Breaking News

విమానాల మార్కెట్‌కు రెక్కలు

Jul 06, 2018 16:58 by Admin Admin

విమానయానానికి వర్థమాన ఆర్థిక వ్యవస్థల్లో పెరుగుతున్న డిమాండు, చౌక ధరల విమానయాన సంస్థలు సాధించిన అద్భుత విజయం రానున్న రెండు దశాబ్దాల్లో విమానాల డిమాండు గణనీయంగా పెరగడానికి దోహదపడే అంశమని ఎయిర్‌బస్‌ పేర్కొంది. ప్రపంచ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండును పరిగణనలోకి తీసుకుంటే రెండు దశాబ్దాల్లో 37,400 విమానాలకు డిమాండు ఉంటుందని, వాటి విలువ 5.8 లక్షల కోట్ల డాలర్లని (రూ.394 లక్షల కోట్లు) ఆ సంస్థ అంచనా వేసింది. గత ఏడాది ఎయిర్‌బస్‌ వేసిన అంచనా 5.3 లక్షల కోట్ల డాలర్లు. 20 సంవత్సరాల కాలంలో ప్రయాణికుల విమానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న దానికి రెట్టింపు పెరిగి 48 వేలకు చేరుతుందని, అంటే 2037 నాటికి 37,390 కొత్త విమానాలు అవసరమని తాజా ప్రకటనలో ఎయిర్‌బస్‌ అంచనా వేసింది. 
 
వచ్చే రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా విమానయానం 4.4 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. ప్రైవేటు వినియోగం 2.4 రెట్లు పెరగవచ్చునని ఎయిర్‌బస్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ ఎరిక్‌ షుల్జ్‌ పేర్కొన్నారు. పెరుగుతున్న విమానయాన అవసరాలకు దీటుగా రెండు దశాబ్దాల్లోనూ ఐదు లక్షలకు పైగా పైలట్లకు డిమాండు ఉంటుందని కూడా తెలిపింది. ఎ320 నియోలకి ఇంధన సామర్థ్యం గల ఇంజన్ల కొరత కారణంగా విమానాల డెలివరీ సరైన సమయంలో చేయడంపై అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది తాము కొత్తగా 800 విమానాలు సరఫరా చేయాలనుకుంటున్నట్టు ఎయిర్‌బస్‌ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. కెనడాకు చెందిన బొంబార్డియర్‌తో ఈ సంస్థ గత నెలలో భాగస్వామ్యం కుదుర్చుకోగా ఎంబ్రాయర్‌ కంపెనీతో తాజాగా బోయింగ్‌ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో విమానాల తయారీ మార్కెట్‌లో వేడి పెరిగింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe