Breaking News

ఉన్నతాధికారులపై బాంబే హైకోర్టు అక్షింతలు

Sep 03, 2018 17:45 by Admin Admin

హక్కుల నాయకుల కేసు విచారణలో మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులపై బాంబే హైకోర్టు అక్షింతలు వేసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై అరెస్టయిన వరవరరావు, ఇతరులకు సంబంధించిన కేసు గురించి రాష్ట్ర అదనపు డీజీ, ఇతర అధికారులు మీడియాతో మాట్లాడిన పద్ధతి సరికాదని హైకోర్టు పేర్కొంది. సతీశ్‌ గైక్వాడ్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల అరెస్టయిన వామపక్ష, హక్కుల నాయకులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని రుజువు చేసేందుకు పటిష్ఠమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆ మీడియా సమావేశంలో అదనపు డీజీ పరంబీర్‌ సింగ్‌, పుణే పోలీసులు చెప్పారు. మావోయిస్టులు, హక్కుల నాయకులకు మధ్య జరిగినట్లు చెబుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలను సింగ్‌ చదివి వినిపించారు. ఈ కేసులో సాక్ష్యాధారాలుగా ఉపయోగపడే ఆ ఉత్తరాలను బహిరంగంగా ఎలా చదివి వినిపిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘పోలీసులు అలా ఎలా వ్యవహరిస్తారు? ఇది కోర్టు పరిధిలో ఉంది. ఈ మొత్తం వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఇలాంటి కేసుల్లో సమాచారాన్ని వెల్లడించడం తప్పు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోరేగావ్‌ భీమా కేసులో గత మంగళవారం వరవరరావు సహా మరో ఐదుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe