Breaking News

అమెరికా క్షిపణి దాడులు

Apr 14, 2018 20:08 by Admin Admin

 అమెరికా వైమానిక దాడులు.. జత కలిసిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌.. 100కు పైగా క్షిపణులతో దాడి   ఆయుధ సంపత్తిని ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి. సిరియాలోని డౌమా పట్టణంలో ఇటీవల జరిగిన రసాయన దాడులతో వందలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ దాడులను అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. సొంత ప్రజలపైనే రసాయన దాడులకు పాల్పడ్డారంటూ సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసద్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌లతో కలిసి అమెరికా దళాలు సిరియాపై శనివారం తెల్లవారుజాము నుంచి క్షిపణుల వర్షం కురిపించాయి. మూడు దేశాలూ మధ్యధరా సముద్రంలో మోహరించిన నౌకలపై నుంచి మానవ సహిత విమానాల ద్వారా, ఇతర వైమానిక స్థావరాల నుంచీ ఈ దాడులు చేశాయి.

 
 
సిరియా వైమానిక రక్షణ వ్యవస్థ, సైంటిఫిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌పైనా దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన బీ1 బాంబర్లు, బ్రిటన్‌కు చెందిన టోర్నడో జెట్లు, ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్‌ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. రసాయన ఆయుధాల తయారీ, విస్తృతి, వాడకాన్ని నిరోధించేందుకే తాము సంయుక్తంగా దాడులు చేపట్టినట్లు ట్రంప్‌ వెల్లడించారు. అసద్‌ ప్రభుత్వం రసాయన ఆయుధాల వాడకాన్ని ఆపేవరకు తమ ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం చేశారు. పక్కా ప్రణాళికతో చేసిన తాజా క్షిపణి దాడులు విజయవంతమయ్యాయన్న ట్రంప్‌.. బ్రిటన్‌, ఫ్రాన్స్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇరాన్‌, రష్యాలకు నేను వేసే ప్రశ్న ఒక్కటే.. పసిపిల్లలు సహా అమాయకులైన ప్రజలను సామూహికంగా హతమార్చే దేశానికా మీరు మద్దతిచ్చేది? ప్రపంచంలోని ఏ దేశాన్నయినా వారి మిత్రపక్షాలను బట్టే అంచనా వేయొచ్చు. మూర్ఖపు దేశాలు, క్రూరమైన పాలకులు, నర హంతక నియంతలను ప్రోత్సహించే దేశమేదీ బాగుపడదు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.
 
సిరియాలో రసాయన ఆయుధాలు లేకుండా చేస్తామని 2013లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రపంచానికి హామీ ఇచ్చారని.. ఆ విషయంలో ఘోరంగా విఫలమయ్యారనడానికి తాజా రసాయన దాడులే నిదర్శనమని ఆరోపించారు. కాగా, సిరియాపై అమెరికా వైమానిక దాడులను దురాక్రమణ చర్యగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అభివర్ణించారు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ చేసిన ఈ దాడులపై ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా భేటీ కావాలని డిమాండ్‌ చేశారు. సిరియాలోని డౌమాలో రసాయన దాడులు జరగలేదని, రసాయన దాడుల నెపంతో అమెరికా, దాని మిత్ర పక్షాలు దాడులకు తెగబడడం సరికాదన్నారు.
 
మరింత గట్టిగా పోరాడతాం: అసద్‌
తమ సైనిక స్థావరాలే లక్ష్యంగా పాశ్చాత్య దేశాలు చేసిన దాడులు.. ప్రత్యర్థులపై మరింత గట్టిగా పోరాడాలన్న విషయాన్ని తెలియజేశాయని సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ అన్నారు. క్షిపణి దాడులు అనాగరికమైన, క్రూరమైన, దురాక్రమణ దాడులని అసద్‌ కార్యాలయం పేర్కొంది.
 
 
అమెరికా దురంహకారాన్నీ కూల్చేశాం: సిరియన్లు
డమాస్కస్‌ : అమెరికా దాడులపై సిరియన్లు భగ్గుమన్నారు. అధ్యక్షుడు అసద్‌కు మద్దతుగా పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. దాడులు జరిగిన వెనువెంటనే సిరియా, రష్యా, ఇరాన్‌ జాతీయ పతాకాలను చేతబూని ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ‘అమెరికా క్షిపణులనే కాదు.. దాని దురంహకారాన్నీ కూల్చేశాం’, ‘ట్రంప్‌ క్షిపణులకు భయపడబోం’ అంటూ నినదించారు. లక్షలాది సిరియన్లు ర్యాలీ తీశారు. వాహనాల హారన్లు మోగిస్తూ, సిరియా జాతీయ పతాకాలతో విజయసంకేతం చూపుతూ వీధుల్లో తిరిగారు.
 
 
 
 
సిరియాపై ట్రంప్‌ దాడులకు మిశ్రమ స్పందన
సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌ సొంత ప్రజలపైనే రసాయన దాడులకు దిగడానికి ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున అమెరికా వైమానిక దాడులు చేసింది. ట్రంప్‌ చర్యలను రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధులు సమర్థించారు. డెమొక్రాట్లు మాత్రం రష్యాపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అసద్‌ అరాచకాలపై ఆగ్రహంతో ఉన్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ కూడా అమెరికాతో చేతులు కలిపాయి. రసాయన ఆయుధాలను విచ్చలవిడిగా వాడొచ్చన్న భావననే తాము సహించబోమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ అన్నారు. అసద్‌పై బలప్రయోగం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే వ్యాఖ్యానించారు. సిరియాపై దాడులకు యూరోపియన్‌ కౌన్సిల్‌ మద్దతు తెలిపింది. దాడులు సబబేనంటూ కెనడా, ఇజ్రాయెల్‌, టర్కీ దేశాలు అమెరికా చర్యలను స్వాగతించాయి. అంతర్జాతీయ సమాజంలో శాంతి, భద్రతలకు సిరియా పెనుముప్పుగా మారిందని ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటానియో గ్యుటెరిస్‌ వ్యాఖ్యానించారు. అసద్‌ ప్రభుత్వం మరిన్ని రసాయన దాడులకు దిగకుండా పశ్చిమదేశాల ప్రతీకారదాడులు కట్టడి చేయొచ్చని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సిరియాపై దాడులకు అమెరికా, దాని మిత్రదేశాలు మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది. దాడి నేరపూరిత చర్యేనని పేర్కొన్నారు. అమెరికా, దాని మిత్ర దేశాలు దాడులు దిగడాన్ని చైనా తప్పుబట్టింది.
 
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe