Breaking News

దెయ్యం పట్టిందని కుంకుమ నీళ్లు తాగించిన వైనం

Nov 15, 2018 18:50 by Admin Admin

సూరత్‌లో కంజి కుంభార్ (50) అనే వ్యక్తి వజ్రాలను మెరుగుపెట్టే వ్యాపారం చేస్తున్నాడు. గతకొన్ని రోజుల నుంచి కుంభార్ ఇంట్లో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అది గమనించిన కుటుంబ సభ్యులంతా అతడికి ఎవరో చేతబడి చేశారని, దెయ్యం పట్టిందని నమ్మడం మొదలుపెట్టారు. బాధితుడికి కుంకుమ కలిపిన నీళ్లను తాగించిన కుటుంబ సభ్యులంతా అతని ఛాతిపై ఎగిరి దూకారు. ఇలా చేస్తే అతడికి పట్టిన దెయ్యం వదిలిపోతుందని వారి విశ్వాసం. అలా పదేపదే చేయడంతో ఊపిరి ఆడక కుంభార్ మృతిచెందాడు.

అతడి మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేసి వారంతా ఎక్కడికో వెళ్లిపోయారు. ఈ నెల 13న మృతుడి భార్య హన్సా తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. తమ ఇంట్లో తన భర్త చనిపోయి ఉన్నాడని తెలిపింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. కుంభార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా అందులో అతడిది సహజ మరణం కాదని తేలింది. మృతుడి కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజాన్ని కక్కేశారు. మృతుడి కుటుంబ సభ్యుల్లో భార్య హన్స (45), కుమారులు ప్రకాశ్ (20), దినేశ్ (19), కుమార్తె హెటల్ (23), కోడలు నిషితా (19) ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Facebook like
Google Plus Circle
Youtube Subscribe