Breaking News

మెడల్స్‌ వేటలో!

Apr 14, 2018 20:21 by Admin Admin

 మనికా బాత్రా.. టేబుల్‌ టెన్నిస్‌లో ఇప్పుడో సంచలనం. కామన్వెల్త్‌ క్రీడ ల్లో బాత్రా సాధిస్తున్న ఒక్కో పతకంతో ఆమె పేరు మార్మోగుతోంది. ఇలాంటి మెగా ఈవెంట్‌లో ఒక్క పతకం వస్తేనే గొప్పగా భావిస్తాం. అలాంటిది బాత్రా అలవోకగా మూడు పతకాలు పట్టేసింది. అందులో రెండు స్వర్ణాలు.. ఒక రజతం ఉన్నాయి. వాటిలో వేటికవే ప్రత్యేకం. ప్రతీ పతకం నెగ్గేందుకు.. తన కలను నెరవేర్చుకునేందుకు.. ఆసీస్‌ గడ్డపై త్రివర్ణాన్ని రెపరెపలాడించేందుకు మనికా చేసిన పోరాటం అనన్యసామాన్యం. మరీ ముఖ్యంగా నాలుగు సార్లు స్వర్ణ విజేత, డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన సింగపూర్‌తో జరిగిన టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో సారథిగా జట్టును ముందుండి గెలిపించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

 
డబుల్స్‌ రజతానికే పరిమితమైనా మౌమా దాస్‌తో కలిసి ఫైనల్లో స్వర్ణం కోసం ఆమె ఆఖరి వరకూ పట్టువిడవకుండా పోరాడి ఆకట్టుకుంది. ఇప్పుడు సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచే క్రమంలో సెమీ్‌సలో ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ను ఓడించి.. తుదిపోరులో తనకంటే మెరుగైన ప్లేయర్‌ను మట్టికరిపించి బంగారు పతకం నెగ్గడం ఆమె ప్రతిభకు నిదర్శనం. గత కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళా ప్యాడ్లర్లు ఒట్టి చేతులతో తిరిగొస్తే.. ఇప్పుడు మూడు పతకాలు తెచ్చారంటే అది బాత్రా చలవే. సాధించాలన్న ఆమె తపనకు.. మెడల్స్‌ సలాం కొట్టాయనడంలో అతియోశక్తి లేదు. ఎందుకంటే.. ఈ ఆటన్నా.. దేశానికి ప్రాతినిథ్యం వహించడమన్నా.. మనికాకు అంత ఇష్టం... ప్రాణం..!
 
 
అక్కను చూసి రాకెట్‌ పట్టి..
కొన్నాళ్లుగా భారత టీటీలో అప్రతిహతంగా దూసుకెళ్తున్న మనికా పుట్టింది దేశ రాజధాని ఢిల్లీలో. నాలుగేళ్ల వయసులోనే ఆమె టీటీ రాకెట్‌ పట్టుకుంది. తన అక్క, అన్న అప్పటికే టీటీ ప్లేయర్లు కావడంతో వారి ప్రభావం ఆమెపై పడింది. కెరీర్‌ ఆరంభంలో అక్క ఆంచల్‌ ఆమెను ప్రభావితం చేసింది. ఆమె అందించిన ప్రోత్సాహంతో టీటీలో బుడిబుడి అడుగులు వేసిన బాత్రా.. రాష్ట్రస్థాయిలో అండర్‌-8 టోర్నమెంట్‌లో మ్యాచ్‌ నెగ్గిన తర్వాత ఈ ఆటే తన కెరీర్‌ అని డిసైడైంది. కోచ్‌ సందీప్‌ గుప్తా అకాడమీలో చేరింది. 2011లో జరిగిన చిలీ ఓపెన్‌ ఐటీటీఎఫ్‌ టోర్నీ అండర్‌-21 విభాగంలో నాటి ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ కసుమి ఇషివకా (జపాన్‌)ను ఓడిస్తూ రజతం నెగ్గడంతో బాత్రా ప్రతిభ ఏపాటిదో అందరికీ తెలిసింది. ఆటతో పాటు అందం కూడా ఉండడంతో టీనేజ్‌లో పలు మోడలింగ్‌ సంస్థల నుంచి బాత్రాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఒప్పుకొంటే డబ్బుతో పాటు మరెంతో స్టార్‌ స్టేటస్‌ వచ్చే అవకాశం ఉన్నా, ఆటపై మమకారంతో మనికా అన్ని ఆఫర్లనూ తిరస్కరించింది.
 
 
పోరాట యోధురాలు..
ఆటపై అమితమైన ప్రేమ.. లక్ష్యాన్ని అందుకోవాలంటే కష్టపడడం ఒక్కటే మార్గమన్నది మనికా సిద్ధాంతం. ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటాన్ని వదలకపోవడం ఆమె బలం. అలా ముందుకెళ్లిన ఆమె 2013, 14, 15లో వరుసగా మూడేళ్ల పాటు జాతీయ యూత్‌ చాంపియన్‌గా కొనసాగింది. 2015లో సీనియర్‌ చాంపియన్‌షి్‌ప.. 2016లో భారత టాప్‌ ర్యాంక్‌ అందుకుంది. కామన్వెల్త్‌ టీటీ చాంపియన్‌షి్‌ప్స (2015)లో రెండు స్వర్ణాలు సహా మూడు పతకాలు.. స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు ఆమె కెరీర్‌లో పెద్ద విజయాలు. మహిళల సింగిల్స్‌లో సహచరి మౌమా దాస్‌ చేతిలో ఓడిపోకపోయి ఉంటే.. దక్షిణాసియాలో నాలుగు విభాగాల్లో ఆమే చాంపియన్‌గా నిలిచేది. అయితే, సింగిల్స్‌లో తన ప్రియ ప్రత్యర్థి అయిన మౌమా దాస్‌తో డబుల్స్‌లో బాత్రా పతకం పంచుకుంటుండడం విశేషం. తన కెరీర్‌ ఎదుగుదలలో మౌమా పాత్ర కూడా ఉన్నదని మనికా చెబుతుంటుంది. ఇక, రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయి తీవ్రంగా నిరాశ పరిచింది. బాత్రా స్థానంలో మరెవరైనా ఉంటే ఈ ఓటమితో కుంగిపోయేవారే. కానీ, రియో తర్వాత మనికాలో గెలవాలన్న కసి.. సాధించాలన్న తపన మరింత పెరిగింది. ఫలితమే గోల్డ్‌కోస్ట్‌లో చిరస్మరణీయ విజయాలు. మోడలింగ్‌ ఆఫర్లు.. చదువును సైతం పక్కనబెట్టి ఇష్టమైన ఆటలో ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన బాత్రా పేరు భారత టీటీలో నిలిచిపోవడం ఖాయం.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe