Breaking News

కుడి కంటి కార్నియా దెబ్బతింది

Mar 12, 2018 19:50 by Admin Admin

 అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు తొలిరోజే రణరంగాన్ని తలపించాయి. ఉభయ సభల సమావేశంలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగాన్ని కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుకున్నారు. వారిని నిలువరించడానికి మార్షల్స్‌ రంగంలోకి దిగారు. ఈ ఆందోళన మధ్యలోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ ఫోన్‌ విసిరేశారు. అది కాస్తా గవర్నర్‌ పక్కనే కూర్చున్న మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు తగిలింది. ఆయన కుడి కంటికి గాయమైంది. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియ్‌సగా తీసుకుంది. కోమటిరెడ్డి సహా ఇతర కాంగ్రెస్‌ నేతలపై చర్యలు తీసుకునే దిశగా యోచిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించడం ఆనవాయితీ. దాంతో, గవర్నర్‌ నరసింహన్‌ను స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోడ్కొని వచ్చారు.

 
అయితే, ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా, 10:03 గంటలకు గవర్నర్‌ వచ్చారు. మూడు నిమిషాల ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. ‘నో డిసిప్లిన్‌’ అంటూ కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలు చేశారు. జాతీయ గీతాలాపన అనంతరం గవర్నర్‌ తన ప్రసంగం ప్రారంభించారు. కాంగ్రెస్‌ సభ్యులంతా ప్లకార్డులు పట్టుకొని.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ 10:10 గంటలకు నినాదాలు చేయడం ప్రారంభించారు. రెండు నిమిషాల్లోనే పోడియం ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నించారు. వారు పోడియంలోకి రాకుండా దాదాపు 40 మందికిపైగా మార్షల్స్‌ అడ్డుగా నిల్చున్నారు. దాంతో, గవర్నర్‌ ప్రసంగం తెలుగు, ఆంగ్లం కాపీలను ముక్కలు చేసిన కాంగ్రెస్‌ సభ్యులు.. తాము ఉన్నచోటు నుంచే వాటిని గాల్లోకి విసిరారు. మరో సభ్యుడు తన కళ్లజోడును విసిరేశారు. అవి గవర్నర్‌ వైపు వెళ్లకుండా సూట్‌ కేసులు, చేతులతో మార్షల్స్‌ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళం కొనసాగుతుండగానే, పార్టీ సభ్యుల మధ్యలో నిలుచున్న కాంగ్రెస్‌ పక్ష ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి 10:18 గంటల సమయంలో తన ఎడం చేత్తో హెడ్‌ ఫోన్‌ను విసిరారు.
 
అది కాస్తా గాల్లో ఎగురుకుంటూ వచ్చి స్వామిగౌడ్‌కు తగిలింది. అయినా, గవర్నర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దాంతో, కాంగ్రెస్‌ సభ్యులు నిరసన స్వరాన్ని మరింత పెంచారు. ఈ క్రమంలోనే, కాంగ్రెస్‌ సభ్యులకు, మార్షల్స్‌కు మధ్య తోపులాట జరిగింది. మార్షల్స్‌ అడ్డుకోవడంతో కొందరు కాంగ్రెస్‌ సభ్యులు తమ సీట్ల వద్దనే ఉండిపోయారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని, ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలంటూ నినాదాలతో సభను హోరెత్తించారు. వారి ఆందోళన కొనసాగుతుండగానే, కాంగ్రెస్‌ పక్ష నేత జానారెడ్డి బయటికి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళనల మధ్యే గవర్నర్‌ తన ప్రసంగాన్ని పదిన్నరకు ముగించారు. అనంతరం, జాతీయ గీతాలాపనతో కాంగ్రెస్‌ సభ్యులు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత గవర్నర్‌ను కట్టుదిట్టమైన భద్రత నడుమ బయటికి తీసుకెళ్లారు. కాగా, ఇటు కాంగ్రెస్‌ నిరసన, అటు గవర్నర్‌ ప్రసంగం కొనసాగుతుండగానే.. 10:20 గంటల సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, ఎన్‌వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్‌, ఎమ్మెల్సీ రాంచందర్‌రావులు గవర్నర్‌ ప్రసంగాన్ని బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్వామిగౌడ్‌ను సరోజినీ కంటి ఆస్పత్రికి తరలించారు.
 
ఆరంభం నుంచే ఆందోళన
గవర్నర్‌ ప్రసంగాన్ని బహిష్కరించి కాంగ్రెస్‌ సభ్యులు నిరసన వ్యక్తం చేయనున్నారనే సమాచారంతో ఉదయం 9 గంటల సమయంలోనే మార్షల్స్‌ స్పీకర్‌ పక్కన ఉన్న భాగంలో అప్రమత్తంగా నిల్చున్నారు. ఉదయం 10 గంటలకు వచ్చీ రాగానే కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. గవర్నర్‌ ఆలస్యంగా రావడంతో ఆయన సభలో అడుగు పెడుతుండగానే ‘నో డిసిప్లిన్‌’ అంటూ నినదించారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన కొనసాగించారు. సభలో ఉన్న మార్షల్స్‌కు తోడు బయటి నుంచి మరింత మంది రావడంతో కాంగ్రెస్‌ సభ్యులు వారితో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్‌ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందు వరుసగా ఉండగా.. కోమటిరెడ్డి ఆయన పక్కనే ఉంటూ నినాదాలు చేశారు. వెంకట్‌రెడ్డి ప్రసంగ ప్రతులను విసిరేస్తూ ఆందోళన చేపట్టగా.. ఉత్తమ్‌ నినాదాలతో హోరెత్తించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe