Breaking News

మాపై ఎందుకు చిన్న చూపు?

Mar 12, 2018 19:48 by Admin Admin

దక్షిణాది రాష్ట్రాల పన్నులతో ఉత్తరాది రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. దక్షిణ భారతదేశం నుంచి పన్నుల రూపంలో డబ్బులు కేంద్రానికి ఎక్కువగా వస్తాయని... కేంద్రం మాత్రం ఉత్తర భారతదేశానికే ఎక్కువ ఖర్చు చేస్తోందని తెలిపారు. ‘మీరు అభివృద్ధి చెందుతున్నారు’ అంటూ రాష్ట్రానికి సహాయం చేయకపోవడం సరికాదన్నారు.

 
రాష్ట్ర విభజన జరిగిన తీరు బాధాకరమని... ఆ తర్వాత రాష్ట్రంపై చిన్నచూపు చూస్తుంటే మరింత బాధ వేస్తోందని అన్నారు. జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకోరాదని, జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. బీజేపీ కూడా కాంగ్రె్‌సలాగా చేస్తే ఏమాత్రం మంచిది కాదన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం శానసమండలిలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన 18 హామీలను అమలు చేయాల్సిందే అని పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ తీరును దునుమాడారు. ‘‘హక్కుల కోసం పోరాడతాం. రాజీ పడేది లేదు. ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో పేర్కొన్నవన్నీ సాధించేదాకా వెనక్కి తిరిగి చూసేది లేదు. ఎంతదాకానైనా వెళతాం’’ అని ఉద్ఘాటించారు. ఆయా అంశాలపై ఆయన మాటల్లోనే...
 
 
మాకు రాజధాని వద్దా?
తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు ఉన్నట్లుగా నవ్యాంధ్రకు కూడా ఒక రాజధాని నగరం కావాలి. రాజధానికి రూ.1500 కోట్లు ఎలా సరిపోతాయి? ఏపీకి రాజధాని అవసరంలేదా? హైదరాబాద్‌, బెంగుళూరులో ఎన్నో పరిశోధన సంస్థలున్నాయి. అదేవిధంగా ఏపీకి ఉదారంగా కేంద్ర సంస్థలు ఎందుకు మంజూరు చేయరు? ఏపీ భారతదేశంలో భాగం కాదా? కేంద్రం ఇచ్చిన నిధులకు యూసీలు పంపలేదనడం సరికాదు. రాజధాని నిధులపై యూసీలు పంపాం. దీనిని నీతి ఆయోగ్‌ ధ్రువీకరించింది. ఒక అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మాణం చేస్తాం. అవసరమైతే శ్రమదానం చేసైనా, త్యాగాలు చేసైనా ఒక ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తాం. తెలుగు వారంటే ఏమిటో నిరూపిస్తాం. ఏపీ ప్రజలు కష్టపడతారు. మా కష్టం ఎక్కడికీ పోదు. ప్రధాని మోదీ తిరుపతి సభలో... కాంగ్రెస్‌ పార్టీ తల్లిని చంపి బిడను బతికించిందని అన్నారు. తల్లిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
 
సెంటిమెంటుతో రాష్ట్రం ఇచ్చారుగా?
సెంటిమెంట్‌తో నిధులు రావని అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించడం బాధాకరం. ఏం... తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ కోసం రాష్ట్రాన్ని విభజించలేదా? ప్రత్యేక హోదా ఏపీ హక్కు. అది రాష్ట్రానికి ఇచ్చి తీరాల్సిందే. ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వలేమని జైట్లీ నిర్మొహమాటంగా ప్రకటించారు. అందుకే కేంద్రం నుంచి వైదొలిగాం. కేంద్రంలో పదవుల కోసం టీడీపీ ఎప్పుడూ ఆరాటపడలేదు. హోదా ఉన్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు పొడిగించారు. అలాగే ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వరు? ప్రత్యేక హోదా ఇవ్వకూడదని తాము చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు గోవిందరావు స్పష్టం చేశారు. కేంద్రం చట్టాన్ని గౌరవించాలి. హామీలను నిలబెట్టుకోవాలి. రాష్ట్రాన్ని అహేతుకంగా విభజించారు కాబట్టి... హోదా అనేది ఒక హక్కు! హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ ఇప్పుడు ఎదురుదాడి చేయడం సరికాదు. కేంద్రం ఏపీని ఆదుకోవాల్సింది పోయి ఇప్పటికీ మాటలే చెబుతోంది.
 
 
మీరే వెక్కిరిస్తారా?
బీజేపీ నేతలు హామీలు నెరవేర్చకుండా ఎదురుదాడి చేస్తున్నారు. సిమెంటు రోడ్లకు ‘మా డబ్బులు ఇచ్చాం’ అంటున్నారు. మా డబ్బులు, మీ డబ్బులు అని ఏవీ ఉండవని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడి ప్రజలు పన్నులు కడితే 42 శాతం వాటా రాష్ట్రానికి ఇస్తారు. కేంద్రం 58 శాతం పెట్టుకుంటుంది. దక్షిణాది నుంచి వసూలయ్యే పన్నులే ఎక్కువ. కేంద్రం మాత్రం ఉత్తర భారతదేశంలో ఎక్కువ నిధులు ఖర్చు చేస్తోంది. ఏపీలో జాతీయ రహదారులు వేస్తున్నామని కేంద్ర మంత్రి గడ్కరీ చెబుతున్నారు. కానీ... అవన్నీ పీపీపీ పద్ధతిలో వస్తున్నవేనని ఆయన ఎందుకు చెప్పరు? కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరితే వెక్కిరిస్తున్నారు. కాంగ్రెస్‌ చేసిన తప్పునే బీజేపీ కూడా చేస్తాననడం సరికాదు. విభజన చట్టంలోని లోపాలవల్ల ఎంతో నష్టపోతున్నాం. రాష్ట్రంలో ఉన్న పలు పరిశ్రమల నుంచి రావాల్సిన ఆదాయం కూడా తెలంగాణకు వెళ్తోంది. కృష్ణపట్నంపోర్టు వల్ల ఆదాయమూ కోల్పోతున్నాం.
 
వైసీపీది ద్వంద్వ వైఖరి
ప్రతిపక్ష వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. మోదీపై విశ్వాసం ఉందంటూనే ఆయన ప్రభుత్వంపై అవిశ్వాసం ఎలా పెడతారు? అవిశ్వాసానికి టీడీపీ మద్దతివ్వాలనడం హాస్యాస్పదం. ఏం చేయాలో మాకు బాగా తెలుసు. రాష్ట్రంలో 50 ప్రాజెక్టులను జూన్‌లోగా పూర్తి చేస్తాం. కేంద్రం వల్లే 24 గంటల కరెంటు వస్తోందని బీజేపీ చెబుతోంది. దేశంలో విద్యుత్‌ సంస్కరణలు తెచ్చిందే ఏపీ. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అమలు చేస్తున్న తొలిరాష్ట్రమూ ఏపీనే అని సీఎం అన్నారు.
 
ఇవన్నీ ఏమయ్యాయి?
ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామన్నారు. అది ఏమైంది? ఇప్పుడు... ఏపీని బిహార్‌, యూపీలతో పోల్చుతున్నారు. ఇదేం పద్ధతి? రాష్ట్రానికి రూ.16,700 కోట్లు లోటుంటే రూ.4వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. లోటునూ వివాదం చేశారు. విశాఖ రైల్వేజోన్‌ ఎందుకు ఇవ్వడంలేదు? రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఊసే లేదు. జాతీయ విద్యాసంస్థలకు నాలుగేళ్లలో ఇచ్చింది రూ.400 కోట్లే. ప్రైవేట్‌ వ్యక్తులకు భూములిస్తే ఆరు నెలల్లో పనులు ప్రారంభించారు. కేంద్రం మాత్రం భూములిచ్చినా పనులు మొదలు పెట్టలేదు. చట్టంలో ఉన్నా అసెంబ్లీ సీట్లు పెంచడం లేదు. విజయవాడ, విశాఖ మెట్రోరైలు సాధ్యం కాదన్నారు. కడప ఉక్కు కర్మాగారాన్ని పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం చేపడుతుందని చెప్పింది. ఇప్పటి వరకూ రూ.5349 కోట్లు ఇచ్చారు. చేసిన ఖర్చులన్నింటికీ యూసీలు ఇచ్చాం.
 
 
బాధ్యత బీజేపీదే!
మేము కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకున్నా ఎన్డీయేలో ఉన్నాం. మా నాయకుడు ఎన్టీ రామారావు ఆంధ్రులకు ఆత్మగౌరవమిస్తే, నేను ఆత్మ విశ్వాసం ఇస్తున్నాను. రాష్ట్ర విభజన చేసిన తీరు ఆవేదనకు గురిచేసింది. ప్రజలు నిరాశకు గురి కాకుండా అనేక చర్యలు తీసుకున్నాం. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్లమెంట్‌ సాక్షిగా విభజన చేశాయి. న్యాయం చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని పదే పదే చెప్పాను.
 
 
ఏమిటా సెంటిమెంట్‌
సెంటిమెంట్‌తో నిధులు రావని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించడం బాధాకరం. ఏం... తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ కోసం రాష్ట్రాన్ని విభజించలేదా? ప్రత్యేక హోదా ఏపీ హక్కు. అది రాష్ట్రానికి ఇచ్చి తీరాల్సిందే. ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వలేమని జైట్లీ నిర్మొహమాటంగా ప్రకటించారు. అందుకే కేంద్రం నుంచి వైదొలిగాం.
 
 
మనమేంటో చూపిస్తాం
రాజధాని నిధులపై యూసీలు పంపాం. దీనిని నీతి ఆయోగ్‌ ధ్రువీకరించింది. ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తాం. అవసరమైతే శ్రమదానం చేసైనా, త్యాగాలు చేసైనా ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తాం. తెలుగు వారంటే ఏమిటో నిరూపిస్తాం. మోదీ తిరుపతి సభలో... కాంగ్రెస్‌ తల్లిని చంపి బిడ్డను బతికించిందని అన్నారు. ఇప్పుడు ఆ తల్లిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe