Breaking News

లెఫ్ట్‌, వైసీపీ, జనసేన మద్దతు.. శాంతియుతంగా టీడీపీ నిరసన

Mar 21, 2018 18:06 by Admin Admin

 ప్రత్యేక హోదా కోసం చేపట్టిన పోరు ఉద్యమ పంథాలోకి మారుతోంది. ఢిల్లీలో హోదా కోసం ఎంపీలు పోరాడుతుంటే.. క్షేత్రస్థాయిలో యువతను, సామాన్య ప్రజలను కదిలించే దిశగా రాజకీయపార్టీలు సమాయత్తం అవుతున్నాయి. 13 జిల్లాల్లోనూ గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా జాతీయ రహదారులను దిగ్బంధించాలని ప్రధాన రాజకీయపక్షాలన్నీ నిర్ణయించాయి. టీడీపీ కూడా శాంతియుతంగా నిరసనలు తెలియజేయనుంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఇటీవల సీపీఎం, సీపీఐలు ప్రజాసంఘాల ఐక్యవేదిక పేరిట నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపిచ్చాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్వహించే కార్యక్రమమైనందున నిరసనకు నైతిక మద్దతును తెలియజేస్తున్నామని టీడీపీ వివరించింది.

 
అధికారంలో ఉన్నందున బంద్‌లూ, రాస్తారోకోలలో పాల్గొనే అవకాశం లేదని పేర్కొంది. ఈ ఆందోళనకు వైసీపీ సంఘీభావం తెలిపింది. రహదారుల దిగ్బంధంలో పొల్గొనాలని పార్టీ శ్రేణులను జగన్‌ ఆదేశించారు. కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతును ఇచ్చింది. విజయవాడ కనకదుర్గమ్మ వారధి దగ్గర జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్‌ పాల్గొంటుందని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి తెలిపారు. జనసేన కూడా హోదా కోసం చేసే పోరాటంలో పాల్గొంటామని స్పష్టం చేసింది. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా నిరసన తెలపాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సూచించారు. అన్ని పక్షాలూ రహదారుల దిగ్బంధనానికి సిద్ధం కావడంతో కార్యక్రమం విజయవంతం అవుతుందని, హోదా డిమాండ్‌ మరింతగా జనంలోకి వెళ్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
 
వైసీపీతో కలిసి వద్దు: కళా వెంకట్రావు
నిరసనలపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పార్టీ నేతలతో బుధవారం రాత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రహదారుల పక్కన టెంటులు వేసి నిరసన సభలు నిర్వహించాలని ఆయన సూచించారు. వైసీపీతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని స్పష్టంగా ఆదేశించారు. ఆందోళన ముసుగులో వైసీపీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని..అలాంటి వాటిపట్ల అప్రమతంగా ఉండాలని కళా వెంకట్రావు సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు. రాష్ట్ర బంద్‌ ఎంత శాంతియుతంగా నిర్వహించామో గురువారం నిరసనలు కూడా అలా హుందాగా ఉండాలన్నారు. చంద్రబాబు కూడా బుధవారం రాత్రి కొందరు పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
 
అన్ని పార్టీలు కలిసి రావాలి: చలసాని
అన్ని పార్టీలు కలిసి పోరాడితేనే హోదా సాధ్యమని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఉప్పల చంద్రశేఖర్‌ కల్యాణ మండపంలో బుధవారం విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ‘ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ఆంధ్రుల ఆత్మ గౌరవ పోరాటం’ అంశంపై ఏర్పాటైన సదస్సులో ఆయన మాట్లాడారు. కాగా, నిరసనల నేపథ్యంలో విశాఖలో పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులతోపాటు ఉద్యోగులు ఇతర పనులపై వెళ్లేవారంతా ఉదయం పది గంటల కంటే ముందే గమ్యానికి చేరుకోవాలని ట్రాఫిక్‌ ఏడీసీపీ రమేశ్‌కుమార్‌ సూచించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe