Breaking News

కోల్‌కతాపై ఘన విజయం

Apr 14, 2018 20:05 by Admin Admin

  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. అటు బౌలింగ్‌లో.. ఇటు బ్యాటింగ్‌తో పాటు మెరుపు ఫీల్డింగ్‌తో మెప్పించి వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య కోల్‌కతా పర్యాటక బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌ (34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 49) చెలరేగగా.. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 29) రాణించాడు. భువనేశ్వర్‌ కుమార్‌ (3/26), షకీబల్‌ హసన్‌ (2/21), స్టాన్‌లేక్‌ (2/21) సత్తా చాటారు. అనంతరం కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 50), షకీబల్‌ హసన్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 27) సత్తాచాటడంతో హైదరాబాద్‌ 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సునీల్‌ నరైన్‌ (2/17) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు.

 
 
తడబడి.. చెలరేగి..: స్వల్ఫ లక్ష్య ఛేదనను హైదరాబాద్‌ ధాటిగానే ఆరంభించినా మధ్యలో తడబడింది. ఓపెనర్‌ సాహా ముచ్చటైన షాట్లతో వెంటవెంటనే ఐదు బౌండ్రీలు రాబట్టడంతో మూడు ఓవర్లలోనే 32 పరుగులు చేసింది. కానీ, నాలుగో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సునీల్‌ నరైన్‌ తొలి బంతికే సాహాను ఎల్బీగా అవుట్‌ చేశాడు. చావ్లా బౌలింగ్‌లో కెప్టెన్‌ విలియమ్సన్‌ రెండు బౌండ్రీలు రాబట్టినా.. తన తర్వాతి ఓవర్లోనే నరైన్‌ రైజర్స్‌కు మరో షాకిచ్చాడు. పరుగులు తీసేందుకు ఇబ్బంది పడుతున్న ధవన్‌ (7)ను క్లీన్‌బౌల్డ్‌ చేసి ఆతిథ్య శిబిరంలో ఉత్సాహం నింపాడు. కాసేపటికే మనీష్‌ పాండే (11 బంతుల్లో 4)ను కుల్దీప్‌ స్లోబాల్‌తో ఎల్బీ చేశాడు. అప్పటికా నిదానంగా ఆడిన కేన్‌.. కుల్దీప్‌ వేసిన 11వ ఓవర్లో వరుగా రెండు ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. అనంతరం బౌలింగ్‌కు దిగిన రసెల్‌కు షకీబల్‌ వరుసగా 4, 4, 6తో స్వాగతం పలికాడు. ఈ ఓవర్లో 16 రన్స్‌ రావడంతో మ్యాచ్‌ హైదరాబాద్‌ చేతుల్లోకి వచ్చింది. ఆపై, ఇద్దరూ మరింత దూకుడు పెంచడంతో జట్టు సులభంగా నెగ్గేలా కనిపించింది. కానీ, 16వ ఓవర్లో షకీబల్‌ను చావ్లా, 18వ ఓవర్లో కేన్‌ను జాన్సన్‌ అవుట్‌ చేయడంతో ఉత్కంఠ రేగింది. యూసుఫ్‌ పఠాన్‌ (17 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు.
 
 
స్కోరుబోర్డు;
కోల్‌కతా: ఊతప్ప (సి) సాహ (బి) భువనేశ్వర్‌ 3; లిన్‌ (సి అండ్‌ బి) షకీబ్‌ 49; రాణా (సి)మనీష్‌ (బి) స్టాన్‌లేక్‌ 18; నరైన్‌ (సి) విలియమ్సన్‌ (బి) షకీబ్‌ 9; కార్తీక్‌ (సి) సాహా (బి) భువనేశ్వర్‌ 29; రస్సెల్‌ (సి) మనీష్‌ (బి) స్టాన్‌లేక్‌ 9; శుభ్‌మన్‌ (సి) షకీబ్‌ (బి) భువనేశ్వర్‌ 3; శివం మావి (సి) భువనేశ్వర్‌ (బి) కౌల్‌ 7; జాన్సన్‌ నాటౌట్‌ 4;
ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: 20 ఓవర్లలో 138/8.
వికెట్ల పతనం: 1-16, 2-55, 3-79, 4-87, 5-96, 6-112, 7-129, 8-138.
బౌలింగ్‌ : భువనేశ్వర్‌ 4-0-26-3, స్టాన్‌లేక్‌ 4-0-21-2, సిద్ధార్థ్‌ 4-0-37-1, రషీద్‌ 4-0-31-0, షకీబల్‌ 4-0-21-2.
 
 
హైదరాబాద్‌: సాహ (సి) కార్తీక్‌ (బి) నరైన్‌ 24; ధవన్‌ (బి) నరైన్‌ 7; విలియమ్సన్‌ (సి) రస్సెల్‌ (బి) జాన్సన్‌ 50; మనీష్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 4; షకీబల్‌ (బి) చావ్లా 27; హుడా నాటౌట్‌ 5; పఠాన్‌ నాటౌట్‌ 17;
ఎక్స్‌ట్రాలు: 5;మొత్తం: 19 ఓవర్లలో 139/5.
వికెట్ల పతనం: 1-32, 2-46, 3-55, 4-114, 5-119.
బౌలింగ్‌: జాన్సన్‌ 3-0-30-1, రస్సెల్‌ 3-0-39-0, నరైన్‌ 4-0-17-2, చావ్లా 4-0-20-1, కుల్దీప్‌ 4-0-23-1, మావి 1-0-10-0.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe