Breaking News

పైలట్‌ తప్పిదమే కారణమా

Mar 12, 2018 19:50 by Admin Admin

బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విమానం నేపాల్‌ రాజధాని కాఠ్మండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ ఘటనలో 50 మంది మరణించినట్లు సమాచారం. విమానంలో మొత్తం 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఢాకా నుంచి కఠ్మాండూ వస్తున్న అమెరికా-బంగ్లా గ్రూప్‌(యూబీజీ) విమానం బొంబార్డర్‌ డాష్‌ 8 క్యూ 400.. సోమవారం ల్యాండ్‌ అవుతున్న సమయంలో బ్యాలెన్స్‌ తప్పి కూలిపోయింది. 31 మంది అక్కడికక్కడే మరణించారు. 9 మంది ఆసుపత్రుల్లో చేర్పించిన తరువాత చనిపోయారు.

అసలేం జరిగింది?
ఢాకా నుంచి మధ్యాహ్నం 2 గంటల వేళ యూబీజీ విమానం త్రిభువన్‌ విమానాశ్రయం వద్దకు చేరింది. గగనతలం నుంచే పైలట్‌ అబిద్‌ సుల్తాన్‌ గ్రౌండ్‌ కంట్రోల్‌ను సంప్రదిస్తూ ల్యాండింగ్‌ హేంగర్‌ గురించి వాకబు చేశాడు. వెంటనే అనుమతి దొరక్కపోవడంతో ఓ రెండు రౌండ్లు గాల్లోనే చక్కర్లు కొట్టాడు. కంట్రోల్‌ రూం సిబ్బంది చివరకు ఏర్‌పోర్ట్‌ దక్షిణం వైపు నుంచి ల్యాండ్‌ అవ్వాలని సంకేతాలిచ్చినా పైలట్‌ ఉత్తరం వైపు నుంచి దింపడానికి ప్రయత్నించాడు. దిగుతున్న సమయంలోనే విమానం అటూ ఇటూ వూగుతూ వచ్చింది. పూర్తిగా బ్యాలెన్స్‌ కోల్పోయి ఒరుగుతూ వెళ్లి ఓ ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లోకి దూసుకెళ్లింది. వెంటనే నిప్పంటుకుంది. 30 మందికి పైగా అందులోనే సజీవంగా దహనమయ్యారు. పొరపాటున రాంగ్‌ డైరెక్షన్‌లో దింపడం వల్లే విమానం స్కిడ్‌ అయిందని ఏర్‌పోర్ట్‌ జనరల్‌ మేనేజర్‌ రాజ్‌ కుమార్‌ ఛెత్రీ అల్‌ జజీరా ఛానెల్‌కు తెలిపారు. ప్రమాదం నుంచి పైలట్‌ బతికి బయటపడి చికిత్స పొందుతున్నాడు. కారణాలు వెంటనే చెప్పలేమని, సాంకేతిక వైఫల్యం కారణమై ఉండొచ్చని భావిస్తున్నామని, బ్లాక్‌ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సంజీవ్‌ గౌతమ్‌ చెప్పారు. చనిపోయిన వారిలో 33 మంది నేపాలీలు, మిగిలిన వారు బంగ్లాదేశీయులు. క్రాష్‌ల్యాండ్‌ అవడానికి ముందు విమానంలో పెద్ద కుదుపు, శబ్దం వచ్చాయని, తామంతా ఉలిక్కి పడ్డామని బతికి బయటపడ్డ బసంతా బొహ్రా అనే నేపాలీ యువకుడు చెప్పాడు. ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో ఎవరూ లేకపోవడం వల్ల మృతుల సంఖ్య అక్కడితో ఆగింది. ఇటీవలి కాలంలో నేపాల్‌లో విమాన ప్రమాదాలు కాస్త ఎక్కువయ్యాయి. 2016 ఫిబ్రవరిలో 16 మంది, 2014 ఫిబ్రవరిలో 18 మంది, 2012 మే నెలలో 15 మంది, సెప్టెంబరులో 19 మంది వివిధ విమాన ప్రమాదాల్లో చనిపోయారు.
 
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe