Breaking News

హృదయాన్ని ద్రవింపచేసిన కఠువా ఘటన

Apr 14, 2018 20:15 by Admin Admin

 ఆడపిల్లల జోలికి వెళ్తే బహిరంగంగా తోలు తీయాలి. జమ్మూ కశ్మీర్‌ కఠువాలో ముక్కుపచ్చలారని బాలికపై మానవ మృగాలు చేసిన అత్యాచారం, హత్య హృదయాన్ని ద్రవింపజేసింది. అభం శుభం తెలియని చిన్నారులు, ఏ ఆసరాలేని మహిళలు, ఉద్యోగాలు చేసుకునే ఆడబిడ్డలకు రక్షణ లేని పరిస్థితులు వచ్చాయి’’ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహావేదన వ్యక్తం చేశారు. మహిళను కాపాడుకునేందుకు హింస తప్పదన్నారు. కఠువా, యూపీ ఘటనలను నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం ఎదుట మౌన ప్రదర్శన చేశారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన మహిళా విభాగం ‘వీర మహిళ’ ప్రతినిధులు, విద్యార్థులు, యువతీ యువకులతో పవన్‌ మాట్లాడుతూ, ఇది మానవత్వంపై జరిగిన దాడి అని అన్నారు.

 
‘‘కఠువా ఘటన ఇదే మొదటిదికాదు. మన వ్యవస్థలో దుర్ఘటన జరిగితేనేగాని చలనం రాదు. నిర్భయ చట్టం కూడా ఢిల్లీలో అత్యాచారం జరిగాక వచ్చింది. ఢిల్లీలో జరిగితేనే ఎంపీలు స్పందిస్తారా? ఈ ఘటనపై ప్రధానితో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ స్పందించాలి. ఈ ఘటనకు కుల మతాలను అంటకట్ట కూడదు. ఆడ పిల్లల్ని వేధించే ఈవ్‌ టీజర్లు, అత్యాచారానికి ఒడిగట్టేవాళ్లని బహిరంగంగా శిక్షించాలి. సింగపూర్‌ తరహా శిక్షలు రావాలి. ఈ మధ్యనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి మర్మాంగాలు కోసేయాలి అన్నారు. బహిరంగ శిక్షలతోనే అందరిలోనూ భయం పుడుతుంది. కొన్నేళ్ల కిందట ఓ షూటింగ్‌లో ఆడపిల్లలను పోకిరీల నుంచి కాపాడేందుకు నేను కర్ర పట్టుకోవాల్సి వచ్చింది. 2004లో ఎన్‌జీఓ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్‌ కలసినప్పుడు నా సహాయం అందించాను’’ అని పవన్‌ వివరించారు. నటి శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయంపై రోడ్లపై నిరసన చేయడం మంచిది కాదని, పోలీస్‌ స్టేషన్‌లో అన్యాయం చేసిన వారి పేర్లతో ఫిర్యాదు చేయాలని సూచించారు. కాగా, అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని జనసేన కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీం ఇచ్చిన తీర్పు బాధాకరమని ఓ ప్రకటనలో పవన్‌ పేర్కొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe