Breaking News

రిలయన్స్‌ చేతికి ఎయిర్‌ ఇండియా?

Apr 13, 2018 19:07 by Admin Admin

 ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా రిలయన్స్‌ గ్రూప్‌ చేతుల్లోకి వెళ్లనుందా? ఓ విదేశీ విమానయాన సంస్థ రిలయన్స్‌తో భాగస్వామి అయ్యి దక్కించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? తాజా పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఎయిర్‌ ఇండియాలో 76 శాతం వాటాను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జరుగుతున్న బిడ్డింగ్‌లో పాల్గొనడాకి గల్ఫ్‌ ఎయిర్‌లైన్‌ దిగ్గజమైన ఎతిహాద్‌ సన్నాహాలు చేస్తోంది. ఆ సంస్థ భారత్‌లో అనీల్‌ అంబానికి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌తో జత కట్టి ఎయిర్‌ఇండియాను దక్కించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ సంస్థ రిలయన్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నది. రిలయన్స్‌తో సంయుక్తంగా కన్సార్షియం ఏర్పాటు చేసి బిడ్డింగ్‌లో పాల్గొనాలని ఎతిహాద్‌ భావిస్తోంది. అయితే, ఈ రెండు సంస్థల భాగస్వామ్యం పట్ల పరిణామాలను దగ్గరగా గమనిస్తున్న వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 
రిలయన్స్‌కు ఎయిర్‌ ఇండియాను కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రఫేల్‌ డీల్‌ ద్వారా రిలయన్స్‌కు లబ్దీ చేకూరేలా చేసిన ప్రభుత్వం ఎయిర్‌ ఇండియా విషయంలో కూడా అదే జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. రిలయన్స్‌ పెద్దలు ప్రధాని మోదీకి సన్నీహితంగా ఉంటారు కాబట్టి ఆ సంస్థతో వెళ్తే భారత్‌లో ప్రయోజనకరంగా ఉంటుందని ఎతిహాద్‌ ఆశిస్తోంది. వచ్చే నెల 14న బిడ్డింగ్‌ ముగుస్తుంది. ఆలోపు ఈ రెండు సంస్థలు జత కడితే తప్పకుండా అవి ఎయిర్‌ ఇండియాను చేజెక్కించుకుంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe