Breaking News

పవన్ అన్నంత పని చేస్తారా

Nov 04, 2019 02:11 by Admin Admin

 విశాఖ వేదికగా రాష్ట్రంలో ఇసుక కొరతతో ఇబ్బందిపడుతున్న నిర్మాణ కార్మికుల సమస్య పరిష్కారం కోసం జనసేనాని లాంగ్ మార్చ్ పేరుతో సమర శంఖం పూరించారు. ఏపీలో ఇసుక కొరతపై తన నిరసన తెలియజేస్తూ, భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంతే కాదు రెండు వారాలు గడువిచ్చి వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. రెండు వారాల్లో సమస్య పరిష్కారం చెయ్యకుంటే ఎవరు అడ్డుపడినా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు .


లాంగ్ మార్చ్ ను సక్సెస్ చేసి చూపించిన జనసైన్యం పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ఏమేరకు సక్సెస్ అవుతుంది అని అనుమానాలు వ్యక్తం చేసిన వారందరికీ జనసేన పార్టీ పిలుపుమేరకు లాంగ్ మార్చ్ లో పాల్గొన్న జనసైనికులు సమాధానం చెప్పారు. ఇసుకేస్తే రాలనంత మంది జనం పవన్ కళ్యాణ్ తో పాటుగా లాంగ్ మార్చ్ లో పాల్గొని నిర్మాణ రంగ కార్మికులను కాపాడాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ విజయవంతమైనది. పవన్ కళ్యాణ్‌‌తో పాటు పలువురు విపక్ష పార్టీల నేతలు సైతం ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొన్నారు.

జగన్ కు రెండు వారాల డెడ్ లైన్ విధించిన ప్రభుత్వం లాంగ్ మార్చ్ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ సర్కార్‌పై జనసేనాని నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి లేక ఇప్పటివరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలు రోడ్డున పడడానికి ప్రభుత్వమే కారణమని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌కు రెండు వారాల డెడ్ లైన్ విధించారు పవన్ కళ్యాణ్.

కూల్చివేతలతో మొదలు పెట్టిన ప్రభుత్వం కూలిపోతుందన్న పవన్ నిర్మాణరంగ కార్మికుల కోసం తాము చేసే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, పోలీసులను పెట్టుకున్నా, ఆర్మీని పిలిపించుకున్నా, ఎవరు ఆపుతారో చూస్తామని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ఇక అంతే కాదు ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన పాలనను కూల్చివేతలతో మొదలు పెట్టిందని ఇక ప్రస్తుతం తాజా పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కూడా కూలిపోతుందని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. అటు విజయసాయిరెడ్డిపై కూడా విమర్శలు చేసిన పవన్ పరిధి దాటితే తాట తీస్తానంటూ ఘాటుగా మాట్లాడారు.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe