.. ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదా అని ప్రశ్నించింది. తాము ప్రశ్నించడానికే అదుపులోకి తీసుకొన్నామన్న జవాబుపై అసహనం వ్యక్తం చేసింది. ఉన్నపళంగా అరెస్టు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
 
ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు కుల్‌దీప్‌ను అరెస్టు చేశారు. ‘ఉన్నావ్‌’ కేసును సీబీఐకి అప్పగించడంలో తటపటాయించినట్టు కనిపించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఈ కేసులో తాము వేగంగా స్పందించామని చెప్పేందుకు ప్రయత్నించారు. నేరరహిత రాష్ట్రంగా యూపీని తీర్చిదిద్దటంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ‘‘నా దృష్టికి వచ్చిన వెంటనే సిట్‌ దర్యాప్తునకు ఆదేశించాను. ఈ కేసులో వైద్యులు, పోలీసులు తప్పుచేసినట్టు సిట్‌ తేల్చిన వెంటనే, విధుల నుంచి తొలగించాం’’ అని యోగి వివరించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe