Breaking News

వీహెచ్‌పీ నుంచి తొగాడియా ఔట్‌

Apr 14, 2018 20:07 by Admin Admin

  ప్రధానమంత్రి నరేంద్రమోదీ దెబ్బకు విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) నుంచి ప్రవీణ్‌ తొగాడియా ఔటయ్యారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడిగా హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ విష్ణు సదాశివ కోక్జే ఎన్నికయ్యారు. వీహెచ్‌పీ చరిత్రలో తొలిసారిగా ఈ పదవి కోసం జరిగిన రహస్య ఓటింగ్‌లో కోక్జేకు 131 ఓట్లు రాగా.. ప్రవీణ్‌ తొగాడియా బలపర్చిన రాఘవరెడ్డికి కేవలం 60 ఓట్లే వచ్చాయి. దీంతో వీహెచ్‌పీతో తనకున్న 32 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు తొగాడియా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆయన ఆరోపణలను గానీ, ఆవేదనను గానీ సంస్థలో ఎవరూ పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. దాంతో వీహెచ్‌పీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో వీహెచ్‌పీలో తొగాడియా శకం ముగిసినట్లయ్యింది. హిందువుల కోసం ఈ నెల 17 నుంచి ఆమరణదీక్షకు దిగుతున్నట్లు ఆయన వెల్లడించారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఎప్పుడూ ఏకాభిప్రాయంతోనే సాగిపోతుంది. సంఘ్‌ సూచనలకు అనుగుణంగా సంస్థ ప్రతినిధులు ఒక అభిప్రాయానికి వచ్చి తమ భావి నేత ఎవరనేది నిర్ణయించుకుంటారు. 52ఏళ్ల ఈ సంస్థ చరిత్రలో ఏనాడూ ఈ పదవికి ఎన్నిక జరగలేదు. గత ఏడాది డిసెంబరులో భువనేశ్వర్‌లో జరిగిన సమావేశాల్లో దీనికి సంబంధించిన చర్చ జరిగినా.. కొలిక్కి రాలేదు. హైదరాబాద్‌కు చెందిన రాఘవరెడ్డి(పుల్లారెడ్డి కుమారుడు)తో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ విష్ణు సదాశివ కోక్జే పోటీపడ్డారు.

 
 
కోక్జే కొత్త టీమ్‌
ఫలితాలు వెల్లడైన వెంటనే కొత్త అంతర్జాతీయ అధ్యక్షుడు కోక్జే తన టీమ్‌ను ప్రకటించారు. ఇందులో తొగాడియా మద్దతుదారులు ఎవరికీ చోటు కల్పించ లేదు. వీహెచ్‌పీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అలోక్‌ కుమార్‌ను, అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అశోక్‌ చౌగులే, ప్రధాన కార్యదర్శిగా మిలింద్‌ పరాండే, సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా వినాయకరావు దేశ్‌పాండే, వేంకట కోటేశ్వరరావులను నియమించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe