Breaking News

వాతావరణ మార్పులపై చర్చ జరగాలి: నోబెల్‌ విజేతలు

Dec 08, 2019 05:22 by Admin Admin

 స్టాక్‌హోం: వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగాలని నోబెల్‌ బహుమతి విజేతలు అభిప్రాయపడ్డారు. బహుమతుల ప్రధానోత్సవానికి ముందు స్టాక్‌హోమ్‌లో ‘నోబెల్‌ వీక్‌'ను నిర్వహిస్తుంటారు. ఆ ఏడాది నోబెల్‌ విజేతలు ఇందులో పాల్గొంటారు. వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. ఈ ఏడాది నోబెల్‌ వీక్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో భౌతిక, రసాయన, ఆర్థిక శాస్త్ర నోబెల్‌ విజేతలు పాల్గొన్నారు. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో ప్రపంచ పర్యావరణ సదస్సు జరుగనున్న నేపథ్యంలో వాతావరణ మార్పుల గురించి విస్తృతంగా చర్చించాలని ప్రపంచదేశాలకు సూచించారు. భౌతిక శాస్త్ర విజేత డిడైర్‌ క్వెలోజ్‌ మాట్లాడుతూ.. ‘మనం ఈ గ్రహం మీదే పుట్టాం.. పరిణామం చెందాం. భూమిలాంటి మరో గ్రహం లేదు. కాబట్టి కొత్త గ్రహం గురించి వెతికేకన్నా ఇక్కడి సమస్యను పరిష్కరించడంపై దృష్టిసారించాలి’ అని సూచించారు. ఆర్థిక శాస్త్ర విజేత ఏస్తర్‌ డఫ్లో మాట్లాడుతూ.. అత్యధిక ఇంధనాన్ని, వనరులను వినియోగిస్తున్న అగ్రదేశాల ప్రవర్తనలో మార్పు రావాల్సి ఉన్నదన్నారు. రసాయన శాస్త్ర విజేత స్టాన్లీ విట్టింగ్‌హామ్‌ మాట్లాడుతూ పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజలే ముందకు వచ్చి పాలకులపై ఒత్తిడి తేవాలని సూచించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe