Breaking News

వారి బండారం బయటపడుతుంది

Apr 14, 2018 20:06 by Admin Admin

 రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయం, మోదీ సర్కారు వైఖరికి నిరసనగా తన పుట్టిన రోజైన ఈనెల 20న నిరాహార దీక్ష చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా దీక్ష చేపడతానని చెప్పారు. శనివారం రాజధాని ప్రాంతంలోని ఐనవోలులో జరిగిన అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల వేదికపై చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ‘‘కేంద్రం వైఖరికి నిరసనగా మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. నాలుగు సంవత్సరాల కిందట ఏప్రిల్‌ 30న తిరుపతిలో వెంకటేశ్వరుడి నామాలను చూస్తూ మోదీ మనకు ప్రత్యేక హోదాతో సహా ఎన్నో హామీలు ఇచ్చారు. వాటికి తిలోదకాలు ఇచ్చిన తీరును ఎండగడుతూ నమ్మకద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఈ నెల 30వ తేదీన తిరుపతిలోనే భారీ సభ నిర్వహిస్తున్నాం’’ అని తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే కొరివితో తలగోక్కున్నట్లేనని కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం అన్యాయం చేస్తే ఇక్కడ నేతలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి బంద్‌కు పిలుపునివ్వడం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.

 
 
ముసుగు వీరులు...
ఓట్లు అడిగేందుకు ప్రతిపక్ష నేత జగన్‌కు ఏ అర్హత ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావడమేనా వారి అర్హతా అని ఎద్దేవా చేశారు. ‘‘కొన్ని పార్టీలు ముసుగు వేసుకున్నాయి. ఆ ముసుగు వీరులకు మోదీ అండదండలున్నాయి. ఏపీ విషయంలో మాటమీద నిలబడకుండా ముసుగు వీరుల మాటలు విన్నారు. మునిగిపోతారు. ఈ ముసుగు వీరుల బండారం బయటపడుతుంది’’ అని చంద్రబాబు హెచ్చరించారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ లేనేలేదు. వారికి ఒక్క ఓటూ పడదు. భవిష్యత్తులో ఇక్కడ బలపడేందుకు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారా?’’ అని నిలదీశారు. తమిళనాడులో వారికి కావాల్సిన వారు సీఎంగా ఉండేందుకు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. ‘‘ఇక్కడ కూడా అలాంటి ప్రయోగం చేసేందుకు ఒక అవినీతి పార్టీని, వారం వారం కోర్టుకెళ్లే నాయకుడిని దగ్గరకు తీస్తున్నారు’’ అని విమర్శించారు.
 
 
మనమే శాసిస్తాం...
రాష్ట్రంలో మొత్తం పాతికమంది ఎంపీలను గెలిపిస్తే... మనం చెప్పిన ప్రభుత్వమే ఢిల్లీలో ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేంద్రంలో చక్రం తిప్పేది తెలుగుదేశం పార్టీనేనన్నారు. మీ ఆశీస్సులు తెలుగుదేశానికి అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల్లో తనకంటే జూనియర్‌ అని చంద్రబాబు పేర్కొన్నారు. తనకేమీ భయం లేదని తేల్చి చెప్పారు. ‘‘మనం గొంతెమ్మ కోర్కెలు కోరలేదు. విభజన చట్టం అమలు చేయాలని, రాజ్యసభలో ఇచ్చిన హామీల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని మాత్రమే అడిగాం. నాకు వ్యక్తిగతంగా భయం లేదు. పసిబిడ్డలాంటి రాష్ట్రానికి సకాలంలో అందాల్సిన సహాయం అందకపోతే నష్టపోతామన్నదే నా భయం’’ అని తెలిపారు.
 
 
అమరావతి అక్కర్లేదా?
గుంటూరు జిల్లాలో జగన్‌ పాదయాత్రను ప్రస్తావిస్తూ... ‘ఇక్కడ తిరుగుతున్న జగన్‌ రాజధాని గురించి అడిగారా?’ అని చంద్రబాబు నిలదీశారు. 33 వేల ఎకరాల భూమి రాజధాని ప్రజల కోసం కాదా అని ప్రశ్నించారు. ‘‘మోదీ ధొలేరా నగరాన్ని రెండు జిల్లాల పరిధిలో నిర్మిస్తున్నారు. కానీ... 13 జిల్లాల నవ్యాంధ్రకు రాజధాని అవసరం లేదా? అమరావతి వస్తే వారికి కడుపుమంట ఎందుకు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలోనూ బ్రిటీష్‌ వాళ్లకు కొమ్ముగాచిన వాళ్లు ఉన్నారన్నారు. ఇప్పుడు బెయిలు కోసం, కేసుల కోసం భయపడే వాళ్లున్నారని విమర్శించారు. ‘‘వారు ముందు తమపై ఉన్న కేసులు చూసుకుని, ఆ తర్వాత ప్రజల గురించి ఆలోచిస్తారు’’ అని పరోక్షంగా జగన్‌పై మండిపడ్డారు.
 
 
అంబేడ్కర్‌ స్మృతివనం ఆకృతి ఆవిష్కరణ
రాజధాని ప్రాంతంలోని ఐనవోలులో ‘అంబేడ్కర్‌ స్మృతివనం’ ఆకృతిని సీఎం చంద్రబాబు శనివారం ఆవిష్కరించారు. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తారు. లైబ్రరీ, పరిశోధనాశాలలు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఏడాది చివర్లోగా ఇక్కడ అంబేడ్కర్‌ విగ్రహాన్ని పూర్తిచేసి ప్రారంభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా భారత్‌ బంద్‌లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన 12 మంది కోసం 2 నిమిషాలపాటు సభ మౌనం పాటించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe