Breaking News

మా నాన్న సీఎంగా పని చేయలేదు

Mar 12, 2018 19:52 by Admin Admin

 ‘‘నన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిస్తున్నారని జగన్‌ అంటున్నారు. మరి... జగన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నడిపిస్తున్నారా? ఆయన మోదీ దర్శకత్వంలో నడుస్తున్నారా?’’ అని జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు... ‘‘నన్ను చంద్రబాబు మాత్రమే నడిపిస్తున్నారని జగన్‌ ఎందుకనుకుంటున్నారు? మోదీ నడిపిస్తున్నారని ఎందుకు అనుకోవడంలేదు’’ అని కూడా ప్రశ్నించారు. తానేమీ ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయాల్లోకి రాలేదని, రాజకీయాల్లో నిలదొక్కు కోవడం అంత తేలిక కాదని అన్నారు. అందువల్ల ప్రతి రోజూ శల్య పరీక్ష చేసేలా ప్రశ్నలు వేయవద్దని కోరారు. తాను ఎవరి ఆస్తులూ కొల్లగొట్టలేదని, దోచుకోలేదని పరోక్షంగా జగన్‌కు చురకలు అంటించారు. ‘‘మా నాన్న ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా పనిచేశారు. సీఎంగా పనిచేయలేదు’’ అని వ్యాఖ్యానించారు.

 
గుంటూరు జిల్లా కాజ గ్రామంలో సొంతింటి నిర్మాణానికి సోమవారం పవన్‌ దంపతులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యలను తనకు విన్నవించేందుకు ఏపీ నలు మూలల నుంచి హైదరాబాద్‌కు రావడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని... ప్రజలకు అందుబాటులో ఉండేందుకే అమరావతిలో ఇల్లు నిర్మిస్తున్నానని తెలిపారు. పార్టీ కార్యాలయం కూడా సమాంతరంగా నిర్మిస్తానని ప్రకటించారు. ఈనెల 19 దాకా అమరావతిలోనే ఉంటానని వెల్లడించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తాను మొదటి నుంచి గొంతెత్తుతున్నానని పవన్‌ తెలిపారు. ‘‘నా అభిప్రాయాలను దాచుకోను. సమస్యల నుంచి పారిపోను. బుధవారం నిర్వహించే బహిరంగ సభ వేదికపై నా రాజకీయ భవిష్యత్తు, కార్యాచరణపై స్పష్టంగా చెబుతాను. నాకు ఎవ్వరితోనూ వ్యక్తిగతంగా శత్రుత్వం ఉండదు. సాధ్యమైనంత వరకూ సయోధ్యతో వెళ్లేందుకే ప్రయత్నిస్తాను’’ అని పవన్‌ వివరించారు. పార్టీ కార్యాచరణ ఉగాది నాటికి వివరిస్తానని అన్నారు.
 
‘షార్ట్‌కట్‌’ నాకు గిట్టదు
2007 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నికల్లో పని చేసిన అనుభవమూ ఉందని పవన్‌ తెలిపారు. ఏదో దొడ్డి దారిన రాజకీయాల్లోకి వచ్చి షార్ట్‌కట్‌లో నాయకులు అయిపోయేవాళ్లంటే తనకు నచ్చదని అన్నారు. ఇటీవల జనసేనలో చేరిన మాదాసు గంగాధరం, నోవా కృష్ణారావులను చూపిస్తూ... పార్టీలో కొత్తవారే లేరనడం సరికాదన్నారు. తాను భావితరాలను దృష్టి పెట్టుకుని రాజకీయాలను నడపాలని అనుకుంటున్నానని అన్నారు.తాను ఆస్తులు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన ఆస్తులన్నీ క్లియర్‌గా ఉన్నాయని.. ఎవరినుంచో దోచుకున్నవి కావని తెలిపారు. రెండు దశాబ్దాలపాటు కష్టపడి సంపాదించానని పవన్‌ చెప్పారు. జనసేన పార్టీ విధానాలు మీడియాకు వెల్లడించడంలో కొంత వైఫల్యం కనిపిస్తోందని .. అందుకే 12 మందితో కూడిన స్పీకర్‌ ప్యానల్‌ను ప్రకటిస్తానని అన్నారు.
 
జనసేన ‘యువ’ గీతం
స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి యువత చేస్తున్న త్యాగాలు, బలిదానాలను స్మరిస్తూ, వారికి నివాళులు అర్పిస్తూ జనసేన ఒక గీతాన్ని రూపొందించింది. ఈ గీతాన్ని సోమవారం నాడు పార్టీ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది. ‘ఇంకెన్ని...’ అంటూ సాగే ఈ గీతాన్ని పార్టీ ఆవిర్భావ సభలోనూ వినిపిస్తారు.
 
 
సీనియర్లు ముఖ్యం...
కాలేజీ నుంచి ఉడుకు రక్తంతో ఉవ్వెత్తున రాజకీయాల్లోకి వచ్చిన అసోం గణపరిషత్‌ తర్వాత చల్లబడిపోవడాన్ని చూశాం. అందుకే యువతతోపాటు సీనియర్ల సలహాలనూ తీసుకుంటున్నాం. టెన్త్‌ విద్యార్థికి తోటి విద్యార్థి చదువు చెబితే బాగుంటుందా? అనుభవజ్ఞుల సలహాలు అవసరం!
- పవన్‌

Facebook like
Google Plus Circle
Youtube Subscribe