Breaking News

తమిళులకే పదవులు దక్కాలని వాదన

May 14, 2018 00:19 by Admin Admin

 

తమిళ సినీ పరిశ్రమలో గత మూడేళ్లుగా సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న నటుడు విశాల్‌పై మరోమారు ఇండస్ర్టీలో ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికల్లో సంచలన విజయాలు సాధించిన విశాల్‌పై తొలి నుంచి సదరు వర్గం వ్యతిరేకంగానే వ్యవహరిస్తోంది. తాజాగా విశాల్‌ స్థానికతను ఎత్తిచూపుతూ తమిళ సినిమాలోని అన్ని సంఘాల్లో పదవులు తమిళులకే దక్కాలన్న వాదనను మరోమారు తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు నడిగర్‌ సంఘం మునుపటి ప్రధాన కార్యదర్శి రాధారవి, ఆయన మద్ధతుదారులతోపాటు దిగ్గజ దర్శకుడు భారతీరాజా, టి.రాజేందర్‌లతో కూడిన అసంతృప్తి వర్గం  చెన్నైలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
 
     ఆ సందర్భంగా భారతీరాజా మాట్లాడుతూ... తమిళ సినీ నిర్మాతల సంఘం తమిళ నిర్మాతల చేతుల్లోకి రావాలని, దక్షిణ భారత నడిగర్‌ సంఘం, దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి పేర్లను తమిళ నడిగర్‌ సంఘం, తమిళ సినీ వాణిజ్య మండలిగా మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు. రాధారవి మాట్లాడుతూ.. పెద్ద సినిమాలు 200కు పైబడ్డ థియేటర్లలో మాత్రమే విడుదలవుతాయని చెప్పిన విశాల్‌... తన సినిమా (ఇరుంబుతిరై)కి మాత్రం 300కుపైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ఎందుకు అనుమతిచ్చారని ప్రశ్నించారు. రెండు సంఘాలకు నాయకుడిగా ఉన్న విశాల్‌ ఇటువంటి చర్యలకు పాల్పడడం తగదన్నారు. ఏడాదిలోపు వాగ్దానాలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన విశాల్‌ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని రాధారవి మరో ప్రశ్న లేవనెత్తారు. మరో నిర్మాత కె.రాజన్‌ మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో విశాల్‌ చేసిన హామీలు ఏవీ నెరవేర్చలేదని, నిర్మాతల మండలికి మళ్లీ ఎన్నికలు జరిపి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని డిమాండ్‌ చేశారు. టి.రాజేందర్‌ మాట్లాడుతూ... నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్‌ అవినీతిక పాల్పడ్డారని, తన ఇష్టానుసారం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe