Breaking News

ఆ నిర్ణయంలో మార్పు లేదు

Mar 12, 2018 19:49 by Admin Admin

నవ్యాంధ్రకు రైల్వే జోన్‌ ఇవ్వలేమని కేంద్ర రైల్వే బోర్డు తెగేసి చెప్పింది. ‘అసలు రైల్వేజోన్‌తో ఏమొస్తుంది? ఒక జనరల్‌ మేనేజర్‌ కొత్తగా కూర్చుంటారు. మరికొందరు ఉద్యోగులు వస్తారంతే!’ అని వితండవాదం వినిపించింది. ‘మీకు రైల్వేజోన్‌ కావాలా? రైల్వే లైన్‌ కావాలా?’ అని ప్రశ్నించింది. ఇదొక్కటే కాదు... రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపైనా కేంద్రం నుంచి అంత ఆశాజనకమైన స్పందన రాలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న హామీల అమలు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గాబాతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీకి సంబంధించి 14 అంశాలతో కూడిన 23 పేజీల నివేదికను కేంద్రానికి అందించారు. రైల్వే జోన్‌ విషయానికి వచ్చేసరికి, ఇది సాధ్యం కాదని గతంలో ఇచ్చిన నివేదిక గురించి కేంద్రం గుర్తు చేసింది. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పడి తీరాలని, కేంద్రం మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు గట్టిగా అడిగారు. అలాగైతే ఆ రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాల్సింది కేంద్ర హోంమంత్రే అని బోర్డు చైర్మన్‌ చెప్పారు. నెలరోజుల్లో హోం మంత్రివద్ద సమావేశం ఏర్పాటు చేద్దామని, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా పిలుద్దామని అన్నారు. దుగరాజపట్నం పోర్టు ఆర్థికంగా లాభదాయకం కాదనడంతో, దానికి ప్రత్యామ్నాయంగా రామాయపట్నంలో పోర్టును ఏర్పాటు చేయాలని సీఎస్‌ కోరారు. కడపలో ఉక్కు కర్మాగారంపై మెకాన్‌ సంస్థ త్వరలోనే తుది ఏపీ అధికారులు స్పందిస్తూ... మరోసారి టాస్క్‌ఫోర్స్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నివేదిక ఇస్తుందని సంబంధిత శాఖ అధికారులు అన్నారు.

కాకినాడ వద్ద ప్రతిపాదించిన పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌కు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌గా రాష్ట్రం నుంచి రూ.5,600 కోట్లు ఇవ్వాలని కేంద్రం అడుగుతోంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 14శాతం కట్టాలంటోంది. అసోం, రాజస్థాన్‌లలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటుచేశామని, అక్కడ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం వ్యయంలో 14శాతం వ్యయం భరించాయని కేంద్ర ప్రతినిధులు పేర్కొన్నారు. ఒకవేళ అలా కట్టాల్సి వస్తే దాన్ని 12శాతానికి తగ్గించాలని రాష్ట్ర ప్రతినిధులు కోరినట్లు తెలిసింది. ఆ 12శాతం కూడా కేంద్రం వడ్డీలేని అప్పుగా ఇవ్వాలని, 15 ఏళ్ల తర్వాత దాన్ని వాయిదాల పద్దతిలో తీరుస్తామని పేర్కొన్నారు. దీనిపై ఆర్థికశాఖకు లేఖ రాయాలని హోం కార్యదర్శి సూచించారు. దీనిపై వీలైతే మంగళవారమే ముఖ్యమంత్రి లేఖ రాసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఐఐఎం తదితర సంస్థలకు సంబంధించిన భవన నిర్మాణాలు కూడా మొదలుపెట్టలేదని రాష్ట్ర ప్రతినిధులు పేర్కొన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత శాఖలను హోం కార్యదర్శి ఆదేశించారు.
 
అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, విశాఖపట్నం జిల్లాలో గిరిజన వర్సిటీ కోసం కేబినెట్‌ నోట్‌ వెళ్లిందని... కేంద్ర మంత్రి మండలి దాన్ని ఆమోదించాక లోక్‌సభకు బిల్లు వస్తుందని చెప్పారు. ఈలోపు తాత్కాలికంగా తరగతులు ప్రారంభించాలని సీఎస్‌ కోరారు. పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల్లో 25 ఎకరాలు వివాదాల్లో ఉందని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ఆ సమస్యను పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.
 
జాతీయ కారిడార్‌లో భాగంగా...
రాష్ట్రంలో విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌తో పాటు మరో కారిడార్‌ ఏర్పాటుపైనా చర్చ జరిగింది. వీటిని నేషనల్‌ కారిడార్‌లో భాగంగా తీసుకుంటామని కేంద్ర ప్రతినిధులు చెప్పారు. అలా నేషనల్‌ కారిడార్‌లో భాగమైతే 51శాతం నిధుల్ని కేంద్రం, 49 శాతం రాష్ట్రం పెట్టాల్సి ఉంటుంది. ఇది కొంతమేర రాష్ట్రానికి వెసులుబాటుగానే ఉంటుందని సూచించారు. దీనిపై తమ ముఖ్యమంత్రితో మాట్లాడతామని రాష్ట్ర ప్రతినిధులు తెలిపారు. ఈ కారిడార్‌ విషయంలో కొంత పురోగతి ఉందని, రెండు నోడ్స్‌కు సంబంధించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర అధికారులు తెలిపారు.
 
ఆ వెయ్యి కోట్లు తీసేయండి...
రాజధాని నిర్మాణానికి ఇచ్చామంటున్న 2500 కోట్లలో... గుంటూరు, విజయవాడలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ఇచ్చిన రూ.1000 కోట్లు కూడా చేర్చారని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. వాటిని రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధుల్లో చేర్చవద్దని కోరారు. ఇక జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిర్మాణాన్ని జాతీయ భవన నిర్మాణాల సంస్థ (ఎన్‌బీసీసీ)కి అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే సమావేశం కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఉంటుందని సీఎస్‌ విలేకరులకు చెప్పారు.
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe