Breaking News

కనీస మద్దతు ధర భారీగా పెంపు

Jul 04, 2018 11:45 by Admin Admin

దేశంలోని రైతన్నల ఆదాయం మెరుగుపడేలా కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. వరి పంటలపై కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.200 పెంచుతున్నట్టు ప్రకటించింది. రైతులకు ఉత్పత్తి ధరకంటే 50 శాతం అధికంగా మద్దతు ధర చెల్లిస్తామన్న హామీని నెరవేర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.
 
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 1న 2018 బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ.. రైతులకు ఉత్పత్తి ధరకంటే 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర చెల్లిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం కనీస మద్దతు ధర పెంచడంతో ఆహారోత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు తాజా నిర్ణయంతో ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
 
 ఈ ఏడాది 14 రకాల ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధర పెంచేందుకు ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.  వరి (కామన్ గ్రేడ్) కనీస మద్దతు ధర రూ.200 పెరిగి క్వింటాల్‌కు రూ.1,750కి చేరుకుంది. గ్రేడ్-ఎ రకం కూడా రూ.160 పెరడంతో క్వింటాల్ రూ. 1,750కి చేరుకుంది. ఇక జొన్నలకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.730, రాగులు క్వింటాల్‌కు రూ.997కు చేరుకున్నాయి. వీటితో పాటు పత్తి మీడియం స్టాపిల్, లాంగ్ స్టాపుల్ రకాలపై క్వింటాల్‌‌కు రూ. 1130 పెంచారు. 2007-08 నుంచి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.745 నుంచి రూ.1550 వరకు పెరగడం విశేషం.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe