Breaking News

ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్‌ పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌

Mar 12, 2018 19:55 by Admin Admin

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులపై పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు సైబరాబాద్‌ పోలీసులు. ఎన్ని తనిఖీలు నిర్వహించినా.. ఎంతమందిని జైలుకు పంపి డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు చేసినా.. మందుబాబుల్లో మార్పు రావడంలేదు. ఇక ఓఆర్‌ఆర్‌ సంగతి అయితే చెప్పనవసరం లేదు. నగరంలోకి వచ్చే భారీ వాహనాలు, కార్లు ఓఆర్‌ఆర్‌ మీదుగా వచ్చి నగరంలోని సంబంధిత ప్రాంతాలకు చేరుతున్నాయి. ఓఆర్‌ఆర్‌పై ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకపోవడం, 100కి.మీకు పైగా వేగంతో వాహనాలు పరుగులు తీసే అవకాశం ఉండడంతో డ్రైవర్లు దూసుకుపోతున్నారు. మందేసి వాహనాలు నడిపే డ్రైవర్లయితే పరిమితికి మించి వేగంతో దూసుకుపోతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీరి వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చుక్కేసి వాహనాలను పరుగులు పెట్టిస్తున్న డ్రైవర్లకు చెక్‌ పెట్టడానికి, ఓ ఆర్‌ఆర్‌పై ప్రమాదాలు తగ్గించడానికి సైబరాబాద్‌ పోలీసులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. వందలాది మంది పోలీసులుతో కలిసి ఓఆర్‌ఆర్‌పై వాహనాల ఎంట్రీ, ఎగ్జిట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంకెన్‌ డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయించారు. శుక్రవారం 300మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొని 30 ప్రదేశాల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. రాత్రి 8:30గంటలకు ప్రారంభమైన ఈ డ్రైవ్‌ తెల్లవారుజామున రెండుగంటల వరకు కొనిసాగింది. ఈ తనిఖీల్లో 137మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ.. పోలీసులకు చిక్కారు. మద్యం తాగి కారు నడుపుతూ.. 90మంది పట్టుబడగా.. భారీ వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు 41మంది దొరికారు. ఆటోట్రాలీలు 3, ద్విచక్ర వాహనాలు 3, పట్టుబడ్డాయి.

 
ఎప్పుడైనా.. ఎక్కడైనా..
ఈ ప్రత్యేక డ్రైవ్‌ ఇక నుంచి రెగ్యులర్‌గా నిర్వహించనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌ ఇప్పటికే కొనసాగుతుండగా.. సైబరాబాద్‌ పరిధిలోని ఓ ఆర్‌ఆర్‌లో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం ఓఆర్‌ఆర్‌లో ఎక్కువ భాగం సైబరాబాద్‌ పరిధిలో ఉండడం.. తనిఖీలు తక్కువగా నిర్వహస్తుండటంతో వాహనాదారులు రెచ్చిపోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ.. ప్రమాదాలు చేస్తున్నారు. ఇక నుంచి సైబరాబాద్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై ప్రతిరోజూ ఎప్పుడు.. ఎక్కడ ప్రత్యేక డ్రైవ్‌ చేపడతామో బయటికి చెప్పకుండా మద్యం బాబులకు చెక్‌ పెడతామని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొంటున్నారు. మార్చి-5 నుంచి 9 వరకు నాలుగు రోజులు నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 630మంది మందుబాబులు పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసిన ట్రాఫిక్‌ పోలీసులు చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 125 మందికి జైలు శిక్ష విధించింది. మద్యం తాగి పదే పదే పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న మందుబాబులు, ఎక్కువ మోతాదులో మద్యం సేవించి వాహనాలు నడిపిన 33 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లు కోర్టు రద్దు చేసింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe