Breaking News

తెలంగాణలో ఆలిండియా ఎయిమ్స్ ఏర్పాటు

Dec 17, 2018 21:59 by Admin Admin

తెలంగాణలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం పచ్చజెండా ఊపింది. సోమవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌తోపాటు తమిళనాడులోని మదురైలో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఎయిమ్స్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు ఇటీవలే కేంద్ర ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపింది. తాజాగా కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో పనులు ముమ్మరంగా సాగనున్నాయి. నిర్మాణం పూర్తయిన ఒక హాస్పిటల్‌కు ఎయిమ్స్ హోదా దక్కడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 150 పడకలతో ఉన్న నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీనగర్ క్యాంపస్‌ను ఎయిమ్స్‌గా మార్చుతారు. ఇందుకోసం రూ.1,028 కోట్లు వెచ్చించనున్నారు.

 

15 నుంచి 20 వరకు సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 750 పడకలతో ఇక్కడ ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఫలితంగా 1500 ఔట్‌పేషెంట్లకు, వెయ్యిమంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందే అవకాశం లభించనుంది. ఇక్కడ ఏర్పాటుచేసే వైద్య కళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎమర్జెన్సీ, ట్రామా, ఆయుష్, ఐసీయూ, సూపర్‌స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటుచేస్తారు. వైద్య కళాశాల సహా ఇతర సదుపాయాలన్నీ 45 నెలల్లో ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe